కొత్త వ్యాగన్‌ఆర్ లాంచ్ చేసిన మారుతీ సుజుకీ.. 100% ఇథనాల్‌తో నడిచే సరికొత్త కారు

కొత్త వ్యాగన్‌ఆర్ లాంచ్ చేసిన మారుతీ సుజుకీ.. 100% ఇథనాల్‌తో నడిచే సరికొత్త కారు

భారత ఆటోమొబైల్ రంగంలో సరికొత్త విప్లవానికి తెరలేచింది. అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ.. మొట్టమొదటి ఫ్లెక్స్-ఫ్యూయల్ ప్యాసింజర్ కారుగా 'వ్యాగన్ ఆర్' మోడల్‌ను గురువారం మార్కెట్లోకి విడుదల చేసింది. కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి సమక్షంలో ఈ చారిత్రాత్మక లాంచ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. దేశ ఇంధన ప్రయాణంలో ఇదొక సరికొత్త అధ్యాయమని, క్రూడ్ ఆయిల్ దిగుమతులను తగ్గించడంతో పాటు కార్బన్ ఉద్గారాల నియంత్రణకు ఇది కీలక మైలురాయిగా నిలుస్తుందని కంపెనీ ఎండీ, సీఈఓ హిసాషి టకేయుచి అన్నారు.

సాధారణంగా ఇప్పుడు మన రోడ్లపై తిరిగే కార్లు గరిష్టంగా 20 శాతం ఇథనాల్ కలిపిన E20 పెట్రోల్‌తో మాత్రమే నడుస్తాయి. ఈ సరికొత్త వ్యాగన్ ఆర్ కారు సాధారణ పెట్రోల్ నుండి మొదలుకొని 100 శాతం స్వచ్ఛమైన ఇథనాల్ వరకు ఎలాంటి ఇంధనంతోనైనా ఇబ్బంది లేకుండా సజావుగా నడుస్తుంది. ఇథనాల్‌కు ఉండే తుప్పు పట్టే గుణాన్ని తట్టుకునేలా మారుతీ సుజుకీ ఇంజనీరింగ్ టీం దీని ఫ్యూయల్ సిస్టమ్‌ను ప్రత్యేకంగా రీడిజైన్ చేసిందట.

ఈ సాంకేతికత ద్వారా కేవలం ఆటోమొబైల్ రంగమే కాకుండా భారతీయ రైతులు, ఇథనాల్ ఉత్పాదకులు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కూడా బలోపేతం కానున్నాయి. విదేశీ చమురుపై ఆధారపడటాన్ని తగ్గించి.. 'ఆత్మనిర్భర్ భారత్' లక్ష్య సాధనలో ఇది కీలక పాత్ర పోషించనుంది. దేశంలో ఫ్లెక్స్-ఫ్యూయల్ వాహనాల వాడకాన్ని వేగంగా విస్తరించేందుకు ప్రభుత్వం మొదటి విడతగా ఢిల్లీ-ఎన్‌సీఆర్, ముంబై-పుణె-నాగ్‌పూర్ కారిడార్లలో 50 నుండి 100 ఇథనాల్ పంపింగ్ స్టేషన్లను ప్రారంభించనుంది. ఈ ఏడాది డిసెంబర్ నాటికి ఈ సంఖ్యను 500 కి పెంచాలని కేంద్రం టార్గెట్ గా పెట్టుకుంది.

ALSO READ : అణుబాంబుల ఫ్యాక్టరీని చూపించిన కిమ్..

కేవలం ఇథనాల్ మాత్రమే కాకుండా.. భవిష్యత్ ఇంధన మార్పుల కోసం భారతదేశం మరిన్ని ముందడుగులు వేస్తోంది. దేశవ్యాప్తంగా 10 ప్రధాన రహదారులపై హైడ్రోజన్‌తో నడిచే బస్సులు, ట్రక్కులను పైలట్ ప్రాజెక్ట్ కింద నడపనున్నట్లు మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. ఈ మెగా ప్రాజెక్ట్ కోసం రిలయన్స్ ఇండస్ట్రీస్, టాటా గ్రూప్, ఎన్టీపీసీ, అశోక్ లేలాండ్ వంటి దిగ్గజ సంస్థలు ప్రభుత్వంతో చేతులు కలిపాయి. అంతేకాకుండా విమానాలు, ఫైటర్ జెట్లలో వాడే 'సస్టైనబుల్ ఏవియేషన్ ఫ్యూయల్' ఉత్పత్తిని కూడా పెంచుతున్నామని.. మరో రెండేళ్లలో భారత్ ఇంధనాన్ని దిగుమతి చేసుకునే దేశం నుండి ఎగుమతి చేసే దేశంగా ఎదుగుతుందని గడ్కరీ ఆశాభావం వ్యక్తం చేశారు.