మహబూబాబాద్, వెలుగు: రోడ్డు ప్రమాదాల్లో డ్రైవర్ల కంటి సమస్యలు కూడా ఒక ప్రధాన కారణమని పేర్కొంటూ, డ్రైవర్లు ఖచ్చితంగా కంటి పరీక్షలు చేయించుకోవాలని రాష్ట్ర రోడ్డు భద్రత అండ్ రైల్వేస్ ఐజీ కె. రమేష్ నాయుడు సూచించారు. గురువారం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఆర్తి గార్డెన్స్‌లో వివిధ వాహనాల డ్రైవర్లకు ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. తెలంగాణలో రోడ్డు ప్రమాదాల సంఖ్యలో దేశంలో 8వ స్థానంలో ఉందని వెల్లడించారు. రోజుకు సుమారు 70 మంది రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు కఠినంగా పాటిస్తే ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చన్నారు. రోడ్డు భద్రత కేవలం పోలీసుల బాధ్యత మాత్రమే కాదని, ప్రతి పౌరుడి సామాజిక బాధ్యత అని ఐజీ స్పష్టం చేశారు. చిన్న నిర్లక్ష్యం కూడా పెద్ద ప్రమాదాలకు దారితీస్తుందని, అందరు వాహనదారులు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తేనే ప్రాణనష్టం తగ్గుతుందన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ స్నేహ శబరీష్, ఎస్పీ డాక్టర్ శబరీష్ తదితరులు పాల్గొన్నారు.

