- ఆకునూరి మురళి రిపోర్టుపై తప్పుడు ప్రచారాలు నమ్మొద్దు
- ప్రభుత్వం వద్ద 14 నివేదికలు.. ఎక్స్ పర్ట్స్ స్టడీ తర్వాతే నిర్ణయం
- అవసరమైన మార్పులు, చేర్పులతో పకడ్బందీగా కొత్త విద్యాచట్టం తెస్తం
హైదరాబాద్, వెలుగు: విద్యాకమిషన్ నివేదికపై తప్పుడు ప్రచారాలు నమ్మవద్దని, కేవలం నెల రోజుల్లోనే రాష్ట్ర సమగ్ర విద్యావిధానాన్ని (టీఈపీ) అధికారికంగా ప్రకటిస్తామని ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు స్పష్టం చేశారు. ప్రభుత్వ టీచర్ల జీతాలు తగ్గిస్తారనే ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదన్నారు. ఆకునూరి మురళి సమర్పించిన రిపోర్టులో ఉన్నవి ప్రతిపాదనలు మాత్రమేనని, దీనిపై ప్రభుత్వం ఎక్స్‌పర్ట్ కమిటీతో లోతైన అధ్యయనం చేయిస్తుందన్నారు. ప్రభుత్వం దగ్గర 14 నివేదికలున్నాయని, ఆయా కమిటీలు చేసిన సిఫార్సులు, సూచించిన మార్పులు, చేర్పులను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే పకడ్బందీగా నూతన విద్యాచట్టాన్ని తీసుకువస్తామన్నారు.
విద్యావ్యవస్థలో గుణాత్మక మార్పులు తెచ్చేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో కసరత్తు చేస్తున్నదని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. సెక్రటేరియెట్లో బుధవారం కేశవరావు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా నూతన విద్యావిధానంపై పలు కీలక అంశాలను వెల్లడించారు.
ఆకునూరి మురళి నేతృత్వంలోని కమిటీ ఇచ్చిన నివేదికపై కొందరు అనవసర రాద్ధాంతం చేస్తున్నారు. దాన్ని యథాతథంగా ప్రభుత్వం ఆమోదించినట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఈ ముసాయిదాను త్వరలోనే పబ్లిక్ డొమైన్‌లో పెట్టి, విద్యావేత్తలు, మేధావులు, ప్రజల నుంచి విస్తృత స్థాయిలో అభిప్రాయాలు సేకరిస్తాం. పీఎల్ విశ్వేశ్వర్ లాంటి సీనియర్ విద్యావేత్తలతో చర్చించి, లోటుపాట్లను సవరించిన తర్వాతే తుది నిర్ణయానికి వస్తాం’ అని స్పష్టం చేశారు.
జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ) లోని కొన్ని అసంబద్ధమైన నిబంధనలను గుడ్డిగా అనుసరించబోమని, రాష్ట్ర పరిస్థితులకు అనుగుణంగానే ప్రణాళికలు రచిస్తున్నామన్నారు. మూడేళ్ల ప్రాయంలోనే పిల్లలను బడికి పంపాలన్న కేంద్రం నిబంధన ఆచరణ సాధ్యం కాదని, ఇలాంటి వాటిపై నిపుణుల సలహాలు తీసుకుంటామన్నారు. అన్ని వర్గాల ఆమోదంతో కూడిన ఒక అత్యుత్తమ, ప్రగతిశీల విద్యా విధానాన్ని రూపొందించడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని కేకే స్పష్టం చేశారు.
