
తెలంగాణ రాష్ట్రంలోనే భారీ మెజార్టీతో మెదక్ పార్లమెంటు స్థానం నుంచి కొత్త ప్రభాకర్‌రెడ్డి గెలవబోతున్నారని మాజీమంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. గురువారం రాత్రి సిద్దిపేట అర్బన్ మండలం ఎన్సాన్ పల్లిలో జిల్లా పరిషత్ ఎన్నికల సందర్భంగా నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. అభ్యర్థులు నచ్చకపోయినా తనకోసం కారు గుర్తుకు ఓట్లు వేయాలని కోరారు. ఎంపీటీసీలు, జడ్పీటీసీలు పని చేయకపోతే వాళ్లతో తాను పని చేయిస్తానని, ఎండిపోయిన చెరువులను రానున్న రోజుల్లో కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లతో నింపుతానని తెలిపారు. సిద్దిపేట పారిశ్రామికవాడలో డీఎన్ఎక్స్ పరిశ్రమ ఏర్పాటవుతోందని, దీనిలో రెండు వేల మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తామని అన్నారు. జోడెడ్లు సరిగ్గా ఉండేలా టీఆర్‌ఎస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. సర్పంచ్, ఎంపీటీసీలు రెండు కండ్లవంటి వారని, ఏ పథకమైనా ప్రజల వద్దకు చేరాలంటే జోడెడ్లు బావుండాలని అన్నారు. రానున్న రోజుల్లో అన్ని చెరువులు నీటితో కళకళలాడనున్నాయని, గతంలో మాదిరిగా చేద బావుల్లోంచి నీళ్లను చెంబుల్లో తోడుకునే రోజులు రానున్నాయని అన్నారు. వ్యక్తులు కాదు పార్టీ ముఖ్యమని, తనను చూసి ఓట్లు వేసి టీఆర్‌ఎస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఎంపీ కొత్త ప్రభాకరరెడ్డి మాట్లాడుతూ రాబోయే కాలంలో సిద్దిపేటను అన్ని రకాలుగా అభివృద్ధి చేసుకుందామని అన్నారు. సభలో ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థులను ప్రజలకు పరిచయం చేశారు.