భారీ వర్షాల ఎఫెక్ట్: 30 రైళ్లు రద్దు

భారీ వర్షాల ఎఫెక్ట్: 30 రైళ్లు రద్దు

ముంబై: నైరుతి రుతుపవనాల ప్రభావం దేశ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణ, మహారాష్ట్ర సహా పలు రాష్ట్రాల్లోని అనేక ప్రాంతాలు వరద నీటిలో మునిగిపోయాయి. మహారాష్ట్రలో ముంబై, రత్నగిరి, రాయగడ్‌, నాసిక్ ప్రాంతాల్లో భారీ వర్షాలకు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ జిల్లాల్లో చాలా ప్రాంతాల్లో రైలు పట్టాలపై నీళ్లు నిలిచిపోవడంతో పలు రైళ్లు రద్దు చేస్తున్నట్లు సెంట్రల్ రైల్వే డివిజన్ అధికారులు ప్రకటించారు.  ముంబై/కొంకణ్ రీజియన్లలో భారీ వర్షాల కారణంగా 30 రైళ్లను రద్దు చేసినట్లు వెల్లడించింది. 12 రైళ్ల రూట్‌ను డైవర్ట్ చేశామని, మరో 8 ట్రైన్స్‌ను చివరి స్టేషన్‌ వరకూ వెళ్లకుండా మార్గం సరిగా ఉన్న స్టేషన్లలో ప్రయాణం ముగించేలా మార్పులు చేశామని పేర్కొంది. వర్షం ఆగిన ప్రాంతాల్లో పట్టాలపై పేరుకునిపోయిన బురద, నీటిని తొలగించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టామని చెప్పింది.

రత్నగిరి, రాయగడ్ జిల్లాల్లో మరో రెండ్రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ భారత వాతావరణ శాఖ (ఐఎండీ) రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈ రెండు జిల్లాల్లో ఇప్పటికే వరద తీవ్రత చాలా ఎక్కువగా ఉండడంతో మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే రివ్యూ నిర్వహించారు. డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అధికారులు, పలు శాఖల ఉన్నతాధికారులతో ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం నుంచి అన్ని రకాలుగా సహకారం అందిస్తామని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. కాగా, ఈ వారంలో భారీ వర్షాల కారణంగా వేర్వేరు ప్రాంతాల్లో భారీ వర్షాల కారణంగా కొండ చరియలు విరిగి పడి 60 మందికి మరణించారు.