లే ఆఫ్స్ డేటాతో కుప్పకూలిన అమెరికా స్టాక్ మార్కెట్...

 లే ఆఫ్స్ డేటాతో కుప్పకూలిన అమెరికా స్టాక్ మార్కెట్...

అమెరికా స్టాక్ మార్కెట్ మళ్లీ నష్టాల్లోకి జారుకుంది. ముఖ్యంగా టెక్నాలజీకి సంబంధించిన స్టాక్స్ అంటే టెక్ కంపెనీల షేర్లు మరోసారి  పడిపోవడం, అలాగే ఉద్యోగాల తొలగింపుల (layoffs) లెక్కలు బయటికి రావడంతో మార్కెట్‌పై ఒత్తిడి పెంచింది. దింతో డౌ జోన్స్ 400 పాయింట్లకు పైగా కోల్పోగా, S&P 500 1% కంటే పైగా  పడిపోయింది. నాస్డాక్ 1.9% పతనంతో తీవ్రంగా నష్టపోయింది.  

క్వాల్కమ్, AMD, టెస్లా, పలాంటిర్, మెటా, ఎన్విడియా వంటి టెక్ కంపెనీల షేర్లు 3% నుండి 7% వరకు పడిపోయి నష్టాల్లో ముందున్నాయి. క్వాల్కమ్ కంపెనీకి మంచి ఫలితాలు వచ్చినా భవిష్యత్తులో ఆపిల్‌ వల్ల వ్యాపారం కోల్పోయే అవకాశం ఉందనే భయాలతో షేర్లు దారుణంగా పడిపోయాయి.

ఇక ఉద్యోగాల తొలగింపుల డేటా ఇందుకు మరింత ఆందోళన పెంచింది. ఛాలెంజర్, గ్రే & క్రిస్మస్ సంస్థ చెప్పిన వివరాల ప్రకారం ఒక్క అక్టోబర్‌ నెలలో 1.53 లక్షలకు పైగా ఉద్యోగులను తీసేశారు. ఇది సెప్టెంబర్‌తో పోలిస్తే దాదాపు మూడు రెట్లు ఎక్కువ, అలాగే గత ఏడాదితో పోలిస్తే 175% ఎక్కువ.

గత 22 ఏళ్లలో అక్టోబర్‌లో జరిగిన ఈ అత్యధిక తొలగింపులు 2009 తర్వాత ఈ ఏడాది మొత్తంలోనే చాలా దారుణం. బ్లూమ్‌బెర్గ్  ప్రకారం కొత్తగా నిరుద్యోగ భృతి కోసం దరఖాస్తు చేసుకున్న వారి సంఖ్య కూడా గత వారం 2.19 లక్షల నుండి 2.28 లక్షలకు పెరిగింది. అయితే ఈ తొలగింపుల డేటా కారణంగా వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం పెరిగింది. డిసెంబర్ 10న ఫెడ్ (అమెరికా సెంట్రల్ బ్యాంక్) 25 బేసిస్ పాయింట్లు తగ్గిస్తుందనే అంచనా కూడా 61% నుండి 71%కి పెరిగింది.

మరోవైపు US ప్రభుత్వ కార్యకలాపాల షట్‌డౌన్  38వ రోజుకు చేరుకోవడంతో ఇది చరిత్రలోనే అతి పొడవైన ప్రభుత్వ షట్‌డౌన్ గా మారింది. దీనివల్ల FAA (విమానయాన సంస్థ), US రవాణా శాఖ, విమానాల సంఖ్యలో 10% కోత విధిస్తామని ప్రకటించాయి. దీని ఫలితంగా విమానయాన సంస్థలు ఇప్పటికే 400 విమానాలను రద్దు చేశాయి. US డాలర్ విలువ 100 మార్కు దగ్గర ఉండగా, గోల్డ్ ఫ్యూచర్స్ ధరలు ఔన్సుకు $4,000 మార్కు కంటే తక్కువగానే ఉన్నాయి. ఆగస్టులో 4.3%గా ఉన్న నిరుద్యోగత రేటు 2026 నాటికి 4.5%కి పెరిగే అవకాశం ఉందని నేషనల్ అసోసియేషన్ ఫర్ బిజినెస్ ఎకనామిక్స్ అంచనా వేసింది.