విద్యను తరగతి గదులకు పరిమితం చేయొద్దు: మోడీ

విద్యను తరగతి గదులకు పరిమితం చేయొద్దు: మోడీ

న్యూఢిల్లీ: చదువును క్లాస్ రూమ్స్ కే పరిమితం చేయొద్దని ప్రధాని మోడీ సూచించారు. 21వ శతాబ్దిలో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ (ఎన్ఈపీ) విధానంలో స్కూల్ ఎడ్యుకేషన్ అనే కార్యక్రమం ముగింపులో మోడీ పాల్గొన్నారు. వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ఈ కార్యక్రమంలో ప్రధాని మాట్లాడారు. దేశ విద్యా విధానంలో ఎన్ఈపీ తీసుకురాబోయే మార్పులను గురించి మోడీ వివరించారు. ఎన్ఈపీతో కొత్త శకం మొదలు కాబోతోందని, దాని అమలుపై దృష్టి సారించాలన్నారు.

‘గత మూడు దశాబ్దాల్లో దేశ విద్యా విధానంలో ఎలాంటి మార్పులు రాలేదు. ఈ నేపథ్యంలో కొత్త ఎడ్యుకేషన్ పాలసీని తీసుకు రావడం క్లిష్టంగా మారింది. అలాగే ఈ పాలసీని సరైన రీతిలో అమలు చేయాల్సి ఉంటుంది. పాలసీ అమలుపై తలెత్తుతున్న ప్రశ్నలు చాలా క్లిష్టమైనవి. విద్యను క్లాస్ రూమ్స్ కే పరిమితం చేయొద్దు. బాహ్య ప్రపంచంతో చదువును అనుసంధానం చేయాలి. ఇది విద్యార్థులతోపాటు మొత్తం సమాజంపై ప్రభావం చూపుతుంది. సులువుగా, వినూత్నంగా ఉండే పద్ధతులను అవలంబించాలి. పిల్లల్లో మ్యాథమెటికల్, సైంటిఫిక్ థింకింగ్ పెరగాలి. మ్యాథమెటికల్ అంటే ప్రాబ్లమ్స్ ను పరిష్కరించడమే కాదు. వాళ్లలో ప్రశ్నించేతత్వం పెరగాలి. తద్వారా వారిలో తెలుసుకోవాలనే కుతూహలం పెరుగుతుంది’ అని మోడీ చెప్పారు.