రాష్ట్రంలో ఉన్నది ప్రజా ప్రభుత్వమని, ఎవరో కూలగొడితే కూలిపోయే ప్రభుత్వం కాదని ఐటీ, ఇండస్ట్రీస్ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. ప్రజలు తమకు ఎన్నిరోజులు అవకాశమిస్తే అన్ని రోజులు అధికారంలో ఉంటామన్నారు. 64 మంది ఎమ్మెల్యేలం ఒక్కతాటిపై ఉన్నామని వెల్లడించారు. బుధవారం హైదరాబాద్ నుంచి ధర్మపురి వెళ్తూ కరీంనగర్, చొప్పదండిలో ఆయన మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగులకు 15వ తేదీ వరకూ జీతాలు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టిందని, తాము 5వ తేదీనే జీతాలు ఇస్తున్నామన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ ఉనికి కోల్పోయిందని, బీజేపీ అసలే లేదన్నారు. మేడిగడ్డ విషయంలో ప్రజలకు వాస్తవాలు వెల్లడిస్తామని, దీనికి సంబంధించి ప్రభుత్వం నివేదిక రూపొందిస్తున్నదని తెలిపారు. కరీంనగర్ లో ఐటీ రంగాన్ని బలోపేతం చేసేందుకు హెచ్‌సీఎల్ లాంటి పెద్ద సంస్థలను ఆహ్వానిస్తున్నామని వెల్లడించారు. దావోస్ లో వచ్చిన పెట్టుబడులపై బీఆర్ఎస్ నేతల వ్యాఖ్యలు అర్థరహితమని విమర్శించారు.
నిజాం షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణకు కట్టుబడి ఉన్నం
నిజాం షుగర్ ఫ్యాక్టరీని తిరిగి ప్రారంభిస్తామని మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీకి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందన్నారు. బుధవారం జగిత్యాల కలెక్టరేట్ లో జరిగిన రివ్యూలో ఆయన పాల్గొన్నారు. ఆరు గ్యారంటీలతో పాటు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తుందని మంత్రి తెలిపారు. రాష్ట్రాన్ని పదేండ్లు పాలించి, ఇచ్చిన హామీలు అమలు చేయని బీఆర్ఎస్వాళ్లు.. తమ హామీల అమలును ప్రశ్నించడాన్ని మంత్రి తప్పుబట్టారు. రోళ్లవాగు ప్రాజెక్టు బ్యాలెన్స్ పనులు పూర్తిచేసి రైతులకు సాగునీరందించాలని ఇరిగేషన్ ఆఫీసర్లను ఆయన ఆదేశించారు. సమావేశంలో ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యేలు డాక్టర్ సంజయ్ కుమార్, మేడిపెల్లి సత్యం, డాక్టర్ సంజయ్ పాల్గొన్నారు.
త్వరలోనే డీఎస్సీ నోటిఫికేషన్
హైదరాబాద్, వెలుగు: త్వరలోనే డీఎస్సీ సప్లిమెంటరీ నోటిఫికేషన్ ను రిలీజ్ చేయనున్నట్లు మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. బుధవారం బీఈడీ,డీఈడీ అభ్యర్థుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రావుల రామ్మోహన్ రెడ్డి నేతృత్వంలోని ప్రతినిధులు మంత్రిని కలిశారు. గత ప్రభుత్వం జారీచేసిన 5089 పోస్టులకు మరో పదివేల పోస్టులు జత చేసి, 15వేలతో అనుబంధ నోటిఫికేషన్ రిలీజ్ చేయాలని అభ్యర్థులు విజ్ఞప్తి చేశారు. లోక్ సభ ఎన్నికల కోడ్ వచ్చే లోపే ప్రక్రియ పూర్తి చేయాలన్నారు.
ధర్మపురి ఆలయంలో పూజలు
ధర్మపురి లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో బుధవారం నిర్వహించిన పూజల్లో మంత్రులు శ్రీధర్ బాబు, కొండా సురేఖ పాల్గొన్నారు. వారికి ఆలయ సిబ్బంది పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం వారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ధర్మపురి శ్రీమఠం పీఠాధిపతి సచ్చిదానంద సరస్వతితో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

