తెలంగాణలో నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు.. సర్వర్ డౌన్ తిప్పలే కారణం

తెలంగాణలో నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు.. సర్వర్ డౌన్ తిప్పలే కారణం

హైదరాబాద్: తెలంగాణలో మంగళవారం ఉదయం నుంచి రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. సర్వర్ డౌన్‌ కారణంగా ఉదయం నుంచి సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో స్లాట్ బుకింగ్, చలాన్ల చెల్లింపులు, భూబదలాయింపు రిజిస్ట్రేషన్లు నిలిచిపోవడం గమనార్హం. దీంతో.. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల దగ్గర వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

సబ్ రిజిస్ట్రార్ల ఆఫీస్ల దగ్గర క్రయ, విక్రయదారులు పడిగాపులు కాశారు. ఆధార్, ఈకేవైసీ, థంబ్‌‌ ఇంప్రెషన్ వెరిఫికేషన్కు సంబంధించిన సర్వర్ డౌన్ కావడంతో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ఆగిపోయిందని అధికారులు తెలిపారు. ఉదయం రిజిస్ట్రేషన్లు మొదలైనప్పటి నుంచే ఈ సమస్య తలెత్తింది.

►ALSO READ | శ్రీశైలంలో శ్రీ భ్రమరాంబికాదేవి అమ్మవారికి వచ్చేనెల 7న కుంభోత్సవం ..

స్లాట్ బుక్ చేసుకున్న భూములు, ఇండ్ల అమ్మకందారులు, కొనుగోలుదారులు గంటల తరబడి సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో వేచి చూడాల్సి వచ్చింది. కొంతమంది మధ్యాహ్నం వరకూ వేచి చూసి ఇండ్లకు వెళ్లిపోయారు. సర్వర్ డౌన్ కారణంగా క్రయ, విక్రయదారులకు తీవ్ర నిరాశ ఎదురైంది. రిజిస్ట్రేషన్ కోసమని ఉద్యోగాలు, ఇతర పనులు మాని ఆఫీసులకు వచ్చిన వారికి టైమంతా వృథా అయింది. చాలా రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో కనీస వసతులు కూడా లేకపోవడంతో దూరప్రాంతాల నుంచి వచ్చినవారు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.