శత్రువులకు ఇక చుక్కలే: స్వదేశీ ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డిఫెన్స్ వెపన్ సిస్టమ్ పరీక్ష సక్సెస్

శత్రువులకు ఇక చుక్కలే: స్వదేశీ ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డిఫెన్స్ వెపన్ సిస్టమ్ పరీక్ష సక్సెస్

భువనేశ్వర్: భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (DRDO) అభివృద్ధి చేసిన స్వదేశీ ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డిఫెన్స్ వెపన్ సిస్టమ్ (IADWS) పరీక్ష విజయవంతం అయ్యింది. శనివారం (ఆగస్ట్ 23) మధ్యాహ్నం 12:30 గంటలకు ఒడిశా తీరంలో ఈ వాయు రక్షణ వ్యవస్థను పరీక్షించారు. ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డిఫెన్స్ వెపన్ సిస్టమ్ లక్ష్యాన్ని అత్యంత కచ్చితత్వంతో చేధించినట్లు అధికారులు వెల్లడించారు. ఆపరేషన్ సిందూర్ తర్వాత స్వదేశీ వాయు రక్షణను వ్యవస్థను పటిష్టం చేసుకోవడంలో భాగంగా ఈ కొత్త వాయు రక్షణ వ్యవస్థను పరీక్షించారు.

ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డిఫెన్స్ వెపన్ సిస్టమ్ ( IADWS) అనేది డీఆర్డీవో అభివృద్ధి చేసిన మల్టీ గైడెడ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. ఈ వాయు రక్షణ వ్యవస్థ ఉపరితలం నుంచి గగనతలానికి క్షిపణులు, చాలా తక్కువ శ్రేణి వాయు రక్షణ వ్యవస్థ (VSHORADS) క్షిపణులు, హైపవర్ లేజర్ ఆధారిత డైరెక్ట్ ఎనర్జీ వెపన్స్ (DEW) వ్యవస్థను కలిగి ఉంటుంది. IADWS శత్రు గగనతల ఆయుధాల నుంచి రక్షణ కల్పించనుంది. 

స్వదేశీ ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డిఫెన్స్ వెపన్ సిస్టమ్ (IADWS) పరీక్ష విజయవంతం కావడంతో డీఆర్డీవో, సాయుధ దళాలను కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అభినందించారు. ఈ మేరకు ఎక్స్ (ట్విట్టర్) వేదికగా పోస్ట్ పెట్టారు. ‘‘IADWS విజయవంతంగా అభివృద్ధి చేసినందుకు డీఆర్డీవో, భారత సాయుధ దళాలు, రక్షణ పరిశ్రమను అభినందిస్తున్నాను. ఈ ప్రత్యేకమైన విమాన పరీక్ష మన దేశం యొక్క బహుళ-స్థాయి వాయు-రక్షణ సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేసింది. శత్రు వైమానిక ముప్పులకు వ్యతిరేకంగా మన రక్షణను బలోపేతం చేయబోతోంది’’ అని పేర్కొన్నారు మంత్రి రాజ్‎నాథ్ సింగ్

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టిన విషయం తెలిసిందే. ఆపరేషన్ సిందూర్ కు కౌంటర్ గా దాయాది పాకిస్థాన్ దేశం మిస్సైళ్లు, డ్రోన్లతో ఇండియాపై దాడులకు తీవ్రంగా ప్రయత్నించింది. శత్రుదుర్భేద్యమైన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‎తో పాక్ దాడులకు ఎక్కడికక్కడ తిప్పికొట్టింది భారత్. ఆపరేషన్ సిందూర్‎తో భారత ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ బలమేంటో ప్రపంచానికి తెలిసింది. 

భవిష్యత్‎లో శత్రువుల నుంచి ఎదురయ్యే ముప్పులను సమర్థవంతంగా తిప్పికొట్టడానికి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‎ను మరింత స్ట్రాంగ్ చేసుకోవడంపై భారత్ దృష్టి పెట్టింది. ఇందులో భాగంగానే భారత సాయుధ దళాలు, డీఆర్డీవో సంయుక్తంగా ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డిఫెన్స్ వెపన్ సిస్టమ్ (IADWS)ను అభివృద్ధి చేశాయి. ఈ క్రమంలోనే ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డిఫెన్స్ వెపన్ సిస్టమ్‎ను పరీక్షించగా.. ప్రయోగం విజయవంతమైంది. IADWS లక్ష్యాలను కచ్చితత్వంతో ఛేదించింది. IADWS త్వరలోనే భారత అమ్ములపొదిలో చేరనుంది. 

ప్రస్తుతం ఇండియా ఉపయోగిస్తోన్న ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్:

  • S-400 వైమానిక రక్షణ వ్యవస్థ
  • ఆకాశ్ వైమానిక రక్షణ వ్యవస్థ
  • స్పైడర్ వాయు రక్షణ వ్యవస్థ
  • బరాక్-8 MK-SAM
  • ఇగ్లా-ఎస్ 
  • 9K33 ఓసా AK 
  • 2K12 కుబ్
  • క్యూఆర్ఎస్ఏఎం