తాగునీటికి ప్రయారిటీ ఇవ్వాలి..పంటలనూ కాపాడాలి..వాస్తవ నిల్వల ఆధారంగానే ప్రాజెక్టుల నిర్వహణ చేపట్టాలి: మంత్రి ఉత్తమ్

తాగునీటికి ప్రయారిటీ ఇవ్వాలి..పంటలనూ కాపాడాలి..వాస్తవ నిల్వల ఆధారంగానే ప్రాజెక్టుల నిర్వహణ చేపట్టాలి: మంత్రి ఉత్తమ్
  • నీళ్లు పుష్కలంగా ఉన్నచోట సాగునీరివ్వాలి.. ఉన్నతాధికారులకు దిశానిర్దేశం
  • ఎల్ నినో పరిస్థితుల నేపథ్యంలో నిర్ణయం    
  • సింగూరు, ఎస్ఎల్బీసీ పనులు, పోలవరం ముంపుపై ఐఐటీ స్టడీని స్పీడప్​ చేయాలని ఆదేశాలు 

హైదరాబాద్, వెలుగు: ప్రాజెక్టుల్లో వాస్తవ నిల్వల ఆధారంగానే నీటి నిర్వహణ చేపట్టాలని ఇరిగేషన్ ఉన్నతాధికారులను ఆ శాఖ మంత్రి ఉత్తమ్​కుమార్​రెడ్డి ఆదేశించారు.  ప్రస్తుత ఎల్ నినో, రాబోయే రోజుల్లో వర్షాభావ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని అప్రమత్తంగా ఉండాలన్నారు. మంగళవారం హైదరాబాద్‌‌‌‌లోని జలసౌధలో రిజర్వాయర్లలో నీటి నిల్వలు, ఖరీఫ్ సీజన్ లో సాగునీటి సరఫరాపై ఆయన ఉన్నత స్థాయి సమీక్ష  నిర్వహించారు.

రాబోయే రోజుల్లో భారీగా వర్షాలు పడతాయనే అంచనాలతో కాకుండా, వాస్తవ లభ్యత, శాస్త్రీయ అంచనాల ఆధారంగానే నీటి నిర్వహణ ఉండాలని స్పష్టం చేశారు. తాగునీటి భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని,  నీటి నిల్వలు పుష్కలంగా ఉన్నచోట సాగునీటిని అనవసరంగా ఆపవద్దన్నారు. తాగునీటి అవసరాలు తీరిన తర్వాత మిగులు నీటిని పంటలకు అందించాలని సూచించారు.

ప్రధాన రిజర్వాయర్లలో 74.57 శాతం నిల్వలు

రాష్ట్రంలోని ప్రధాన రిజర్వాయర్లలో ప్రస్తుతం సగటున 74.57 శాతం నీటి నిల్వలు ఉన్నాయని మంత్రి ఉత్తమ్ తెలిపారు. కృష్ణా బేసిన్‌‌‌‌లోని రిజర్వాయర్లలో 973.68 టీఎంసీల పూర్తి సామర్థ్యానికి గాను 746.12 టీఎంసీలు (76.63 శాతం) నిల్వ ఉండగా.. గోదావరి బేసిన్‌‌‌‌లోని రిజర్వాయర్లలో 306.20 టీఎంసీలకు గాను 208.38 టీఎంసీలు (68.1 శాతం) ఉన్నాయని వివరించారు. ఉమ్మడి ప్రాజెక్టు అయిన నాగార్జున సాగర్‌‌‌‌లో 312 టీఎంసీల సామర్థ్యానికి గాను ప్రస్తుతం 164 టీఎంసీల నీళ్లున్నాయని, ఇంకా 47 శాతం మేర ఖాళీ ఉందన్నారు.

నాగార్జున సాగర్ ఎడమ కాలువ కింద నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం జిల్లాల పరిధిలో 6.4 లక్షల ఎకరాల ఆయకట్టు ఆధారపడి ఉందని గుర్తుచేశారు. ప్రతి ప్రాజెక్టులోనూ లైవ్ స్టోరేజ్, వినియోగించదగిన నీరు, తాగునీటి అవసరాలు, సాగుకు వాస్తవంగా అందుబాటులో ఉన్న నీటి లెక్కలపై స్పష్టమైన నివేదికలు ఉండాలన్నారు. 2025, 2026 నాటి నిల్వలు, వరద ప్రవాహాలను సరిపోల్చుకోవాలని, సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో భారీ ప్రవాహాలు వస్తాయని గుడ్డిగా నమ్మవద్దని చెప్పారు. రైతులకు పూర్తి పారదర్శకతతో వాస్తవాలను తెలియజేస్తూ ప్రస్తుతం వేసిన పంటలను కాపాడడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.

వైరా జలాశయం విషయంలో లేట్ ఎందుకు? 

గోదావరి జలాలతో నింపే అవకాశం ఉన్నప్పటికీ ఖమ్మం జిల్లాలోని వైరా రిజర్వాయర్ నుంచి సాగునీటి విడుదలలో జరుగుతున్న జాప్యంపై మంత్రి ఉత్తమ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. వరద లేనిచోట నీటిని ఆదా చేయాలని, స్థిరమైన వనరులున్న చోట సాగునీటిని ఆపాల్సిన అవసరం లేదన్నారు. దేవాదుల, నిజాంసాగర్, స్వర్ణ, సదర్మాట్, రామడుగు, బుగ్గవాగు, రామపల్లి, పాలెంవాగు, గౌరారం, పోచారం, రాజీవ్ సాగర్, నీల్వాయి, వట్టివాగు, నల్లవాగు, పాల్వాయి పురుషోత్తం రావు (ఎర్రవాగు), చెల్మెలవాగు (ఎన్టీఆర్ సాగర్) ప్రాజెక్టుల్లో నీటి లభ్యత ఆధారంగా నీటిని విడుదల చేయాలని ఆదేశించారు. మూసీ ప్రాజెక్టు కింద అందుబాటులో ఉన్న నీటిని సాగుకు సద్వినియోగం చేసుకోవాలన్నారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్, లోయర్ మానేరు డ్యామ్, సింగూరు తదితర గోదావరి బేసిన్ ప్రాజెక్టులపైనా మంత్రి సమీక్షించారు.

సింగూరు మరమ్మతులకు టాప్ ప్రయారిటీ.. 

సింగూరు డ్యామ్ రిపేర్లు, పటిష్టత పనులకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులను మంత్రి ఉత్తమ్ ఆదేశించారు. క్షేత్రస్థాయిలో తాజా పరిస్థితిని పరిశీలించి, సాంకేతిక సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు. ఎస్ ఎల్ బీసీ టన్నెల్ పనులను సమీక్షిస్తూ.. ఇన్‌‌‌‌లెట్, ఔట్‌‌‌‌లెట్ వైపుల నుంచి తవ్వకం పనులు జరుగుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. క్లిష్టమైన భౌగోళిక పరిస్థితులున్న ప్రాంతాల్లో నాణ్యతా ప్రమాణాలు, భద్రత పాటిస్తూనే పనులను మరింత వేగవంతం చేయాలని టన్నెల్ ఇంజనీర్లను ఆదేశించారు. సాంకేతిక అధ్యయనాల కోసం సెంట్రల్ వాటర్ కమిషన్, భారత వాతావరణ శాఖ నుంచి తాజా డేటాను మాత్రమే వినియోగించాలని, నదీ పరివాహక ప్రాంతాల క్రాస్-సెక్షన్లను ఎప్పటికప్పుడు అప్‌‌‌‌డేట్ చేయాలని సూచించారు.

పోలవరం ముంపుపై ఐఐటీ అధ్యయనం

పోలవరం ప్రాజెక్టు బ్యాక్‌‌‌‌వాటర్ వల్ల తెలంగాణ ప్రాంతంలో ముంపు ప్రభావంపై ఐఐటీ నిపుణులు చేస్తున్న అధ్యయనాన్ని త్వరితగతిన పూర్తి చేయించాలని అధికారులను మంత్రి ఉత్తమ్ ఆదేశించారు. దీనివల్ల రాష్ట్రానికి జరిగే నష్టం, వరద ప్రభావాన్ని స్పష్టంగా అంచనా వేసి, కేంద్రం నుంచి అవసరమైన రక్షణ చర్యలు, నివారణ చర్యలను డిమాండ్ చేయడానికి సాంకేతిక ఆధారాలు లభిస్తాయన్నారు.

ట్రిబ్యునల్, సుప్రీంకోర్టుల్లో పెండింగ్‌‌‌‌లో ఉన్న అంతర్రాష్ట్ర జల వివాదాలు, కృష్ణా జలాల నిర్వహణ, జలవిద్యుత్ ఉత్పత్తి, కృష్ణా రివర్ మేనేజ్‌‌‌‌మెంట్ బోర్డు పరిధి తదితర అంశాలపై ఆరా తీశారు. న్యాయ, సాంకేతిక విభాగాల అధికారులు ఈ అంశాలపై సమగ్రమైన బ్రీఫ్ నోట్‌‌‌‌ను సిద్ధం చేయాలని ఆదేశించారు. సమావేశంలో నీటిపారుదల శాఖ కార్యదర్శి శ్రీధర్, ఈఎన్సీ (జనరల్) రమేశ్ బాబు, జాయింట్ సెక్రటరీ శ్రీనివాస్, టన్నెల్ నిపుణుడు పరీక్షిత్ మెహ్రా, ఈఎన్సీ (అడ్మిన్) శ్రీనివాస్, ఈఎన్సీ (ఓ అండ్ ఎం, క్వాలిటీ కంట్రోల్) మధుసూదన్ రావు పాల్గొన్నారు