AI దెబ్బతో ఐటీ ఉద్యోగులకు 'NO' డిమాండ్.. US రిటర్న్ టెక్కీలతో కొత్త కష్టాలు..!

AI దెబ్బతో ఐటీ ఉద్యోగులకు 'NO' డిమాండ్.. US రిటర్న్ టెక్కీలతో కొత్త కష్టాలు..!

భారత ఐటీ రంగం అనగానే ఒకప్పుడు టీసీఎస్, విప్రో, ఇన్ఫోసిస్ వంటి దిగ్గజ సంస్థల పేర్లే వినిపించేవి. అయితే ఇప్పుడు ఆంత్రోపిక్ సంస్థకు చెందిన ‘క్లాడ్ కోవర్క్’ లాంటి ఏఐ టూల్స్ మార్కెట్లోకి రావడంతో.. ఐటీ రంగంలో రిక్రూట్మెంట్స్ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఒకవైపు కంపెనీలు భారీగా లేఆఫ్‌లు ప్రకటిస్తుంటే.. మరోవైపు కొత్త ఉద్యోగాల నియామకాలు పూర్తిగా అడుగంటిపోతున్నాయి.

దేశంలో ప్రస్తుతం యాక్టివ్ టెక్ ఉద్యోగాల సంఖ్య కేవలం 93వేలకి పడిపోయిందని ప్రముఖ స్టాఫింగ్ సంస్థ ఎక్స్‌ఫెనో విడుదల చేసిన జూన్ 2026 రిపోర్ట్ పేర్కొంది. ఇది గత 28 నెలల్లోనే అత్యంత కనిష్ట స్థాయి కావడం గమనార్హం. గడిచిన నెలలోనే ఏకంగా 14 శాతం ఉద్యోగాలు తగ్గిపోయాయి. గత ఏడాది కాలంలో నెలవారీ ప్రాతిపదికన ఇంత భారీ తగ్గుదల ఎప్పుడూ నమోదు కాలేదు. దీంతో ఐటీ రంగంలో ప్రస్తుతం పరిస్థితులు ఎంత దారుణంగా రోజురోజుకూ మారిపోతున్నాయో ఇది రుజువు చేస్తోంది. 

ఈ దారుణమైన పరిస్థితికి ఏఐ ప్రధాన కారణమని కేరీర్‌నెట్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ నీలాభ్ శుక్లా అభిప్రాయపడ్డారు. సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్‌లో ఏఐ వాడకం ఇప్పుడు మెయిన్‌స్ట్రీమ్‌గా మారిపోయిందని.. ఇది గ్లోబల్ టెక్ హైరింగ్‌పై తీవ్ర ప్రభావం చూపుతోందని తెలిపారు. ముఖ్యంగా భారత్ వంటి భారీ వాల్యూమ్ కలిగిన టెక్ మార్కెట్లలో దీని స్వల్పకాలిక ప్రభావం మరింత బలంగా కనిపిస్తోందన్నారు.

కేవలం ఐటీ సర్వీసెస్ మాత్రమే కాకుండా.. టెక్ స్టార్టప్‌లు, సాఫ్ట్‌వేర్ ప్రొడక్ట్ రంగాలు కూడా ఈ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయి. ఈ చీకటి రోజుల్లో ‘గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్’ మాత్రమే కాస్త ఆశాజనకంగా కనిపిస్తున్నాయి. ఇవి గత ఏడాదితో పోలిస్తే 31 శాతం వృద్ధితో 17వేల ఓపెనింగ్స్‌ను కలిగి ఉన్నాయి. అయినప్పటికీ ఇది కూడా గత నెల కంటే 6 శాతం తక్కువే. 

యూఎస్ రిటర్న్ టెక్కీలతో కష్టాలు..
ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో అమెరికాలో ఉద్యోగాలు పోగొట్టుకున్న వేలాది మంది భారతీయ H-1B వీసా హోల్డర్లు స్వదేశానికి తిరిగి రావడం పరిస్థితిని మరింత ఇబ్బందికరంగా మార్చుతోంది. అమెరికాలో ఉద్యోగం పోయిన 60 రోజుల్లోగా కొత్త కంపెనీని వెతుక్కోకపోతే భారత్‌కు వచ్చేయాల్సి ఉంటుంది. ఇలాంటి సమయంలో యూఎస్ నుండి వస్తున్న టాలెంట్‌కు స్వాగతం పలికే స్థితిలో భారతీయ మార్కెట్ లేదని ఎక్స్‌ఫెనో సహ వ్యవస్థాపకుడు కమల్ క్రాంత్ స్పష్టం చేశారు. దీంతో ఇప్పటికే ఇండియాలో జాబ్స్ పోగొట్టుకున్న, కొత్తగా ఐటీ జాబ్ మార్కెట్లోకి వస్తున్న వారికి అమెరికా నుంచి తిరిగి వచ్చిన వారు పోటీగా మారుతున్నారని నిపుణులు చెబుతున్నారు. 

అమెరికాలో వీసా, ఇమ్మిగ్రేషన్ కష్టాలకు తోడు గ్రీన్ కార్డ్ రూల్స్ మార్పు తోడవటంతోఈ ఏడాది యూఎస్ వెళ్లే ఐటీ నిపుణుల కంటే.. అక్కడి నుండి భారత్‌కు తిరిగి వచ్చే వారి సంఖ్యే ఎక్కువగా ఉండబోతోందని నిపుణులు అంచనా వేస్తున్నారు. కేవలం అమెరికా ఆర్థిక వ్యవస్థకు ప్రయోజనం చేకూరుస్తారని నిరూపించుకున్న వారికి మాత్రమే అక్కడ మినహాయింపు లభిస్తోంది. మొత్తానికి ఏఐ సృష్టించిన ఈ సునామీ.. అటు అమెరికాలో, ఇటు ఇండియాలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది.