ఒక్క ఓటు.. ఒకే ఒక్క ఓటుతో ఓడిన మంత్రి.. టైం అంటే ఇదే కదా..

ఒక్క ఓటు.. ఒకే ఒక్క ఓటుతో ఓడిన మంత్రి.. టైం అంటే ఇదే కదా..

ఓటు చాలా విలువైనది.. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి.. అని పదే పదే అధికారులు చెబుతుంటారు. కానీ కొందరు ఓటు హక్కును నిర్లక్ష్యం చేస్తారు.. నా ఒక్క ఓటు వేయకపోతే పోయేది ఏం లేదులే.. నా ఒక్క ఓటుతో ఏమి మారిపోదులే అంటుంటారు. కానీ ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటు వజ్రాయుధమే. ప్రతి ఓటుకూ విలువ ఉంటుంది. ఒక్క ఓటుకు మొత్తం ఫలితాన్నే మార్చగలిగే శక్తి ఉంటుంది. తాజాగా జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అక్షరాలా ఇది నిరూపితమైంది. కేవలం ఒకే ఒక్క ఓటుతో తేడాతో ఓ మంత్రి ఓటమి పాలు అయ్యారు. మరీ ఒకే ఓటుతో ఓడిపోయిన ఆ మంత్రి ఎవరు ఆ వివరాలు ఏంటో తెలుసుకుందాం..

చెన్నై: తమిళనాడు 2026 అసెంబ్లీ ఎన్నికల్లో సింగిల్ ఓట్ పవరేంటో మరోసారి నిరూపితమైంది. కేవలం ఒకే ఒక్క ఓటు తేడాతో తమిళనాడు సహకార శాఖ మంత్రి, నాలుగు సార్లు ఎమ్మెల్యే కె.ఆర్. పెరియకరుప్పన్ తిరుపత్తూరు నియోజకవర్గంలో ఓటమి పాలయ్యారు. టీవీకే అభ్యర్థి  శ్రీనివాస్‌ ఒక్క ఓటు మెజార్టీతో విజయం సాధించారు. శ్రీనివాస్ 83,375 ఓట్లు సాధించగా.. పెరియకరుప్పన్‎కు 83,374 ఓట్లు పడ్డాయి. 

తద్వారా ఒకే ఒక్క ఓటు తేడాతో టీవీకే అభ్యర్థి శ్రీనివాస్‌ విజయం సాధించగా.. పెరియకరుప్పన్ ఊహించని పరాజయాన్ని చవిచూశారు. ఒకే ఓటు తేడా కావడంతో పెరియకరుప్పన్ అభ్యర్థన మేరకు అధికారులు రీకౌంటింగ్ నిర్వహించారు. అయినప్పటికీ  శ్రీనివాస్‌ ఒక ఓటు తేడాతో విజయం సాధించారు.

కేవలం ఒక్కటంటే ఒక్క ఓటు తేడాతో ఒక రాష్ట్ర మంత్రి ఓటమి పాలైన వార్త దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‎గా మారింది. ప్రజాస్వామ్యంలో ఒక ఓటు విలువ ఎంత శక్తివంతమైనదో మరోసారి చర్చకు దారి తీసింది. ఓటు హక్కును ఎవరూ నిర్లక్ష్యం చేయొద్దని.. ప్రతిఒక్కరూ ఓటు వినియోగించుకోవడం ఎంత ముఖ్యమో ఈ ఘటన మరోసారి రుజువు చేసింది.

తొలి ఎన్నికల్లోనే టీవీకే ప్రభంజనం: 

తమిళనాడులో నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కజగం(టీవీకే) పార్టీ అరంగేట్రంలోనే అదరగొట్టింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ప్రభంజనం సృష్టించింది. తొలి ప్రయత్నంలోనే అద్భుత విజయంతో అధికారానికి చేరువైంది. తమిళనాడులో విజయ్ టీవీకే పార్టీ మొత్తం 234 సీట్లకుగాను108 సీట్లలో జయకేతనం ఎగురవేసింది. రాష్ట్రంలో అధికార డీఎంకే పార్టీ 73 స్థానాలకు, ప్రతిపక్ష అన్నాడీఎంకే 53 సీట్లకు పరిమితమయ్యాయి. అయితే, టీవీకే అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ మ్యాజిక్ ఫిగర్‌(118 సీట్లు)కు మరో10  సీట్ల దూరంలో నిలిచిపోయింది.