- విశాఖ గూగుల్ ఏఐ డేటా సెంటర్ ప్రాజెక్టుపై పున: సమీక్షించాలి
- ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఆందోళన
పెద్దపల్లి, వెలుగు: కార్పొరేట్ కంపెనీల కోసం పేదల భూములు తీసుకోవద్దని పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ అన్నారు. అదానీ భాగస్వామిగా విశాఖపట్నంలో పెడుతున్న గూగుల్ ఏఐ డేటా సెంటర్ ప్రాజెక్టు వల్ల స్థానికులకు ఎంత ప్రయోజనం ఉంటుందో చెప్పాలని మంగళవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ప్రశ్నించారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేశ్ ఈ ప్రాజెక్ట్‌లకు భూమి పూజ చేస్తుంటే స్థానిక ప్రజలు, దళితులు ఆందోళన చేసిన విషయాన్ని గుర్తు చేశారు.
ప్రజల భూములు లాక్కుంటున్నారన్న విమర్శలు వస్తున్నాయని, కోట్ల విలువైన భూములను అతి తక్కువ ధరలకు కంపెనీలకు అప్పగించడం అన్యాయమని విమర్శించారు. ఆత్మనిర్భర్ భారత్ అంటే దేశ యువతకు, చిన్న పరిశ్రమలకు, స్థానిక కంపెనీలకు అవకాశాలు కల్పించాలని, విదేశీ, కార్పొరేట్ కంపెనీలకే ప్రయోజనం కలిగేలా ప్రభుత్వాలు వ్యవహరించడం ప్రజల ఆత్మగౌరవానికి విరుద్ధమన్నారు.
దళితుల హక్కులను కాలరాసేలా నిర్ణయాలు తీసుకుంటే ప్రజలు చూస్తూ ఊరుకోరన్నారు. గూగుల్ ఏఐ డేటా సెంటర్ల వల్ల భవిష్యత్తులో నీటి కొరత, కాలుష్యం, విద్యుత్ భారం పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు. అమెరికా లాంటి చోట్ల ఇలాంటి సమస్యలు తలెత్తాయని, ఇక్కడా ఆ పరిస్థితి రాకుండా చూడాలని, ఈ ప్రతిపాదనలను పునసమీక్షించాలని సూచించారు.
అభివృద్ధి పేరుతో ప్రజల భూములు, హక్కులు కోల్పోయే పరిస్థితి రావొద్దని, దళితులు, పేదలు, రైతుల హక్కులను కాపాడే విధంగా ప్రభుత్వం ముందుకు వెళ్లాలని ఎంపీ గడ్డం వంశీకృష్ణ సూచించారు.
