మనం ఏ స్థాయిలో ఉన్నా.. మన భాష, యాసను మరవొద్దు: మంత్రి వివేక్ వెంకటస్వామి

మనం ఏ స్థాయిలో ఉన్నా.. మన భాష, యాసను మరవొద్దు: మంత్రి వివేక్ వెంకటస్వామి
  • విదేశాల్లో తెలుగును పరిరక్షిస్తున్న సంఘాలకు పురస్కారాలు అందజేయాలి
  • ప్రపంచంలోని తెలుగువాళ్లందరినీ ఏకం చేసేందుకు తెలుగు వర్సిటీ కృషి చేయాలి
  • మన సంస్కృతిని కాపాడుకుంటూ ఇతరులకు స్ఫూర్తిగా నిలవాలని పిలుపు 

బషీర్​బాగ్, వెలుగు: మనం ఏ స్థాయిలో ఉన్నా.. మన భాష, యాస, సంస్కృతిని మర్చిపోవద్దని రాష్ట్ర కార్మిక, మైనింగ్ శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు. తెలుగు భాష, సాహిత్యం, లలిత కళా ప్రక్రియలను విదేశాల్లో పరిరక్షిస్తున్న తెలుగు సంఘాలను గుర్తించి పురస్కారాలను అందజేయాలని ఆయన సూచించారు. సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం విస్తరణ సేవా విభాగం ఆధ్వర్యంలో తెలుగు భాష, సాహిత్యం, నృత్య కళలు తదితర ప్రక్రియలలో విశేషమైన కృషి చేస్తున్న 12 మంది ప్రముఖులకు 2024 సంవత్సరానికి గాను ప్రతిభా పురస్కారాలను శనివారం నాంపల్లి లోని తెలుగు వర్సిటీ ఆడిటోరియంలో ప్రదానం చేసి సత్కరించారు. 

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి వివేక్ వెంకటస్వామి హాజరై మాట్లాడారు. ఇంగ్లిష్ మీడియం పాఠశాలలో చదువుకున్నప్పటికీ రాజకీయాల్లో ఉండడం వల్ల తెలుగుతో అనుబంధం పెరిగిందని గుర్తు చేసుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్లను ఏకం చేయడానికి తెలుగు వర్సిటీ కృషి చేయాలని హితవుపలికారు. మన సంస్కృతిని కాపాడుకుంటూ మంచి ఆలోచనలతో ముందుకు సాగుతూ ఇతరులకు స్ఫూర్తిగా నిలవాలన్నారు. పురస్కారాలు భావితరాలకు స్ఫూర్తిని కలిగిస్తాయని పేర్కొన్నారు. 

తెలుగు వర్సిటీ ప్రగతికి తన వంతు సహాయ సహకారాలు ఉంటాయన్నారు. తాము వీ6 చానెల్ ను ప్రారంభించినప్పుడు చానెల్ లోగా ప్రజల్లో కనెక్టివిటీ ఉండాలని చాలా ఆలోచించి పెట్టామని తెలిపారు. ఈ యూనివర్సిటీకి మంచి లోగో తయారు చేసిన లక్క నరేందర్ కు అవార్డు ఇవ్వడం అభినందనీయమని అన్నారు. 

ఆఫ్రికన్ దేశాలలో తెలుగు బోధనకు శ్రీకారం చుట్టాలి:  వ్యాస కృష్ణ

ఉగాండాలో నివసించే ప్రవాసాంధ్రులు వ్యాస కృష్ణ మాట్లాడుతూ.. ఆఫ్రికన్ దేశాలలో ఉన్న తెలుగు సంఘాలతో సంప్రదింపులు జరిపి అక్కడి తెలుగు పిల్లలకు తెలుగు బోధనకు శ్రీకారం చుట్టాలని కోరారు. తెలుగు వర్సిటీ అందజేస్తున్న కీర్తి పురస్కారాలకు నగదు పారితోషికాన్ని పెంచడానికి తన వంతుగా ఐదు లక్షల విరాళాన్ని ఆయన ఈ సందర్భంగా ప్రకటించారు. 

తెలుగు వర్సిటీ వీసీ ప్రొఫెసర్​ వి. నిత్యానందరావు ప్రసంగిస్తూ.. బాచుపల్లిలోని ప్రాంగణంలో మౌలిక సదుపాయాలను పెంచడానికి ప్రభుత్వం కృషి చేయాలని కోరారు. రిజిస్ట్రార్ ఆచార్య కోట్ల హనుమంతరావు, విస్తరణ సేవా విభాగం ఇన్​చార్జి రింగు రామ్మూర్తి కార్యక్రమంలో పాల్గొన్నారు. 

ప్రతిభా పురస్కారాలను కవిత్వంలో డాక్టర్ యాకూబ్, పరిశోధనలో డాక్టర్ ఎం ఏ శ్రీనివాసన్, చిత్రలేఖనంలో లక్క నరేందర్, శిల్పం ప్రక్రియకు గాను బైరోజు చంద్రశేఖర్, నృత్య కళలో డాక్టర్ ఆర్ ప్రసన్న రాణి, పత్రికా రంగానికి గానం కె. కైలాశ్, నాటక రంగంలో దుప్పల్లి శ్రీరాములు, జానపద కళారంగానికి గజవెల్లి సమ్మయ్య, అవధాన ప్రక్రియకు ఆముదాల మురళి, ఉత్తమ రచయిత్రిగా డాక్టర్ పులిగడ్డ విజయలక్ష్మి, నవల, కథ ప్రక్రియ గాను పోల్కంపల్లి శాంతాదేవి అందుకున్నారు. పురస్కార గ్రహీతలకు ఒక్కొక్కరికి 20 వేల116 నగదుతో పాటు శాలువా, అభినందన పత్రంతో మంత్రి వివేక్ వెంకటస్వామి సత్కరించారు.