ఇప్పటి నుంచి మే దాకా.. ఎండలు మండుతయ్

ఇప్పటి నుంచి మే దాకా.. ఎండలు మండుతయ్
  • నార్మల్ కంటే అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతయ్ 
  • ఎల్ నినోతో పాటు క్లైమేట్ చేంజ్ ప్రభావమే కారణం 
  • డబ్ల్యూఎంవో నివేదికఎల్ నినో వల్ల ఇండియాకు కరువు ముప్పు

జెనీవా (స్విట్జర్లాండ్):  ఇప్పటి నుంచి మే నెల చివరిదాకా ఎండలు దంచికొట్టే అవకాశం ఉందని ఐక్యరాజ్యసమితి వాతావరణ సంస్థ డబ్ల్యూఎంవో (వరల్డ్ మెటియోరాలజికల్ ఆర్గనైజేషన్) వెల్లడించింది. ఈ మూడు నెలలు ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువే నమోదు కానున్నాయని తెలిపింది. పసిఫిక్ మహాసముద్రంలో ఉపరితల జలాలు వేడెక్కడం(ఎల్ నినో) ప్రక్రియతోపాటు వాతావరణ మార్పు ప్రభావం వల్లే ఈ సారి ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరగనున్నాయని మంగళవారం విడుదల చేసిన నివేదికలో ఆ సంస్థ హెచ్చరించింది. ఎల్ నినో ప్రస్తుతం క్రమంగా వీక్ అయిపోతున్నా.. దాని ఎఫెక్ట్ మాత్రం ఇంకో మూడు నెలలపాటు కొనసాగనుందని తెలిపింది. ‘‘ప్రస్తుత ఎల్ నినో 2023 జూన్ లో ఏర్పడింది. అప్పటి నుంచి ప్రతినెలలోనూ గతంతో పోలిస్తే రికార్డ్ స్థాయి టెంపరేచర్లు నమోదయ్యాయి. 2023వ ఏడాది రికార్డ్ స్థాయిలో అత్యధిక వేడి సంవత్సరంగా నిలిచింది. గత నవంబర్ నుంచి జనవరి మధ్య ఎల్ నినో ఎఫెక్ట్ పీక్ స్థాయికి చేరింది. ముఖ్యంగా గత డిసెంబర్ ఐదు అత్యధిక వేడి డిసెంబర్లలో ఒకటిగా నిలిచింది”అని డబ్ల్యూఎంవో వివరించింది. 

ఇండియాకు కరువు ముప్పు.. 

మధ్య, తూర్పు పసిఫిక్ మహాసముద్రంలో ఉపరితలాల జలాలు వేడెక్కడాన్నే ఎల్ నినో అంటారు. ఇది ఏర్పడిన సంవత్సరాల్లో ప్రపంచవ్యాప్తంగా టెంపరేచర్లు పెరుగుతాయి. ప్రధానంగా ఎల్ నినో ప్రభావంతో దక్షిణ అమెరికా, ఈశాన్య ఆఫ్రికా, మధ్య ఆసియా ప్రాంతాల్లో కుండపోత వర్షాలు కురుస్తాయి. మరోవైపు ఆస్ట్రేలియా, ఇండోనేసియా, దక్షిణ ఆసియా(భారత ఉపఖండం, ఇతర దేశాలు), సెంట్రల్ అమెరికా ప్రాంతాల్లో తీవ్ర కరువు పరిస్థితులు ఏర్పడతాయి. ఎల్ నినో యావరేజ్ గా 2 నుంచి 7 ఏండ్లకు ఓసారి ఏర్పడుతుంది. దాదాపు 9 నుంచి 12 నెలలపాటు కొనసాగుతుంది. ఎల్ నినో చివరిసారిగా 2015–16 మధ్యలో వచ్చింది. దీని తర్వాత పసిఫిక్ మహాసముద్ర ఉపరితల జలాలు చల్లారే ప్రక్రియ లా నినా ఏర్పడుతుంది. లా నినా ప్రభావం.. సరిగ్గా ఎల్ నినోకు వ్యతిరేక దిశలో ఉంటుంది. ఎప్పట్లాగే ఎల్ నినో ఎఫెక్ట్ ముగిసిన తర్వాత ఈ ఏడాది కూడా లా నినా ఏర్పడే అవకాశం ఉండొచ్చని డబ్ల్యూఎంవో పేర్కొంది. అయితే, ఈ సారి ఎల్ నినో కారణంగా సముద్ర జలాలు సాధారణం కంటే 2.0 డిగ్రీ సెల్సియస్ లు ఎక్కువగా వేడెక్కాయని తెలిపింది. ఇప్పటివరకు ఏర్పడిన అతి బలమైన ఎల్ నినోల్లో ఇది ఐదోదని పేర్కొంది. 

క్లైమేట్ చేంజ్ కూడా కారణమే.. 

గత కొన్ని నెలలపాటు రికార్డ్ స్థాయిలో టెంపరేచర్లు నమోదు కావడానికి ఒక్క ఎల్ నినో ప్రభావమే కారణమని చెప్పడం సరికాదని డబ్ల్యూఎంవో చీఫ్ సెలస్టే సౌలో స్పష్టం చేశారు. మానవ కార్యకలాపాల కారణంగా ఏర్పడిన క్లైమేట్ చేంజ్ (వాతావరణ మార్పు) సమస్య పాత్ర కూడా ఇందులో ఉందన్నారు. ప్రధానంగా వాతావరణంలో సీఓటూ, మీథేన్, నైట్రస్ ఆక్సైడ్ లు పెరగడం వల్లే ప్రపంచవ్యాప్తంగా వేడి పెరుగుతోందన్నారు. ‘‘ప్రస్తుత ఎల్ నినో 2023 జూన్ లో ఏర్పడింది. అప్పటి నుంచి ప్రతినెలలోనూ గతంతో పోలిస్తే రికార్డ్ స్థాయి టెంపరేచర్లు నమోదయ్యాయి. 2023వ ఏడాది రికార్డ్ స్థాయిలో అత్యధిక వేడి సంవత్సరంగా నిలిచింది. వీటికి ఎల్ నినో కారణమే అయినా.. గ్రీన్ హౌస్ వాయువులు పెరగడం కూడా మరో కారణమన్న విషయం మరవకూడదు” అని ఆమె తేల్చిచెప్పారు. ఎల్ నినో ఎఫెక్ట్ ఉండే ప్రాంతాలే కాకుండా ఇతర ప్రాంతాల్లోనూ టెంపరేచర్లు పెరుగుతుండటమే దీనికి నిదర్శనమన్నారు.  ఇప్పటికైనా గ్రీన్ హౌస్ వాయువులను కట్టడి చేయకపోతే భవిష్యత్తులో విపత్తులు తప్పవని హెచ్చరించారు.