కట్నం వేధింపులతో వివాహిత సూసైడ్.. స్టేషన్ ఘన్ పూర్ మండలం ఇప్పగూడెంలో ఘటన

కట్నం వేధింపులతో వివాహిత సూసైడ్.. స్టేషన్ ఘన్ పూర్ మండలం ఇప్పగూడెంలో ఘటన

రఘునాథపల్లి, వెలుగు: అదనపు కట్నం కోసం అత్తింటి వారు వేధించడంతో ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. జనగామ జిల్లా స్టేషన్ ఘన్‌‌‌‌పూర్ మండలం ఇప్పగూడెం గ్రామానికి చెందిన నీరటి వెంకటయ్య చిన్న కుమార్తె చిక్కుడు లత(34)కు 2012లో రఘునాథపల్లి మండలం కూర్చపల్లి గ్రామానికి చెందిన చిక్కుడు యాదగిరితో కట్నకానుకలు ఇచ్చి వివాహం చేశారు.

పెళ్లి అనంతరం కొద్ది రోజులకే  అదనపు కట్నం కోసం అత్తింటి వారు వేధింపులు మొదలుపెట్టారు. బంగారం తేవాలని, తమ ఊరిలోని భూమి రాసివ్వాలని తరచూ లతపై ఒత్తిడి తెచ్చారు. పెద్దల సమక్షంలో పలుమార్లు పంచాయతీలు జరిగినా పరిస్థితిలో మార్పు రాలేదు. గురువారం రాత్రి లత, యాదగిరి మధ్య గొడవ జరిగింది. దీంతో ఆమె శుక్రవారం ఉదయం వ్యవసాయ బావి వద్దకు వెళ్లి పురుగుల మందు తాగి, భర్తకు ఫోన్ చేసింది.

భర్త యాదగిరి, అతని తమ్ముడు అశోక్ ఆమెను జనగామ ప్రభుత్వ దవాఖానకు తరలించగా, చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతిచెందింది. మృతురాలి తండ్రి ఫిర్యాదుతో భర్త యాదగిరి, అతని తల్లిదండ్రులు వెంకటయ్య, ఎల్లమ్మ, తమ్ముడు అశోక్‌‌‌‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై డి.నరేశ్​ తెలిపారు.