హైదరాబాద్, వెలుగు: వరి కొయ్యకాలు, ఇతర పంట వ్యర్థాలు కాల్చడం వల్ల భూసారం దెబ్బతినడంతో పాటు పర్యావరణం, ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందని అగ్రికల్చర్ డైరెక్టర్ డాక్టర్ బీ గోపి పేర్కొన్నారు. తాత్కాలిక సౌలభ్యం కోసం పంట వ్యర్థాలను కాల్చడం వల్ల రైతులకు దీర్ఘకాలంలో తీవ్ర నష్టం జరుగుతుందని తెలిపారు. “పంట వ్యర్థాలు – భూమికి బలం”అనే నినాదంతో రైతులు పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని, భూమి ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ సుస్థిర వ్యవసాయం దిశగా ముందుకు సాగాలని సోమవారం ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు.
మంత్రి ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఏఈవోలు, ఏవోలు రైతులకు పంట అవశేషాల దహనంతో కలిగే నష్టాలపై విస్తృత అవగాహన కల్పించాలని ఆదేశించారు. ఈ మేరకు క్షేత్రస్థాయి అధికారులకు ప్రత్యేక సూచనలు జారీ చేసినట్టు తెలిపారు. పంట అవశేషాలను కాల్చడంతో నేలలోని సేంద్రియ కర్బనం, నత్రజని, భాస్వరం, పొటాష్‌తోపాటు సూక్ష్మపోషకాలు నశించి భూమి నిస్సారంగా మారుతుందని వివరించారు.
ప్రత్యామ్నాయ పద్ధతులు అనుసరించాలి
పంట అవశేషాల నిర్వహణకు రైతులు ప్రత్యామ్నాయ పద్ధతులను అనుసరించాలని గోపి సూచించారు. రోటవేటర్, ష్రెడర్‌లాంటి యంత్రాల సహాయంతో వ్యర్థాలను భూమిలోనే కలియదున్నాలని తెలిపారు. పర్యావరణ పరిరక్షణ చట్టం–1986, రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 27 ప్రకారం పంట అవశేషాలను బహిరంగంగా కాల్చడం నిషేధమని తెలిపారు. ఈ ఘటనలపై రూ.5 వేల వరకు ఫైన్ అమల్లో ఉందన్నారు.
