తెలుగు బిగ్‌బాస్: హాట్‌ హాట్‌గా సాగిన నామినేషన్ ప్రక్రియ

తెలుగు బిగ్‌బాస్:  హాట్‌ హాట్‌గా  సాగిన నామినేషన్ ప్రక్రియ

సోమవారం వస్తే చాలు.. బిగ్‌బాస్ హౌస్‌లో అగ్నిపర్వతాలు బద్దలవుతుంటాయి. ఎలిమినేషన్‌ కోసం నామినేషన్ వేసే ప్రక్రియలో ఒకరిపై ఒకరు చేసే కామెంట్లు, వేసే సెటైర్లు పెద్ద గొడవనే సృష్టిస్తుంటాయి. ఇవాళ కూడా అదే జరిగింది. నామినేషన్ ప్రక్రియ యమా హాట్‌ హాట్‌గా సాగింది. 

ప్రీప్లాన్డ్ నామినేషన్స్

మూడు వారాలు గడిచాయి కదా.. అందుకో ఏమో.. అందరూ నామినేషన్ల విషయంలో ఫుల్ క్లారిటీతో ఉన్నారు. ఎవరి పేర్లు చెప్పాలో ముందే డిసైడైపోయారు. ప్రక్రియ మొదలు కాకముందు చూపించిన కొన్ని సీన్స్ చూస్తే అది అర్థమైపోతుంది. ఇక నామినేషన్స్ మొదలయ్యాక పెద్ద రభసే జరిగింది. శాటర్‌‌డే ఎపిసోడ్‌లో అర్జున్‌ని, కీర్తిని నాగార్జున డైరెక్ట్ నామినేట్ చేశారు కనుక ఇక ఎవ్వరూ వాళ్ల పేర్లు చెప్పొద్దన్నాడు బిగ్‌బాస్. కెప్టెన్ కనుక ఆదిరెడ్డి ముందే సేవ్ అయ్యాడు. మిగతా వాళ్లంతా యుద్ధానికి సిద్ధమయ్యారు. నామినేట్ చేసినవాళ్లు రీజన్ చెప్పడం.. అవతలివాళ్లు డిఫెండ్ చేసుకోవడం బానే ఉంది కానీ.. కొందరు లిమిట్స్ దాటడంతో రచ్చ రచ్చయ్యింది. మధ్యలో పక్కవాళ్లతో మాట్లాడుతూ నవ్వుతున్న చంటికి బిగ్‌బాస్ చిన్న వార్నింగ్ ఇచ్చాడు. నామినేషన్ల సమయంలో చేస్తున్న కామెడీని వారమంతా చేస్తే బాగుంటుందని సెటైర్ వేశాడు. ఆయన ఎందుకలా అన్నాడో తెలియక చంటి కాసేపు కన్‌ఫ్యూజ్ అయ్యాడు. మిగతావాళ్లు మాత్రం ఇవేమీ పట్టించుకునే స్థితిలో లేరు. ఎవరి ఎమోషన్స్ లో వాళ్లు ఉన్నారు. చివరికి కీర్తి, అర్జున్లతో పాటు ఇనయా, రేవంత్, సూర్య, శ్రీహాన్, సుదీప, గీతూ, రాజ్, ఆరోహి నామినేట్ అయ్యారు. 

ఇనయా ఫైట్.. శ్రీహాన్ లైట్

దేనినైనా తేలికగా తీసి పారేస్తాడు శ్రీహాన్. ఏ కారణం లేనిచోట కూడా ఏదో ఒకటి వెతికి దెబ్బలాడుతుంది ఇనయా. ఇక వీళ్లిద్దరికీ గొడవ వస్తే ఎలా ఉంటుందో చెప్పతరమా! ఇవాళ నామినేషన్ల సమయంలో వీళ్ల మధ్య చిచ్చు రేగింది. ఇనయాని నామినేట్ చేసేటప్పుడు మళ్లీ పిట్టకథ ఎత్తుకున్నాడు శ్రీహాన్. నేను నిన్ను అనలేదు, అలా ఎలా తీసుకుంటావ్ అంటూ క్వశ్చన్ చేశాడు. బేసిగ్గా నెగిటివ్ కామెంట్స్ తట్టుకోలేక తిరబడిపోయే ఇనయా అరవడం మొదలెట్టింది. ఏదో చెబుదామని చూసి, చెప్పినా ఉపయోగం లేదని గ్రహించి, ఆమెని ఎలాగో అవాయిడ్ చేసి వెళ్లిపోయాడు శ్రీహాన్. అతనిని తిరిగి నామినేట్ చేసి తన కసి తీర్చుకుంది ఇనయా. అయితే ఆమెతో శ్రీహాన్ మామూలుగా ఆడుకోలేదు. నెత్తిమీద టొమాటోని స్మాష్ చేయడానికి ఆమె వస్తే.. తల అందించకుండా ఆవులించాడు. ఆ తర్వాత ఆమె రెయిజ్ చేసిన పాయింట్‌కి అదిరిపడ్డాడు. నీ వయసు తక్కువ అని నువ్వు అన్నావ్, అంటే నా వయసు ఎక్కువనా, నీకు నా గురించి ఏం తెలుసని నా వయసు ఎక్కువని చెప్పావ్ అంటూ ఎవరూ ఊహించని విచిత్రమైన పాయింట్‌తో గొడవాడటం మొదలెట్టింది ఇనయా. నేను నిన్ను అనలేదు, నాకంత వయసు లేదని చెప్పాను అని అతను ఎంత చెప్పినా వినకుండా వాదిస్తూనే ఉంది. పైగా నేను నీకంటే లావుగా ఉంటాను, నాది పెద్ద పర్సనాలిటీ, అంతమాత్రాన అనేస్తావా అంటూ ఇనయా ఎక్కడెక్కడికో వెళ్లిపోవడంతో శ్రీహాన్‌తో పాటు మిగతావారు కూడా అవాక్కయ్యారు. అసలు దానికీ దీనికీ సంబంధమేంటి, నువ్వేం మాట్లాడుతున్నావ్ అంటూ నెత్తీ నోరూ కొట్టుకున్నా ఆమె వినకపోవడంతో విసిగిపోయి వదిలేశాడు. ఇవాళ ఇనయాని దాదాపు అందరూ నామినేట్ చేశారు. వాళ్లందరితోనూ గొడవ పెట్టుకుందామె. పైగా మీ ఇష్టం వచ్చినట్టు అనుకోండి, నేనింతే అన్నట్టుగా యాటిట్యూడ్ చూపించింది. ఇది ఇనయాకి మైనస్ అయ్యే చాన్స్ లేకపోలేదు. 

ఆరోహి ఆవేశం.. రేవంత్ ఆక్రోశం

ఇనయా తర్వాత హౌస్‌లో ఎవరైనా ఎక్కువ ఇరిటేట్ అవుతారు అంటే అది ఆరోహినే. అయితే కోపం రాలేదు, ఇలాంటివి నాకు లెక్క లేదు, చాలా లైట్ తీసుకుంటున్నాను అనే కలర్ ఇవ్వడానికి ట్రై చేస్తుంటుంది. గీతూలాగే కేర్‌‌లెస్‌గా బిహేవ్ చేయడానికి ట్రై చేస్తుంది. అయితే ఏం చేసినా గీతూ కాన్ఫిడెంట్‌గా కనిపిస్తుంది. కానీ ఆరోహి నెగిటివ్ కామెంట్స్ తీసుకోలేక అలా చేస్తోందని చూసేవారికి ఈజీగా అర్థమైపోతుంది. ఇవాళా అంతే. ఆరోహికి నామినేషన్ ప్రక్రియలో షాకులు బానే తగిలాయి. చాలామంది తనని నామినేట్ చేశారు. అయితే ప్రతిసారీ నేనింతే, నీకు నచ్చకపోయినా నేనేం చేయలేను అంటూ చాలా నిర్లక్ష్యంగా మాట్లాడింది. ఆవేశం తన్నుకొచ్చినా అణచుకునే ప్రయత్నం చేసింది కానీ కొన్నిసార్లు బయటపడిపోయింది. ఇక రేవంత్ మళ్లీ తన ఆక్రోశాన్ని బయటపెట్టాడు. ఒక సిల్లీ రీజన్‌తో శ్రీసత్యని నామినేట్ చేశాడు. పకోడీలు చేసేటప్పుడు పక్కవాళ్ల పకోడీలు బాగా వస్తున్నాయని ఆమె చెప్పడం తనని హర్ట్ చేసిందట. కష్టపడి చేస్తున్నప్పుడు ఎవరైనా వచ్చి అలా చెబితే మండుతుంది అన్నాడు. మనకింకా టైమ్ ఉంది కాబట్టి ఇంకా బెటర్‌‌ చేసుకోవచ్చేమోనని అలా చెప్పాను అని శ్రీసత్య ఎంత చెప్పినా మనోడి బుర్రకి ఎక్కలేదు. నేను హర్ట్ అయ్యాను హర్ట్ అయ్యాను అంటూ అదే పాట పాడాడు. ఎవరు తనని నామినేట్ చేసినా నవ్వుతూ తీసుకోవడం చూసి చాలా మారాడు అనిపించింది. కానీ అతను నామినేట్ చేసేటప్పుడు చెప్పిన ఈ రీజన్‌ విన్న తర్వాత ఇంకా చైల్డిష్‌గానే ఆలోచిస్తున్నాడని అర్థమయ్యింది. 

కీర్తికి కోపమొచ్చింది

హౌస్‌లో కూల్‌గా ఉండే అతి తక్కువమందిలో కీర్తి కూడా ఉంటుంది. అయితే ఇవాళ మాత్రం ఆమెలో ఆవేశం కట్టలు తెంచుకుంది. ముందుగా ఆమె ఇనయాని నామినేట్ చేసింది. ఆటలో తను చేసిన పొరపాట్ల గురించి చెప్పింది. అయితే ఇనయాకి ఓపికగా వినే అలవాటు లేదు కాబట్టి మధ్యలో దూరిపోయింది. అప్పుడు చాలా అసహనాన్ని ప్రదర్శించింది కీర్తి. అయినా కూడా వదల్లేదు. తాను చెప్పాలనుకున్నది చెప్పాకే ఆపింది. ఇక ఆ తర్వాత రేవంత్‌ని నామినేట్ చేసింది. నా బాధలన్నింటినీ పక్కనపెట్టి ఆటమీద ఫోకస్ పెడితే బాగుంటుందని నువ్వు వెళ్లి ఆరోహి దగ్గర చెప్పడం నచ్చలేదంది. దానికి రేవంత్ ఒప్పుకోలేదు. నేను నీ మంచి కోసమే చెప్పాను అన్నట్టు మాట్లాడాడు. కానీ అలా ఎందుకు చెప్పాలి అంటూ అరిచింది కీర్తి. ప్రతిసారీ నా బాధల గురించి ఎందుకు తీసుకొస్తారు, నా లైఫ్‌లోని బాధ నా ఆటలో ఎక్కడ కనిపిస్తోంది, నిజంగా నేనలా చేస్తే ఎప్పుడో బైటికి వెళ్లిపోయేదాన్ని, అసలు ఇక్కడి వరకు వచ్చేదాన్నే కాదు, ఇంకోసారి నా పెయిన్ గురించి మాట్లాడొద్దు అంటూ చాలా గట్టిగా కేకలేసింది. అయినా పకోడీలు ఇంకాస్త బాగా చేయమని సలహా ఇస్తేనే తట్టుకోలేని రేవంత్‌.. తను మాత్రం పక్కవాళ్ల ఆట గురించి ఎందుకు సలహాలిస్తాడో, వాళ్ల పర్సనల్ విషయాలను సైతం ఎందుకు టచ్ చేస్తాడో! 

మొత్తానికి ఇలా హౌస్‌మేట్స్ అందరూ ఇవాళ సెగలు, పొగలు కక్కారు. తనని ఎవరు ఎందుకు నామినేట్ చేస్తున్నారో అర్థం కానట్టుగా రాజ్ ఫేస్ పెట్టాడు. ఎప్పటిలాగే క్లియర్ కట్ రీజన్స్ చంటి అదరగొట్టాడు. కాన్ఫిడెన్స్ అనుకుంటూ ఓవర్‌‌ కాన్ఫిడెంట్‌గా బిహేవ్ చేసే గీతూ ఈసారి కూడా అదే ఫాలో అయ్యింది. ఎప్పుడూ లేనిది ఫైమా కూడా కాస్త యాటిట్యూడ్ చూపించింది. సుదీప ఎప్పటిలానే స్పష్టంగా ఉంది. సూర్యలో కాస్త క్లారిటీ తక్కువయ్యిందనిపించింది. శ్రీసత్య అలవాటు ప్రకారం కూల్‌గా అనిపించింది. అర్జున్‌లో ఎందుకో ఏదో అయోమయం కనిపించింది. ఇక రోహిత్, మెరీనాలు సరే సరి. ఏం చెబితే ఎవరేమంటారో అన్నట్టు రీజన్స్ చెప్పారు. ఆ తర్వాత తమ పని అయిపోయిందన్నట్టు జాగ్రత్తగా సైడైపోయారు. ఈ నామినేషన్ల ఎఫెక్ట్ నెక్స్ట్ ఆడే ఆట మీద ఎలా ఉంటుందో ఏమో మరి!