ఎస్‎ఐఆర్‎పై డీఎంకే పార్టీ సంచలన నిర్ణయం

ఎస్‎ఐఆర్‎పై డీఎంకే పార్టీ సంచలన నిర్ణయం

చెన్నై: తమిళనాడులో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) వివాదం ముదిరింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు తమిళనాడులో సర్ ప్రక్రియ చేపట్టాలని కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) తీసుకున్న నిర్ణయంపై అధికార డీఎంకే పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. తమిళనాడులో సర్ ప్రక్రియను వ్యతిరేకిస్తూ డీఎంకే సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు డీఎంకే కార్యదర్శి ఆర్ఎస్ భారతి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత తమిళనాడులో సర్ ప్రక్రియ చేపట్టేలా ఎన్నికల సంఘానికి ఆదేశాలు ఇవ్వాలని ఆయన కోరారు. 

కాగా, 2026లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తమిళనాడు, పశ్చిమ బెంగాల్ సహా 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో రెండవ దశ ఓటర్ల జాబితా సవరణ (సర్) పక్రియ చేపట్టాలని ఈసీ నిర్ణయించిన ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు తమిళనాడులో సర్ ప్రక్రియ చేపట్టాలన్న ఈసీ నిర్ణయాన్ని డీఎంకే పార్టీ తీవ్రంగా వ్యతిరేకించింది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత సర్ ప్రక్రియ నిర్వహించాలని ఈసీని కోరింది.

డీఎంకే అభ్యర్థనను ఈసీ తిరస్కరించింది. ఈ క్రమంలో సర్ ప్రక్రియపై చర్చించేందుకు సీఎం స్టాలిన్ అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో తమిళనాడుతో సహా 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో రెండవ దశ ఓటర్ల జాబితా సవరణకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టును ఆశ్రయించాలని డీఎంకే పార్టీ తీర్మానించింది. ఈ మేరకు సర్‎కు వ్యతిరేకంగా ఆ పార్టీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.