
హైదరాబాద్, వెలుగు: ఫిల్మ్‌నగర్‌లో మరోసారి డ్రగ్స్ పట్టుబడింది. మూన్‌షైన్ పబ్ పార్కింగ్ ఏరియాలో డ్రగ్స్ అమ్ముతున్న వ్యక్తిని వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. రూ. లక్షా 20 వేల విలువైన 20 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్‌ను సీజ్ చేశారు. టాస్క్‌ఫోర్స్ డీసీపీ శ్రీబాల తెలిపిన వివరాల ప్రకారం.. బెంగళూరుకు చెందిన శివరాంపూర్ బాబు కిరణ్(26) స్థానికంగా క్విక్ క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. మద్యం, డ్రగ్స్‌కు బానిసయ్యాడు.
మరో ఆటోడ్రైవర్ దినకరన్‌తో కలిసి డ్రగ్స్ సప్లయ్ చేసేందుకు ప్లాన్ చేశాడు. హైదరాబాద్‌లో డ్రగ్స్‌కు డిమాండ్ ఉందని తెలుసుకొని.. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌లోని డ్రగ్స్ పెడ్లర్ల ద్వారా చైన్ ఏర్పాటు చేసుకున్నారు. బెంగళూరులో రూ.6 వేల చొప్పున ఎండీఎంఏ డ్రగ్ కొనుగోలు చేశారు.20 గ్రాముల డ్రగ్స్‌తో బాబు కిరణ్ హైదరాబాద్ వచ్చాడు. ఫిల్మ్ నగర్‌లోని మూన్‌షైన్ పబ్ సమీపంలో అమ్మేందుకు ప్లాన్ చేశాడు. సమాచారం అందుకున్న వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అతడిపై నిఘాపెట్టి అరెస్ట్ చేశారు. అతడి నుంచి డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు.