రాష్ట్రంలో డ్రంకన్ డ్రైవ్‌‌ కేసులు పెరుగుతున్నయి

రాష్ట్రంలో డ్రంకన్ డ్రైవ్‌‌ కేసులు పెరుగుతున్నయి

 

  •    గతేడాదితో పోలిస్తే భారీగా పెరుగుదల
  •     అత్యధికంగా సైబరాబాద్‌‌లో 24,500 కేసులు
  •     1,253 మందికి జైలు శిక్షలు
  •     రూ.12 కోట్లకు పైగా జరిమానాలు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో డ్రంకన్ డ్రైవ్‌‌ కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఏటా ఈ కేసుల సంఖ్య పెరిగిపోతూనే ఉంది. గతేడాది మొత్తం 66 వేల డ్రంకన్‌‌ డ్రైవ్‌‌ కేసులు నమోదు కాగా.. ఈ ఏడాది ఆరు నెలల్లోనే 55 వేలకు పైగా కేసులు బుక్ అయ్యాయి. హైదరాబాద్​, సైబరాబాద్​ కమిషనరేట్​ పరిధిలోనే ఎక్కువగా కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 1,253 మందికి జైలు శిక్షలు విధించారు. రూ.12 కోట్లకు పైగా జరిమానాలు విధించారు.

82 శాతం యువత

తనిఖీల్లో పట్టుబడ్డ వాహనదారుల బీఏసీ (బ్లడ్ ఆల్కహాల్ కంటెంట్) లెవల్స్ 30 శాతం దాటితే పోలీసులు కేసులు పెడుతున్నారు. వారిని కోర్టుల్లో ప్రవేశపెడుతున్నారు. మరోవైపు డ్రంకన్‌‌‌‌ డ్రైవ్‌‌‌‌ వల్ల కలిగే అనర్థాలపై పోలీసులు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అయినప్పటికీ యువతలో మార్పు రావడం లేదు. డే అండ్ నైట్‌‌‌‌ డ్రింక్‌‌‌‌, వీకెండ్ పార్టీల పేరుతో మద్యం మత్తులో డ్రైవ్ చేస్తున్నారు. ఇందులో 19 ఏండ్ల నుంచి 28 ఏండ్ల మధ్య వయస్సున్న యువతే 82 శాతం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో కాలేజ్‌‌‌‌లు, కార్పొరేట్‌‌‌‌ కంపెనీలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో చెకింగ్స్‌‌‌‌ చేస్తున్నారు.

సైబరాబాద్‌‌‌‌లో అత్యధికంగా..

రాష్ట్రవ్యాప్తంగా హైదరాబాద్‌‌‌‌, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలోనే కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. గ్రేటర్‌‌‌‌‌‌‌‌ హైదరాబాద్‌‌‌‌లోని మూడు కమిషనరేట్ల లిమిట్స్‌‌‌‌లో పోలీసులు ర్యాండమ్‌‌‌‌ చెకింగ్‌‌‌‌ చేస్తున్నారు. పీఎస్‌‌‌‌ల వారీగా టార్గెట్స్ ఫిక్స్‌‌‌‌చేసి కేసులు రిజిస్టర్ చేస్తున్నారు. సైబరాబాద్‌‌‌‌ కమిషనరేట్‌‌‌‌ పరిధిలో ఏటా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. గ్రామీణ ప్రాంతాలు ఎక్కువగా ఉండే రాచకొండ కమిషనరేట్‌‌‌‌ పరిధిలో ఓఆర్ఆర్ సహా చౌటుప్పల్, యాదాద్రి భువనగిరి, కుషాయిగూడ, ఉప్పల్‌‌‌‌లో భారీ సంఖ్యలో డ్రంకన్ డ్రైవ్‌‌‌‌ కేసులు ఉంటున్నాయి. దూర ప్రాంతాల నుంచి వచ్చే ఆర్టీసీ బస్సు డ్రైవర్లకు కూడా పోలీసులు డ్రంకన్ డ్రైవ్ చెకింగ్‌‌‌‌ చేస్తున్నారు.

మోతాదును బట్టి  కోర్టు పనిష్మెంట్స్‌‌‌‌

డ్రంకన్ డ్రైవ్‌‌‌‌లో దొరికిన వారికి స్పెషల్‌‌‌‌ కోర్టు జడ్జిలు వారి విచక్షణాధికారానికి అనుగుణంగా శిక్షలు వేస్తున్నారు. మొదటి సారి పట్టుబడిన వారికి జరిమానా విధించి హెచ్చరిస్తున్నారు. ఆల్కహాల్‌‌‌‌ మోతాదును బట్టి రెండు రోజుల నుంచి మూడు నెలల పాటు జైలు శిక్షలు విధిస్తున్నారు. ఒకటి కంటే ఎక్కువ సార్లు పట్టుబడ్డ వారికి జైలు శిక్షలు విధిస్తున్నారు. రూ.2,000 నుంచి అత్యధికంగా రూ.10,500 వరకు ఫైన్స్ వేస్తున్నారు. సోషల్ సర్వీస్ చేయాలని చెబుతున్నారు. డ్రైవింగ్ లైసెన్స్ సస్పెండ్‌‌‌‌ లేదా రద్దు కూడా చేస్తున్నారు.