
బెంగళూరు : కర్నాటక ముఖ్యమంత్రిని ఎంపిక చేయడం కాంగ్రెస్ హైకమాండ్ కు పెద్ద తలనొప్పిగా మారింది. తనకే సీఎం సీటు ఇవ్వాలని సిద్ధరామయ్య ఒత్తిడి చేస్తుండగా.. పార్టీ గెలుపుకోసం కష్టపడ్డ తనకే సీఎం సీటు ఇవ్వాలని డీకే శివకుమార్ డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సిద్ధరామయ్య ఢిల్లీకి వెళ్లగా.. డీకే శివకుమార్ మాత్రం బెంగళూరులోనే ఉన్నారు. తన మద్దతుదారులతో సమావేశమైన తర్వాత డీకే శివకుమార్ పలు కీలక కామెంట్స్ చేశారు. ఒక దశలో కాంగ్రెస్ హైకమాండ్ కు గట్టి సంకేతాలు పంపించారు.
తన అధ్యక్షతన కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ 135 సీట్లు గెలుచుకుందని, వారందరి మద్దతు తనకే ఉందని డీకే శివకుమార్ వ్యాఖ్యానించారు. సీఎం ఎంపిక అంశాన్ని అధిష్ఠానానికి వదిలేస్తామని సీఎల్పీ సమావేశంలో తీర్మానం చేశామని, ఆ తర్వాత కొందరు వారి వ్యక్తిగత అభిప్రాయాలను పంచుకున్నారని చెప్పారు. ఇతరుల సంఖ్యా బలం గురించి తానేమీ మాట్లాడనని, కానీ.. తన సంఖ్యా బలం మాత్రం 135 అని చెప్పారు. అంతకుముందు తాను ఢిల్లీకి వెళ్తానని చెప్పిన డీకే.. గంటల వ్యవధిలో మాట మార్చారు. సీఎం అభ్యర్థి నిర్ణయాన్ని పార్టీ అధిష్ఠానానికే వదిలేశానని, అనారోగ్య కారణాల వల్ల తాను ఢిల్లీ వెళ్లట్లేదన్నారు.
ఒంటరిగానే 135 మంది ఎమ్మెల్యేలను గెలిపించానని చెబుతున్న డీకే.. అవసరమైతే నిరసన తెలుపుతానంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో సిద్ధరామయ్యకు ఆల్ ది బెస్ట్ అంటూ వ్యాఖ్యానించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
తన నివాసంలో ప్రెస్‌మీట్‌లో మాట్లాడిన డీకే శివకుమార్.. కాసేపటికే మరోసారి మీడియాతో మాట్లాడారు. ‘‘కాంగ్రెస్‌లో నాకంటూ ఓ వర్గం లేదు. ఎమ్మెల్యేలంతా నా వాళ్లే. ఒంటరిగా కాంగ్రెస్‌కు 135 సీట్లు తెచ్చిపెట్టా. పైగా కాంగ్రెస్ చీఫ్(మల్లికార్జున ఖర్గేను ఉద్దేశించి..) నావైపే ఉన్నారు. నా బలాన్ని ఎవరూ లాక్కోలేరు. వేరే వాళ్ల బలంపై నేను మాట్లాడను. అవసరమైతే నిరసన తెలుపుతా’’ అని వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ అధిష్టానంపై తిరుగుబాటు చేస్తారా...? అని మీడియా ప్రతినిధుల ప్రశ్నకు స్పందిస్తూ.. ‘‘నేనేం తిరుగుబాటు చేయను. బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడను. నేనేం బచ్చాగాడ్ని కాదు. నాకంటూ ఓ విజన్ నాకుంది. అలాగే పార్టీ పట్ల విధేయత కూడా ఉంది. ముందు పార్టీ అధిష్టానాన్ని నిర్ణయం తీసుకోనివ్వండి’’ అని డీకే శివ కుమార్ వ్యాఖ్యానించారు.