పట్టభద్రులను మోసం చేసింది కేసీఆర్ ఫ్యామిలీ : తీన్మార్ మల్లన్న

పట్టభద్రులను మోసం చేసింది కేసీఆర్ ఫ్యామిలీ : తీన్మార్ మల్లన్న
  •     గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కాంగ్రెస్​ అభ్యర్థి తీన్మార్ మల్లన్న

స్టేషన్​ఘన్​పూర్, వెలుగు : పట్టపగలు పట్టభద్రులను మోసం చేసింది మాజీ సీఎం కేసీఆర్ ఫ్యామిలీ అని గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న ఆరోపించారు. జనగామ జిల్లా స్టేషన్​ఘన్​పూర్ మండలం శివునిపల్లిలో మల్లన్నకు మద్దతుగా కాంగ్రెస్ మండలాధ్యక్షుడు జూలకుంట్ల శిరీశ్​రెడ్డి అధ్యక్షత శుక్రవారం గ్రాడ్యుయేట్స్ తో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అభ్యర్థి తీన్మార్​మల్లన్న మాట్లాడుతూ ఉద్యోగులకు ప్రతిబంధకంగా 327 జీవో, నిరుద్యోగుల ఉద్యోగ నియామకాలకు అడ్డుచెబుతూ 46 జీవో తెచ్చిన ఘనత మాజీ సీఎం కేసీఆర్​కే దక్కిందని ఎద్దేవా చేశారు.

జనగామలో దొంగ ఓట్ల ఎమ్మెల్యేగా పల్లా రాజేశ్వర్​రెడ్డి చరిత్రకెక్కారని విమర్శించారు. మొదటి ప్రాధాన్యత ఓటుతో తనను గెలిపించాలని కోరారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మోసం చేసిన బీజేపీ, ఫోన్ ట్యాపింగ్, భూకబ్జాలు, ప్రాజెక్టుల్లో అవినీతి, అక్రమాలకు పాల్పడిన బీఆర్​ఎస్​కు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్లు అడిగే హక్కు లేదన్నారు. జూన్​ 4 తర్వాత జాబ్ క్యాలెండర్ ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్​రెడ్డి తెలిపారన్నారు. కార్యక్రమంలో యూత్​ కాంగ్రెస్​ రాష్ట్ర అధ్యక్షుడు శివసేనారెడ్డి, కాంగ్రెస్ నాయకులు, ఎంపీపీ మేకల వరలక్ష్మి పాల్గొన్నారు.

ఉస్మానియా, కేయూ స్టూడెంట్స్​పల్లీ బఠానీలా..?

హనుమకొండ, వెలుగు :  మాజీ మంత్రి కేటీఆర్ బిట్స్ పిలానీ.. పల్లీ బఠానీ అంటూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడని, ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీలో చదివే పిల్లలు పల్లీ బఠానీల్లా కనిపిస్తున్నారా..? అని గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న మండిపడ్డారు. తాను ఉస్మానియాలో ఎంసీజే, కాకతీయలో బీపీఎడ్, జేఎన్​టీయూలో ఎంబీఏ చేశానని, బీఆర్​ఎస్ దృష్టిలో పట్టభద్రులంతా పల్లీ బఠానీలేనా అని ప్రశ్నించారు.

శుక్రవారం వరంగల్ ప్రచార కార్యక్రమంలో భాగంగా ఆయన మీడియాతో మాట్లాడారు. పదేండ్ల పాలనలో బీఆర్​ఎస్​ పట్టభద్రులను మోసం చేసిందని, ఆ పార్టీకి ఓట్లు అడిగే అర్హతే లేదన్నారు. పట్టభద్రులెవరూ బీఆర్​ఎస్​ను దగ్గరకు రానిచ్చే పరిస్థితి లేదని ఎద్దేవా చేశారు.