మోదీకి కవిత లేఖ రాస్తేనే.. బిల్లు పెట్టారనడం సిగ్గుచేటు: డీకే అరుణ

మోదీకి కవిత లేఖ రాస్తేనే.. బిల్లు పెట్టారనడం సిగ్గుచేటు: డీకే అరుణ

హైదరాబాద్, వెలుగు :  ప్రధాని నరేంద్ర మోదీకి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత లేఖ రాస్తేనే లోక్​సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు పెట్టారంటూ ఆ పార్టీ లీడర్లు చెప్పుకోవడం సిగ్గుచేటు అని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ విమర్శించారు. తాను రాసిన లేఖ కారణంగానే బిల్లు చర్చకు వచ్చిందని కవిత చెప్పుకుంటూ తిరగడంపై డీకే అరుణ మండిపడ్డారు. కవిత మీద ఉన్న ఆరోపణలు పక్కదారి పట్టించేందుకే బీఆర్ఎస్ లీడర్లు ఇలాంటి నాటకాలు ఆడుతున్నారని ఫైర్ అయ్యారు. మంగళవారం బీజేపీ స్టేట్ ఆఫీస్​లో డీకే అరుణ మీడియాతో మాట్లాడారు. 

‘‘మీ నాన్న కేసీఆర్.. నిన్ను తప్ప ఇతర మహిళలను గౌరవించడు. మీ పార్టీ రాష్ట్ర కమిటీలో కీలకమైన స్థానాల్లో మహిళలు ఎవరైనా ఉన్నారా? ఇటీవల ప్రకటించిన ఎమ్మెల్యే టికెట్లలో ఎందరు మహిళలు ఉన్నారు? ముందు వీటిపై మీ నాన్న నుంచి సమాధానం చెప్పించు’’అని కవితకు డీకే అరుణ సూచించారు. పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టులో తన శ్రమ కూడా ఉందని, ఈ విషయం మీ నాన్నకు కూడా తెలుసు అని డీకే అరుణ అన్నారు. ఈ విషయంలో తనను గౌరవించాల్సింది పోయి.. ఇష్టం వచ్చినట్లు తిడుతున్నారని మండిపడ్డారు. మహిళలను ఎలా గౌరవించాలో మీ నాన్నకు చెప్పాలని కవితకు డీకే అరుణ సూచించారు.

ఫస్ట్ ఈ మూడు గ్యారెంటీలు ఇవ్వండి..

కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీలు ఆచరణలో సాధ్యం కావని, మరోసారి తెలంగాణ ప్రజలను మభ్య పెట్టేందుకే ఆ పార్టీ ఇలాంటి ప్రకటనలు చేస్తున్నదని డీకే అరుణ ఆరోపించారు. కర్నాటక ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ఎంత దూరమైనా ఫ్రీగా జర్నీ చేయొచ్చని ఎన్నికలకు ముందు ప్రకటించి.. అధికారంలోకి వచ్చాక 30 కిలో మీటర్లకే పరిమితం చేశారని విమర్శించారు. 

ఆరు గ్యారంటీలు కాదని.. మూడు గ్యారెంటీలు ఇస్తే చాలని అన్నారు. కాంగ్రెస్​లో గెలిచిన ఎమ్మెల్యేలు ఇతర పార్టీల్లోకి వెళ్లరని, అధికారంలోకి వస్తే స్కామ్​లు ఉండవని, తెలంగాణ చరిత్రను తప్పుదారి పట్టించమనే మూడు గ్యారంటీలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సాధారణ వ్యక్తి ప్రధాని కావడం కాంగ్రెస్ జీర్ణించుకోలేకపోతున్నదని, గాంధీ పేరు పెట్టుకొని కాంగ్రెస్ రాజకీయాలు చేస్తున్నదని విమర్శించారు. కాంగ్రెస్​కు అధికారం కోసం ఆరాటం తప్ప, దేశం మీద చిత్తశుద్ధి లేదని ధ్వజమెత్తారు. కేంద్రంలో, రాష్ట్రంలో బీజేపీయే అధికారంలోకి వస్తుందన్నారు. తెలంగాణలో బీఆర్ఎస్, కాంగ్రెస్, మజ్లిస్ తోడు దొంగలని విమర్శించారు.