కాంగ్రెస్ హైకమాండ్ నుంచి పిలుపు.. ఢిల్లీకి డీకే శివకుమార్

కాంగ్రెస్ హైకమాండ్ నుంచి పిలుపు.. ఢిల్లీకి డీకే శివకుమార్

కర్ణాటక ముఖ్యమంత్రి ఎవరానేదానిపై ఉత్కంఠ వీడడం లేదు. సీఎం కుర్చీ కోసం సిద్ధరామయ్యతో పాటు డీకే  శివకుమార్ చివరి ప్రయత్నాలు చేస్తున్నారు. తనకే సీఎం సీటు ఇవ్వాలని సిద్ధరామయ్య ఒత్తిడి చేస్తుండగా.. పార్టీ గెలుపుకోసం కష్టపడ్డ తనకే సీఎం సీటు ఇవ్వాలని డీకే శివకుమార్ డిమాండ్ చేస్తున్నారు.

ఇద్దరూ సీనియర్ల ప్రతిపాదనల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రి అభ్యర్థిత్వం కత్తిమీద సాములా మారింది. ఎవర్ని ఎంపిక చేస్తే ఏమవుతుందోననే టెన్షన్ మొదలైంది. ఎన్నికల్లో గెలుపు ఒక ఎత్తయితే.. నాయకులను కాపాడుకోవడం, వారిని బుజ్జగించడం మరో ఎత్తులా మారింది. 

కర్నాకటలో సిద్ధరామయ్య, డీకే శివకుమార్ బలమైన సామాజిక నాయకులు కావడంతో ఇద్దరిలో ఏ ఒక్కరికి ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగిస్తే మరొకరు అలకబూని పార్టీలో విబేధాలు వచ్చే చాన్స్ ఉంది. కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం అందరూ ఏకతాటిపైకి వచ్చి పార్టీని గెలపించారు. కానీ... ఇప్పుడు సీఎం సీటు విషయంలో మాత్రం నాయకుల్లో క్లారిటీ రావడం లేదు. ఈ విషయం హైకమాండ్ కు పెద్ద టాస్క్ లా మారింది.

సీఎం సీటు విషయంలో సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌ మధ్య పోటీ తీవ్రంగా ఉండటంతో.. తుది నిర్ణయాన్ని అధిష్ఠానానికే వదిలేశారు. దీంతో సీఎం ఎంపిక కోసం పార్టీ హైకమాండ్‌ మల్లగుల్లాలు పడుతోంది. ఈ క్రమంలోనే సిద్ధరామయ్యను ఢిల్లీకి పిలిపించారు. కాంగ్రెస్ పెద్దలు పలు దఫాలుగా సిద్ధరామయ్యతో చర్చలు జరిపారు. 

మరోవైపు.. సిద్ధరామయ్య ఢిల్లీకి వెళ్లినా డీకే శివకుమార్ మాత్రం బెంగళూరులోనే తన మద్దతుదారులతో ఉన్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ హైకమాండ్ నుంచి డీకేకు కూడా ఫోన్ కాల్ రావడంతో ఆయన హుటాహుటిన ఢిల్లీకి వెళ్లారు. ఇద్దరితోనూ పార్టీ పెద్దలు మాట్లాడే చాన్స్ ఉంది. అయితే..కాంగ్రెస్ హైకమాండ్ కు ఇద్దర్నీ ఒప్పించడం చాలా కష్టంగా మారింది. 

2018లో ఏర్పాటైన శాసనసభ గడువు ఈ నెల 24 నాటితో ముగుస్తుంది. ఆలోగానే నూతన ప్రభుత్వం కొలువుదీరాల్సి ఉంది. గతవారం వెలువడిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్‌ 135 స్థానాలతో విజయం సాధించిన విషయం తెలిసిందే.