మూసీ ఒడ్డున ఉన్న పేదలందరికీ డబుల్ బెడ్ రూం ఇండ్లు: సీఎం రేవంత్

మూసీ ఒడ్డున ఉన్న పేదలందరికీ డబుల్ బెడ్ రూం ఇండ్లు: సీఎం రేవంత్

మూసీ ప్రక్షాళనకు ప్రజలు సహకరించాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. మూసీ ఒడ్డున ఉన్న పేద ప్రజలందరికీ శాస్వత నివాసం ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఆదివారం (సెప్టెంబర్ 28) అంబర్ పేటలో బతుకమ్మ కుంటను ప్రారంభించిన సీఎం.. స్థానిక ఎమ్మెల్యే, ప్రజలు సహకరిస్తేనే బతుకమ్మ కుంట కల సాకారం అయ్యిందని అన్నారు. 

అదే విధంగా మూసీ ప్రక్షాళన జరగాలంటే అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు.  కోవిడ్ తర్వాత విపరీమైన మార్పులు వచ్చాయని.. కేవలం రెండు గంటల్లోనే 40 సెం.మీ. వ ర్షం కురిసే పరిస్థితి వచ్చిందని అన్నారు. ఒకప్పుడు ఇలాంటి పరిస్థితి లేదన్న సీఎం.. 1908 లో వర్షాలకు చాలా మంది చనిపోతే.. మోక్షగుండం విశ్వేరయ్య ప్రణాళిక ద్వారా మూసీ అభివృద్ధి జరిగిందని అన్నారు. అందులో భాగంగానే ఉస్మాన్ సాగర్,హిమాయత్ సాగర్ నిర్మించారని అన్నారు. 

మంచి నీటి నది మూసీ..  ఇప్పుడు మురికి కూపంలా మారిందని అన్నారు సీఎం రేవంత్. చెరువులను పునరుద్ధరించడం.. మూసీని ప్రక్షాళన చేయడం బాధ్యతగా తీసుకున్నట్లు చెప్పారు, వర్షాలకు ఏ క్షణంలో మూసీ ఒడ్డున ఉన్న ఇండ్లు మునిగిపోతాయో తెలియని పరిస్థితి ఉందన్నారు. అందుకే ప్రజలు సహకరించాలని కోరారు. 

మూసీ నది ఒడ్డున గుడిసెలు కట్టుకున్న పేదల కష్టాలు, పేదరికం తనకు తెలుసున్న సీఎం.. వారికి తానెందుకు నష్టం చేస్తానని అన్నారు. వారిని ఖాళీ చేస్తే తనకేమొస్తుందని.. భవిష్యత్ తరాల కోసమే చేసేదని అన్నారు. అంబర్ పేటకు సంబంధించి ప్రత్యేక రివ్యూ చేయాలని ఆదేశించారు. 

చెరువులను కబ్జా చేస్తే తాట తీస్తామని చెప్పామని.. కబ్జాల ఆటలు సాగవని తమపై నిందలేస్తున్నారని ఈ సందర్భంగా అన్నారు సీఎం.