- పెద్దపల్లి జిల్లాల్లోని బల్డియాల్లో తాగునీరు, డ్రైనేజీ సమస్యలు
- సమస్యలు పరిష్కరించాలంటున్న పట్టణవాసులు
పెద్దపల్లి/రాజన్నసిరిసిల్ల, వెలుగు: మున్సిపల్ ఎన్నికలు పూర్తయి కొత్త పాలకవర్గాలు ఏర్పడ్డాయి. ఈక్రమంలో మున్సిపాలిటీల్లోని పలు సమస్యలు పాలకవర్గాలకు వెల్‌కమ్ చెబుతున్నాయి. పెద్దపల్లి, రాజన్నసిరిసిల్ల జిల్లాల్లోని పలు మున్సిపాలిటీల్లో తాగునీరు, డ్రైనేజీ సమస్యలతోపాటు సిరిసిల్లలో ఫ్లడ్ ముప్పు, సెస్‌లో బకాయిల పెండింగ్, పెద్దబజార్ రోడ్డు వెడల్పు పనులు కొలిక్కి రాలేదు. పెద్దపల్లి, రామగుండం, మంథని, సుల్తానాబాద్ బల్దియాల్లో తాగునీరు, డ్రైనేజీ సమస్యలతో పట్టణవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత పాలకవర్గాల హయాం నుంచి ఈ సమస్యలు ఉన్న కొత్త పాలకవర్గాలు వీటిని పరిష్కరించాలని ఆయా బల్దియాల ప్రజలు కోరుతున్నారు.
పెద్దపల్లి జిల్లాలో మౌలిక వసతులపై ఫోకస్ చేయాలి
పెద్దపల్లి జిల్లాలో రామగుండం కార్పొరేషన్‌తోపాటు పెద్దపల్లి, సుల్తానాబాద్, మంథని పట్టణాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. పెరుగుతున్న పట్టణీకరణకు అనుగుణంగా మౌలిక వసతుల కల్పన జరగడం లేదు. కొంతకాలంగా ఆయా మున్సిపాలిటీల్లో తాగునీరు, డ్రైనేజీ సమస్యలు వేధిస్తున్నాయి. పెద్దపల్లి, సుల్తానాబాద్, మంథని పట్టణాల్లో వేసవి రాకముందే ట్యాంకర్ల ద్వారా నీటి సప్లై మొదలవుతుంది. గతంలో రెండు, మూడు రోజులకోసారి తాగునీరు ఇచ్చేవారు.
ఎన్ని పాలకవర్గాలు మారినా ఈ నీటి సమస్యను తీర్చలేకపోయారు. అన్ని మున్సిపాలిటీల్లో భగీరథ స్కీం ద్వారా పట్టణాల్లో భగీరథ ఇంట్రో పైప్లైన్లు ఏర్పాటు చేశారు. కానీ 50 శాతం పైగా లీకేజీలను గుర్తించారు. వాటిని నిత్యం రిపేర్లు చేయడంతోనే టైం సరిపోయింది. దీంతోపాటు కొత్తగా ఏర్పాటైన కాలనీల్లో సరైన డ్రైనేజీ వ్యవస్థ లేదు. దీంతో ఇండ్ల నుంచి డైరెక్ట్‌గా రోడ్లపైకి డ్రైనేజీ నీటిని వదులుతున్నారు. ఈ డ్రైనేజీ నీరు ఖాళీగా ఉన్న ప్లాట్లలో చేరి బురద గుంటలుగా తయారవుతున్నాయి. వాటిల్లో దోమలు, ఈగలు పెరిగి సమీప ఇండ్లల్లో నివసించే ప్రజలు అనారోగ్యం బారినపడుతున్నారు. దీనిపై మున్సిపాలిటీ పాలకవర్గాలు ప్రత్యేక శ్రద్ధ చూపాల్సి ఉంది.
సిరిసిల్లకు ఫ్లడ్ ముప్పు తీర్చాలి
సిరిసిల్లకు ఫ్లడ్స్ ముప్పు అధికంగా ఉంది. నాలాల కబ్జా, చెరువు శిఖం భూముల్లో కాలనీలు వెలవడంతో సిరిసిల్లకు ఫ్లడ్ ముప్పు పెరిగింది. వానాకాలం వచ్చిందంటే సిరిసిల్లలో దాదాపు 10 కాలనీలు నీటమునుగుతున్నాయి. 2021 సెప్టెంబర్‌లో చిన్న బోనాల చెరువు తెగడంతో వరద సిరిసిల్లను ముంచింది. వెంకంపేట, ప్రగతినగర్, బీవైనగర్, సుందరయ్యనగర్, శాంతినగర్, సంజీవయ్యనగర్, అంబేద్కర్‌నగర్‌ఓ, పాతబస్టాండ్ కాలనీలు నీటమునిగాయి. అప్పట్లో ఆఫీసర్లు రూ.280కోట్లతో మిడ్‌మానేరులో వరద నీటిని మళ్లించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు.
కానీ ఆ పనులు చేపట్టలేదు. దీంతోపాటు సిరిసిల్ల శివారు కాలనీలు వంశీకృష్ణకాలనీ, బాబానగర్, సాయినగర్, శాంతినగర్, చంద్రంపేట, జ్యోతినగర్ కొత్తగా ఏర్పడ్డాయి. వీటిల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, స్ట్రీట్ లైట్స్, తాగునీటి సప్లై వంటి మౌలిక వసతులు కల్పించాల్సి ఉంది. సిరిసిల్లలో సెస్ బకాయిలు దాదాపు రూ.7కోట్ల వరకు ఉన్నాయి. ఐదేండ్లుగా ఈ బకాయిలు పెరుగుతున్నాయే తప్ప క్లియర్ చేయడంలేదు.
