- మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలంలో ఘటన
అల్లాదుర్గం, వెలుగు : రోడ్డు మీద పోసిన వడ్ల కుప్పలు తగిలి ఆటో బోల్తా పడడంతో డ్రైవర్ చనిపోయాడు. ఈ మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలంలోని 161 జాతీయ రహదారి సర్వీస్ రోడ్‌పై ఆదివారం రాత్రి జరిగింది. ఎస్సై శంకర్ తెలిపిన వివరాల ప్రకారం... పెద్ద శంకరంపేట మండలం కోలపల్లి గ్రామానికి చెందిన అహ్మద్ హుస్సేన్ (57) ఆటో నడుపుతూ జీవిస్తున్నాడు. ఆదివారం అల్లాదుర్గంలోని రేణుక ఎల్లమ్మ ఆలయం వద్ద ప్యాసింజర్స్‌ను దింపి గ్రామానికి వస్తున్నాడు.
ఈ క్రమంలో రాంపూర్ శివారులో 161 జాతీయ రహదారి సర్వీస్ రోడ్ మీదుగా వస్తుండగా.. వడ్ల కుప్పను ఢీకొట్టడంతో ఆటో బోల్తా పడింది. తీవ్రంగా గాయపడ్డ హుస్సేన్ అక్కడికక్కడే చనిపోయాడు. మృతుడి కుమారుడు జావీద్ హుస్సేన్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
