నన్ను హీరోను చేయొద్దు.. సీజేపీ చీఫ్అభిజీత్ దీప్కే.. ఒక్క వ్యక్తిని హీరోగా చేయడం వల్లే దేశం నాశనమైంది

నన్ను హీరోను చేయొద్దు.. సీజేపీ చీఫ్అభిజీత్ దీప్కే.. ఒక్క వ్యక్తిని హీరోగా చేయడం వల్లే దేశం నాశనమైంది
  • సామూహిక పోరాటంతోనే ఈ విజయం  
  • గుర్తుంచుకోండి.. కాక్రోచ్‌‌‌‌‌‌‌‌తో పెట్టుకోవద్దని హెచ్చరిక 


న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను తన వ్యక్తిగత విజయంగా భావించి సంబరాలు చేసుకోవద్దని సీజేపీ అధ్యక్షుడు అభిజీత్ దీప్కే శనివారం తన మద్దతుదారులకు విజ్ఞప్తి చేశారు. ఇది దేశ యువత సాధించిన ప్రజాస్వామ్య విజయమని, ఈ ఉద్యమం వ్యక్తి కంటే చాలా గొప్పదని స్పష్టం చేశారు. ప్రధాన్ రాజీనామా ప్రకటన తర్వాత దీప్కే జంతర్ మంతర్ వద్ద తన మద్దతుదారులను ఉద్దేశించి మాట్లాడారు.

‘‘మేం దీన్ని సాధించాం. మీరు భయపడకపోతే గెలవగలరని ప్రధాన్ రాజీనామా నిరూపించింది...’’ అని చెప్పారు. ‘‘ఈ ప్రభుత్వానిది రాజీనామాలు చేసే తత్వం కాదని వారు అనేవారు. కానీ, ఎవరైనా తలవంచేలా చేయగలిగితే ప్రపంచమే తలవంచుతుందని మేం చెబుతున్నాం” అని అన్నారు.

‘‘ధర్మేంద్ర ప్రధాన్ ఈరోజు రాజీనామా చేశారని నన్ను హీరోను చేయవద్దు. ఈ తప్పు చేయవద్దు. ఒక్క వ్యక్తిని హీరోగా చేయడం వల్లే ఈ దేశం సర్వనాశనమైంది” అని అన్నారు. ఈ ఉద్యమం సామూహిక ప్రజా భాగస్వామ్యంతో నడిచిందని, దీనిని ఏ ఒక్క నాయకుడి విజయంగా భావించరాదన్నారు.

కాగా, నిరుద్యోగ యువతను కాక్రోచ్‌‌లు అని సంబోధిస్తూ సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ చేసిన వ్యాఖ్యలే ఈ ఉద్యమానికి కారణమయ్యాయంటూ ఆయనకు దీప్కే కృతజ్ఞతలు తెలిపారు. ‘‘మీరు నన్ను కాక్రోచ్ అనకపోతే, నేను భారతదేశానికి తిరిగి వచ్చేవాడిని కాదు. దేశ యువత వీధుల్లోకి వచ్చేవాళ్ళు కారు. ప్రధాన్ రాజీనామా జరిగి ఉండేది కాదు” అని అన్నారు. ‘‘గుర్తుంచుకోండి..  కాక్రోచ్‌తో పెట్టుకోవద్దు’’ అని ఆయన హెచ్చరించారు.