అతి నిర్లక్ష్యం ఎంత ప్రమాదకరమో తెలుసా.?

అతి నిర్లక్ష్యం ఎంత ప్రమాదకరమో తెలుసా.?

 

​వసంతవాడ గ్రామంలో సుబ్బయ్య, పుల్లయ్య అనే ఇద్దరు చిన్ననాటి మిత్రులు ఉండేవారు. వారిద్దరి మనస్తత్వాలు పూర్తిగా విరుద్ధం. సుబ్బయ్యది నిత్యం నిర్లక్ష్యపు పోకడ. ఏ పని చేసినా ‘‘ఏదైతే అదవుతుందిలే’’ అన్న ధోరణి. అతనికి ముందు జాగ్రత్త అస్సలు ఉండేది కాదు. దీనికి భిన్నంగా పుల్లయ్య ప్రతి విషయంలోనూ అతి జాగ్రత్తగా వ్యవహరించేవాడు. తన అతి జాగ్రత్త కారణంగా కొన్నిసార్లు అనవసరంగా కష్టపడేవాడు, అందుకే గ్రామస్తులు కొందరు అతన్ని వ్యంగ్యంగా ‘పిచ్చి పుల్లయ్య’ అని పిలిచేవారు.

​ఆ రోజు వసంతవాడలో మధ్యాహ్నం వేళ, సుబ్బయ్య ఇంటి పక్కన ఉన్న పాత పూరి గుడిసెలో అనుకోకుండా అగ్నిప్రమాదం సంభవించింది. 
వాతావరణం పొడిగా ఉండటంతో మంటలు క్షణాల్లో పెరిగి, చుట్టుపక్కల ఇళ్లకు వ్యాపించేంత స్థాయిలో ఎగసిపడ్డాయి. గ్రామస్తులు భయాందోళన చెందుతూ, పెద్దగా అరుస్తూ, నీళ్లు తెచ్చి మంటలు ఆర్పడానికి శ్రమిస్తున్నారు. ​అదే సమయంలో సుబ్బయ్య తన పొలానికి బయలుదేరుతున్నాడు. పొరుగున ఇంత పెద్ద ప్రమాదం జరుగుతున్నా, జనం హాహాకారాలు చేస్తుంటే కూడా సుబ్బయ్య ఏ మాత్రం కంగారు పడలేదు. మంటల దగ్గరికి వెళ్లడానికి బదులు, చేతిలో ఉన్న టవల్‌‌ను సర్దుకుంటూ పుల్లయ్య ఇంటి వైపు నడిచాడు.‘‘ఊళ్లో పెళ్లికి కుక్కల హడావిడి అన్నట్లుంది ఈ గొడవంతా. కొందరి అతి ఉత్సాహం అంతే. దానికి ఇంత హడావిడి అవసరమా?” నిర్లక్ష్యంగా అంటూ పుల్లయ్య ఇంటి ముందుకు వెళ్లాడు.​పుల్లయ్య తన ఇంటి ముందు నిలబడి, పైకప్పుకు నీళ్లు చల్లుకుంటున్నాడు. మండుతున్న గుడిసెకు, తన ఇంటికి మధ్య 300 మీటర్ల దూరం ఉంది. పుల్లయ్య ఆ పని చేయడం చూసిన సుబ్బయ్య మళ్లీ నవ్వి, ‘‘ఏమిటి పుల్లయ్యా, ఈ తడి తమాషా?’’ అని అడిగాడు.

​పుల్లయ్య ఆశ్చర్యపోయి, ‘‘సుబ్బయ్యా! నీ ఇంటి పక్కన మంటలు చెలరేగుతుంటే ఇంత నిర్లక్ష్యంగా పొలానికి ఎలా వెళ్తున్నావు? మీ బజారులో మంటలు లేస్తే, నా ఇంటికి అంటుకుంటాయని నేను నా ఇంటిని తడుపుకుంటున్నాను. కనీసం నీ ఇంటినైనా తడుపుకోవచ్చుగా?’’ అన్నాడు.

​సుబ్బయ్య నవ్వి, ‘‘అతి జాగ్రత్త పనికిరాదు. అందుకే నువ్వు పిచ్చి పుల్లయ్యవి’’ అన్నాడు.​అంతలో సుబ్బయ్య కొడుకు నరేష్ భయంతో పరుగెత్తుకుంటూ వచ్చి, ‘‘నాన్నా, మన ఇంటికి నిప్పంటుకుంది! తొందరగా రా!’’ అని ఏడుస్తూ చెప్పాడు.అది వినగానే సుబ్బయ్య గుండెల్లో రాయి పడ్డట్టయ్యింది. పుల్లయ్యతో సహా ముగ్గురూ పరుగు పరుగున అక్కడికి చేరుకున్నారు. పొరుగు గుడిసె నుంచి సుబ్బయ్య ఇంటికి మంటలు పూర్తిగా వ్యాపించాయి. కాలిపోతున్న ఇంటిని చూసి సుబ్బయ్య బోరున విలపించాడు. తన నిర్లక్ష్యం వలన కష్టపడి సంపాదించుకున్న ఆస్తి క్షణాల్లో బూడిదైపోవడం చూసి, పశ్చాత్తాపంతో కుమిలిపోయాడు.

సుబ్బయ్యను ఓదార్చుతూ, ‘‘నా అతి జాగ్రత్త వల్ల శ్రమ వృథా అయ్యింది గానీ, నీ నిర్లక్ష్యం వల్ల ఎంత అనర్థం జరిగిందో చూడు. ఇకనైనా అతి నిర్లక్ష్యం ఎంత ప్రమాదకరమో తెలుసుకుందాం. సరైన సమయానికి తగిన జాగ్రత్తగా ఉండటం నేర్చుకుందాం’’ అన్నాడు.​సుబ్బయ్య సిగ్గుతో తలదించుకున్నాడు. ఆ రోజు నుంచి సుబ్బయ్యలో మార్పు వచ్చింది. నిర్లక్ష్యం వల్ల కలిగే నష్టాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకుని, జీవితంలో జాగ్రత్తగా ఉండాలని నిశ్చయించుకున్నాడు.

-  డా. పోతగాని సత్యనారాయణ