వరంగల్‎లో కార్పొరేటర్‍ నరేందర్‍ అరెస్ట్‎పై హైడ్రామా..!

వరంగల్‎లో కార్పొరేటర్‍ నరేందర్‍ అరెస్ట్‎పై హైడ్రామా..!

వరంగల్‍/కరీమాబాద్‍, వెలుగు: వరంగల్‍ తూర్పు అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలోని కాంగ్రెస్‍ కార్పొరేటర్‍‎పై అట్రాసిటీ కేసు నమోదు ఉమ్మడి జిల్లాలో చర్చనీయాంశమైంది. సొంత పార్టీకి చెందిన మహిళా కార్యకర్త ఫిర్యాదుతో పోలీసులు కార్పొరేటర్‏ను అదుపులోకి తీసుకుని స్టేషన్‎కు తరలించారు. దీంతో ఆయనకు మద్దతుగా అధికార పార్టీ నేతలు, బీజేపీ నేతలు, కుల సంఘాల నేతలు స్టేషన్ వద్దకు వెళ్లి ఆయన అరెస్ట్ ను ఖండించారు. మరోవైపు కంప్లయింట్ చేసిన మహిళకు మద్దతుగా ఎమ్మార్పీఎస్ నేత మంద కృష్ణ మాదిగ అనుచరులు తరలివెళ్లడంతో రోజంతా స్టేషన్ వద్ద హైడ్రామా చోటు చేసుకుంది. కార్పొరేటర్, కార్యకర్త చుట్టూనే పాలిటిక్స్ నడవడం హాట్ టాపిక్‎గా మారింది. 

వివరాల్లోకి వెళ్తే.. కాంగ్రెస్ కార్పొరేటర్ గుండేటి నరేందర్‍ తెలంగాణ ఉద్యమకారుడిగానే కాకుండా హ్యాట్రిక్ కార్పొరేటర్‎గా గెలిచిన గుర్తింపు ఉంది. కాగా, ఆయనతో కలిసి రెగ్యులర్ గా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనే మహిళా కార్యకర్త నమిండ్ల లావణ్య.. పని పేరుతో పిలిచి తనపై అఘాయిత్యం చేయబోయాడని కార్పొరేటర్ నరేందర్‍ పై ఆదివారం ఉదయం మిల్స్ కాలనీ పోలీసులకు కంప్లయింట్ చేసింది. వెంటనే కార్పొరేటర్ ను అదుపులోకి తీసుకున్నారు. ఆయన అరెస్ట్ సమాచారం తెలియడంతో మాజీ మంత్రి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, పార్టీ వరంగల్‍ జిల్లా అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ  పోలీసుస్టేషన్‍ వద్దకు వెళ్లి  రాజకీయ కక్షతో తప్పుడు కేసు పెట్టించారని ఆరోపించారు.

అదేవిధంగా బీజేపీ వరంగల్ తూర్పు సెగ్మెంట్ నేత ఎర్రబెల్లి ప్రదీప్‍రావు, బీఆర్‍ఎస్‍ మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‍ కూడా కార్పొరేటర్ అరెస్ట్ పై మండిపడ్డారు. మరోవైపు పద్మశాలి సంఘాల నేతలు కూడా కార్పొరేటర్ పై తప్పుడు కేసులు పెట్టాలని చూస్తే సహించబోమని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు మహిళా కార్యకర్తకు మద్దతుగా కొందరు మంద కృష్ణ మాదిగ అనుచరులు వెళ్లి కార్పొరేటర్ నరేందర్‍పై చర్యలు తీసుకోవాలని డిమాండ్‍ చేశారు. 

మంత్రి ప్రధాన అనుచరుడిపై ఆరోపణలు 

తూర్పు సెగ్మెంట్‎లో మంత్రి కొండా సురేఖ దంపతులు బిజీ షెడ్యూల్‍, అనారోగ్య కారణాలతో కొంతకాలంగా యాక్టివ్‎గా ఉండట్లేదు.  వీరి ప్రధాన అనుచరుడు అన్నీ తానై నడిపిస్తున్నట్టు.. ఇప్పటికే ఆయన మిల్స్ కాలనీ పోలీసులతో కలిసి పలు కేసుల్లో సెటిల్ మెంట్లు చేసినట్టు ఆరోపణలు వినిపించాయి. 

ఆయన కనునన్నల్లోనే కార్పొరేటర్‍ నరేందర్‎పై ఫిర్యాదు అందిన వెంటనే పోలీసులు అరెస్ట్ చేశారని అధికార, విపక్ష పార్టీల నేతలు పలువురు ఆరోపించారు. కాగా.. కార్పొరేటర్‍,  ఫిర్యాదు చేసిన మహిళ ఇద్దరూ అధికార పార్టీకి చెందినవారే.  మహిళ కంప్లయింట్ తోనే  కార్పొరేటర్ ను అదుపులోకి తీసుకున్నామని, ఎఫ్‍ఐఆర్‍ నమోదు చేయలేదని వరంగల్‍ ఏసీపీ నందిరాం నాయక్‍ తెలిపారు. పూర్తి స్థాయిలో దర్యాప్తు ఆధారంగా ముందుకువెళ్తామని చెప్పారు.