
న్యూఢిల్లీ: భారత్, -పాక్ మధ్య కాల్పుల విరమణకు తానే మధ్యవర్తిత్వం చేశానని అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ పదే పదే చేస్తున్న ప్రకటనలపై ఎంఐఎం చీఫ్ , హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తీవ్ర విమర్శలు చేశారు. "వైట్ హౌస్‌లో కూర్చున్న విదేశీయుడు భారత్, పాక్ మధ్య సీజ్ ఫైర్ ఒప్పందం కుదిర్చానని పదే పదే ప్రకటిస్తున్నాడు.
ఇదేనా మీ(మోదీ సర్కార్) జాతీయవాదం..? పదే పదే ట్రంప్ చేస్తున్న ఈ ప్రకటన మన జవాన్లకు ఏం సందేశం పంపుతుంది..? నా స్వంత ప్రధాన మంత్రి ఎందుకు సీజ్ ఫైర్ ప్రకటించలేదని సముద్రంలో విధులు నిర్వర్తిస్తున్న మన నేవీ ఆఫీసర్ కచ్చితంగా ఆశ్చర్యపోతాడు" అని ఒవైసీ పేర్కొన్నారు.
"పాకిస్తాన్‌తో దౌత్య సంబంధాలను నిలిపివేశారు. వారి విమానాలను మన గగనతలంలోకి రాకుండా చేశారు. వారి నౌకలు మన జలాల్లోకి రాకుండా అడ్డుకున్నారు. రక్తం, నీరు ఒకేసారి ప్రవహించవని పేర్కొంటూ.. పాకిస్తాన్‌కు 80% నీటిని ఆపేస్తున్నాం. అలాంటప్పుడు పాకిస్తాన్‌తో క్రికెట్ మ్యాచ్ ఎలా ఆడిస్తారు? సెప్టెంబర్ 14న యూఏఈలో జరగనున్న ఆసియా కప్‌లో పాకిస్తాన్‌తో భారత్.. క్రికెట్ మ్యాచ్ ఆడించొద్దని పేర్కొన్నారు.