- ఇండ్ల మంజూరుకు సీఎం నిర్ణయించారని హైడ్రా కమిషనర్రంగనాథ్ ప్రకటన
- చెరువులను పునరుద్ధరించిన అన్ని చోట్లా ఇదే విధానం అమలు చేస్తమని వెల్లడి
హైదరాబాద్ సిటీ, వెలుగు: చెరువుల వద్ద ఇండ్లు కోల్పోయిన పేదలకు డబుల్ బెడ్ రూం ఇండ్లు మంజూరు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ తెలిపారు. మాధాపూర్‌లోని సున్నం చెరువుతో పాటు ఉప్పల్ నియోజకవర్గంలోని రామంతాపూర్ చెరువులో నివాసాలు కోల్పోయిన వారితో శుక్రవారం హైడ్రా ఆఫీసులో కమిషనర్ సమావేశమై మాట్లాడారు.
చెరువు పరిధిలో ఎన్ని గుడిసెలు ఉన్నాయి? ఎంత మంది నివాసం ఉంటున్నారు? అనే విషయాలపై సమాచారం సేకరిస్తున్నామని చెప్పారు. గూగుల్ మ్యాప్స్, శాటిలైట్ చిత్రాల ఆధారంగా అవకతవకలకు ఆస్కారం లేకుండా ఈ జాబితాను సిద్ధం చేస్తున్నామని తెలిపారు. 2024 జులై 19వ తేదీకి ముందు నివాసం ఉన్నవారి లెక్కలు సేకరిస్తున్నామన్నారు.
నగరంలో చెరువులను పునరుద్ధరించిన అన్ని చోట్ల ఇదే విధానాన్ని అనుసరించాలని సీఎం సూచించారని తెలిపారు. నల్గొండ,
నాగర్‌కర్నూలు, దేవరకద్ర, మహబూబ్‌నగర్, ఆంధ్రాలోని పలు జిల్లాలతో పాటు పరిగి, తాండూరు ప్రాంతాలకు చెందిన వారు ఆయా ప్రాంతాల్లో ఉన్నారు.
