హనుమకొండ, వెలుగు: ఈనెల 28న ప్లానెట్స్ అలైన్మెంట్ ను పురస్కరించుకుని ఇస్రో ట్యూటర్, అన్సీంట్ టెక్నాలజీస్ డిజైన్ అండ్ రీసెర్చ్ ల్యాబ్ (ఏటీడీఆర్ఎల్) ప్రతినిధి శశాంక్ భూపతి నేతృత్వంలో 'రుద్రమ వి.1' అనే చిన్న మోడల్ రాకెట్ ను హనుమకొండలోని హయగ్రీవాచారి గ్రౌండ్ నుంచి నింగిలోకి పంపించనున్నారు. ఈ మేరకు మోడల్ రాకెట్ ప్రయోగం, స్టార్ గేజింగ్ కు సంబంధించి శనివారం రాత్రి వరంగల్ నిట్ లో అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
అనంతరం రాకెట్ మోడల్, లాంచ్ పాస్ తో కూడిన ఈవెంట్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా కుడా వైస్ చైర్మన్, గ్రేటర్ కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ మాట్లాడుతూ ఈ నెల 18 నుంచి పదిరోజుల పాటు భద్రకాళి బండ్ పై స్టార్ గేజింగ్ నిర్వహించేందుకు టెలీస్కోప్ లు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. 28న జరగనున్న ఖగోళ ఘటనను వీక్షించే అవకాశం కల్పిస్తామన్నారు. రాకెట్ ప్రయోగం అనంతరం కాళోజీ కళాక్షేత్రంలో ఇస్రో నిపుణులు, ప్రముఖ విద్యావేత్తలు, విశిష్ట అతిథులతో ప్యానెల్ చర్చలు, టాక్ షో కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు.
స్టార్ గేజింగ్ కార్యక్రమంలో ప్రజలకు సహాయపడేందుకు విద్యార్థులు వలంటీర్లుగా నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు. అంతకుముందు ఇస్రో నోడల్ సెంటర్ కోఆర్డినేటర్ ప్రొఫెసర్ ఎల్.ఆంజనేయులు జాతీయ విజ్ఞాన దినోత్సవ ప్రాముఖ్యాన్ని వివరించారు. నిట్ డైరెక్టర్ ప్రొ.బిద్యాదర్ సుబుధి మాట్లాడుతూ నగరంలో సమస్యల పరిష్కారానికి వరంగల్ నిట్ లో అందుబాటులో ఉన్న పరిశోధనా ప్రతిభను వినియోగించుకోవాలని సూచించారు.
నిట్ లోని ఆస్ట్రానమీ క్లబ్, శాటిలైట్ క్లబ్ కార్యకలాపాలు అభినందనీయమన్నారు. ఆ తర్వాత ఏటీడీఆర్ఎల్ ప్రతినిధి శశాంక్ వివిధ అంతరిక్ష సాంకేతిక రూపకల్పనల గురించి వివరించారు. స్రో నోడల్ సెంటర్ కోఆర్డినేటర్ ప్రొఫెసర్ ఎల్.ఆంజనేయులు, వరంగల్ నిట్ డైరెక్టర్ బిద్యాదర్ సుభుది, కుడా సీపీవో అజిత్ రెడ్డి, వరంగల్ నిట్ కు చెందిన ఆస్ట్రానమీ క్లబ్, శాటిలైట్ క్లబ్ ఫ్యాకల్టీ అడ్వైజర్లు ప్రొఫెసర్ శశి, ప్రొఫెసర్ చయన్ భార్, నిట్ స్టూడెంట్ టీమ్స్, వరంగల్ కిట్స్ విద్యార్థులు, మామునూరు జవహర్ నవోదయ విద్యార్థులు పాల్గొన్నారు.
