- హస్తం పార్టీకి 29 సీట్లు, ఒక రాజ్యసభ స్థానం
- ఖర్గే అంగీకరించడంతో పొత్తుపై సంతకాలు చేసిన ఇరుపార్టీలు
చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. అధికార ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే), కాంగ్రెస్ పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు వ్యవహారం బుధవారం ఓ కొలిక్కి వచ్చింది. రాష్ట్రంలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 28 లేదా 29 స్థానాల్లో పోటీ చేయనుంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆదేశాల మేరకు డీఎంకేతో సీట్ల సర్దుబాటు ఒప్పందంపై కాంగ్రెస్ అధికారికంగా సంతకం చేసింది. పొత్తు ప్రకారం..కాంగ్రెస్ తమిళనాడులో ఈసారి 28 లేదా 29 స్థానాల్లో పోటీ చేయనుంది.
2021 ఎన్నికలతో(25) పోల్చితే ఈసారి కాంగ్రెస్ పోటీ చేసే స్థానాల సంఖ్యను పెంచుకుంది. కాంగ్రెస్ కు అసెంబ్లీ స్థానాలతో పాటు ఒక రాజ్యసభ స్థానాన్ని ఇచ్చేందుకు కూడా డీఎంకే అంగీకరించింది. పొత్తు గురించి సీఎం స్టాలిన్‌తో కాంగ్రెస్ సీనియర్ నేత పి. చిదంబరం ఇటీవల ముఖాముఖి చర్చలు జరిపారు. అనంతరం ఇరుపార్టీల మధ్య జరిగిన సీట్ల సర్దుబాటుకు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
సీట్లపై కాంగ్రెస్ వెనక్కి తగ్గడంతోనే..!
234 అసెంబ్లీ సీట్లు ఉన్న తమిళనాడులో 2021 అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే ప్రొగ్రెసివ్ సెక్యులర్ ప్రొగ్రెసివ్ అలయన్స్ సుమారు 158 సీట్లు గెలిచింది. కాంగ్రెస్ 25 స్థానాల్లో పోటీ చేయగా.. 17 స్థానాల్లో గెలిచింది. ఈసారి కాంగ్రెస్ పార్టీ 34 సీట్లు కావాలని పట్టుబట్టింది. కనీసం 30 సీట్లయినా ఇవ్వాలని డీఎంకేను డిమాండ్ చేసింది. ఒకానొక దశలో నటుడు విజయ్ స్థాపించిన టీవీకే పార్టీ నుంచి వస్తున్న ఆఫర్లను సాకుగా చూపుతూ డీఎంకేపై తీవ్ర ఒత్తిడి తెచ్చింది. దాంతో 28 లేదా 29 స్థానాలు ఇచ్చేందుకు డీఎంకే హామీ ఇవ్వడంతో ఇరుపార్టీల కూటమి నిలపడింది.
ఈ సందర్భంగా కాంగ్రెస్ ఎంపీ మాణిక్కం ఠాగూర్ మాట్లాడుతూ.."వ్యక్తుల మధ్య అభిప్రాయభేదాలు ఉండవచ్చు. కానీ పార్టీనే అందరికంటే పెద్దది. హైకమాండ్ నిర్ణయం తీసుకున్నప్పుడు క్రమశిక్షణతో దానికి కట్టుబడి ఉండాల్సిందే" అని పేర్కొంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఇరుపార్టీల మధ్య సయోధ్య కుదిరినప్పటికీ.. గత కొన్ని వారాలుగా జరిగిన మాటల యుద్ధంతో క్షేత్రస్థాయిలో కార్యకర్తలు ఏ మేరకు కలిసి పనిచేస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
