పామునూరు గుట్టల్లో పేలిన మందుపాతర..39వ బెటాలియన్  కానిస్టేబుల్‌‌‌‌ కు తీవ్ర గాయాలు

పామునూరు గుట్టల్లో పేలిన మందుపాతర..39వ బెటాలియన్  కానిస్టేబుల్‌‌‌‌ కు తీవ్ర గాయాలు
  •     ఆపరేషన్ కర్రెగుట్ట కూంబింగ్ సందర్భంగా ఘటన

ములుగు, వెంకటాపురం, వెలుగు: మావోయిస్టుల ఏరివేత కోసం చేపట్టిన ఆపరేషన్ ‘కర్రెగుట్ట’లో భాగంగా కూంబింగ్ నిర్వహిస్తున్న పోలీసు బృందం సమీపంలో శుక్రవారం ఐఈడీ  బాంబు(మందుపాతర) పేలింది. ఈ ఘటనలో ఓ కానిస్టేబుల్ తీవ్రంగా గాయపడ్డారు.

పోలీసుల సమాచారం ప్రకారం, ములుగు జిల్లా వెంకటాపురం మండలం పామునూరు క్యాంపు నుంచి కర్రెగుట్ట ప్రాంతానికి బయలుదేరిన బృందం సమీపంలో ఐఈడీ పేలింది. పేలుడులో 39వ బెటాలియన్‌‌‌‌కు చెందిన నవజీత్ పాఠక్‌‌‌‌కు గాయాలు కావడంతో వెంటనే అధికారులు హెలికాప్టర్ లో వెంకటాపురానికి తరలించారు. అక్కడి నుంచి 108 అంబులెన్స్‌‌‌‌లో హన్మకొండకు తీసుకెళ్లి, అనంతరం మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌‌‌‌కు తరలించారు. ప్రస్తుతం పరిస్థితి నిలకడగా ఉందని బెటాలియన్ అధికారులు తెలిపారు.

ఐదుగురు మావోయిస్టులు హతం?

కర్రెగుట్టలో భద్రతా బలగాలు విస్తృతంగా కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. గురువారం జరిగిన ఎన్‌‌‌‌కౌంటర్‌‌‌‌లో ఐదుగురు మావోయిస్టులు మృతిచెందినట్లు సమాచారం. తెలంగాణలోని భూపాలపల్లి, పామేడు, ఆవులపల్లి ప్రాంతాల నుంచి మూడు ప్రత్యేక పోలీసు బృందాలు, అలాగే చత్తీస్‌‌‌‌గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ వైపు నుంచి మరో బృందం కర్రెగుట్టలను చుట్టుముట్టినట్లు తెలిసింది. ఈ క్రమంలో బ్యాకప్‌‌‌‌గా వెళ్తున్న 39వ బెటాలియన్ బృందం సమీపంలోనే మందుపాతర పేలినట్లు అధికారులు తెలిపారు. ఆపరేషన్ కొనసాగుతుండటంతో ఏజెన్సీ ప్రాంతాల్లో భయాందోళనలు నెలకొన్నాయి.