కాంగ్రెస్ లో జోష్​!..హైదరాబాద్ కు డీకే

కాంగ్రెస్ లో జోష్​!..హైదరాబాద్ కు డీకే
  • కాంగ్రెస్ లో జోష్​!
  • సాయంత్రం హైదరాబాద్ కు డీకే
  • అభ్యర్థుల కట్టడికి ముందస్తు వ్యూహం
  • రైతుబంధు పైసలు బిల్లులకు మళ్లించ్చొద్దు
  • సీఈవో వికాస్ రాజ్ కు హస్తం నేతల వినతి
  • రేవంత్ రెడ్డి ఇంటి వద్ద భద్రత పెంపు
  • పీసీసీ చీఫ్ నివాసానికి పెరిగిన లీడర్ల తాకిడి  

హైదరాబాద్ : ఎగ్జిట్ పోల్స్ అన్నీ అనుకూలంగా ఉండటం.. జనం మార్పుకోరుకున్నారన్న నిఘా వర్గాల నివేదికలతో కాంగ్రెస్ లో జోష్ రెట్టింపయ్యింది. నిన్న విడుదల చేసిన ఇండియా టుడే సర్వేలోనూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోందని రావడంతో హస్తం లీడర్ల ఆనందానికి అవధుల్లేవు. అభ్యర్థులు చేజారకుండా ఉండేందుకు కాంగ్రెస్ అధిష్టానం రంగంలోకి దిగింది.  ఇవాళ సాయంత్రమే కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ హైదరాబాద్ వస్తున్నారు. ఫలితాలు వెలువడగానే కౌంటింగ్ కేంద్రం నుంచి విజేతలను బెంగళూరుకు తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసినట్టు తెలుస్తోంది. గెలుపుపై పూర్తి భరోసాతో ఉన్న కాంగ్రెస్ నేతలు సీఈవో వికాస్ రాజ్ ను కలిసి రైతుబంధు నిధులను కాంట్రాక్టర్ల బిల్లులకు మళ్లిస్తున్నారని, వాటిని నిలుపుదల చేయించాలని కోరారు. 

డీకే ఆపరేషన్

తెలంగాణలో గెలుపు ఖాయం అనే ధీమాతో ఉన్న కాంగ్రెస్ అలర్ట్ గానే ఉంది. కాంగ్రెస్ నేతలతో పాటు అగ్రనేతల కష్టం కూడా ఫలించబోతోందనే అంచనాలతో కౌంటింగ్ ప్రక్రియపై పార్టీ ప్రధానంగా దృష్టి సారించింది. కౌంటింగ్ పూర్తి అయి తమ నేతల గెలుపు ప్రకటన రాగానే వారిని కర్ణాటక తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా సమాచారం. ఈ ఆపరేషన్ టాస్క్ ను అధినాయకత్వం కర్నాటక డిప్యూటీ  సీఎం డీకే శివకుమార్ కు అప్పగించింది.  రేపు ఓట్ల కౌంటింగ్ జరునున్న క్రమంలో ఇవాళ సాయంత్రమే దీకే శివకుమార్ హైదరాబాద్ వస్తున్నారు. కౌంటింగ్ పరిశీలించడంతోపాటు గెలిచిన తమ ఎమ్మెల్యేలను కాపాడుకునే యత్నంలో శివకుమార్ అత్యంత కీలకంగా వ్యవహరిస్తారని తెలుస్తోంది.

9న ఎల్బీ స్టేడియంలో ప్రమాణం!

గెలుపుపై పూర్తి విశ్వాసంతో ఉన్న కాంగ్రెస్ డిసెంబర్ 9న ప్రమాణస్వీకారానికి ముహూర్తాన్ని కూడా ఖరారు చేసుకుంది. ఎల్బీ స్టేడియం వేదికగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు ప్రకటిచింది. తొలిరోజే ఆరు గ్యారెంటీలపై సంతకం చేస్తామని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు.  

రేవంత్ రెడ్డి ఇంటి వద్ద భద్రత పెంపు

కాంగ్రెస్ గెలువబోతోందనే సంకేతాల నేపథ్యంలో పీసీసీ చీఫ్ రేవంత్ ఇంటి వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేశారు. సుమారు 30 మంది పోలీసులు రేవంత్ ఇంటి చుట్టుప‌క్క‌ల భ‌ద్ర‌త‌కు కేటాయించ‌డం గ‌మ‌నార్హం. మెజార్టీ ఎగ్జిట్ పోల్స్‌లో కాంగ్రెస్ పార్టీదే అధికారం అని తెలవడంతో రేవంత్‌రెడ్డి ఇంటి వద్ద పోలీసులు అధిక సంఖ్యలో మోహరించార‌ని కాంగ్రెస్ వ‌ర్గాలు చెబుతున్నాయి. పోలింగ్ అంచనాలు కాంగ్రెస్‌ పార్టీకి అనుకూలంగా వస్తుండడంతో నాయకులు, కార్యకర్తలు రేవంత్‌రెడ్డి ఇంటికి భారీగా తరలివస్తున్నారు. వచ్చిన వాళ్లంతా సీఎం..సీఎం అంటూ నినాదాలు చేస్తుండటం గమనార్హం. మరో వైపు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు, రాష్ట్ర స్థాయి నేతలు రేవంత్ రెడ్డి ఇంటికి వస్తున్నారు. దీంతో ఆ పరిసరాలు ఇవాళ్టి నుంచే సందడిగా మారాయి. 

భూ బదలాయింపుపై ఫిర్యాదు

ఆపధర్మ బీఆర్ఎస్ ఆపధర్మ ప్రభుత్వంపై కాంగ్రెస్ నేతలు ఈసీకి ఫిర్యాదు చేశారు. కాసేపటి క్రితం సీఈవో ఆఫీసుకు వచ్చిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మధుయాష్కీ గౌడ్ తదితరులు ధరణి పోర్టల్‌లో అసైన్డ్ భూములను బీఆర్ఎస్ నేతలు తమ బినామీల పేర్ల మీదకు బదలాయింపు చేసుకుంటున్నారని ఫిర్యాదు చేశారు. కాంట్రాక్టర్లకు చెల్లింపులు చేస్తోందని అందువల్ల కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయ్యే వరకు ప్రభుత్వ ఖజానా నుంచి చెల్లింపులు జరగకుండా చర్యలు తీసుకోవాలని ఈసీకి ఫిర్యాదు చేశారు. రైతుబంధు కోసం సమకూర్చిన నిధులు బీఆర్ఎస్ ప్రభుత్వం పక్కదారి మళ్లిస్తోందని ఫిర్యాదు చేశారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయ్యే వరకు ప్రభుత్వ ఖజానా నుంచి చెల్లింపులు జరగకుండా చర్యలు తీసుకోవాలని ఈసీని కోరారు. రైతుబంధు కోసం సమకూర్చిన నిధులు బీఆర్ఎస్ ప్రభుత్వం పక్కదారి మళ్లిస్తోందని చెప్పారు.  

నాలుగు అంశాలపై ఫిర్యాదు

1. రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో అసైన్డు ల్యాండ్ రికార్డులను మార్చుతున్నారు

2. రైతుబంధు నిధులను మళ్లించి తమకు అనుకూలమైన కాంట్రాక్టర్లకు బిల్లులు ఇస్తున్నారు

3. డిసెంబర్ 4న సీఎం కేసీఆర్ అధ్యక్షతన కేబినెట్ మీటింగ్ నిర్వహణపైనా .. 

4. ఓల్డ్ సిటీలోని కొన్ని ప్రాంతాల్లో రిగ్గింగ్ జరింది చర్యలు తీసుకోవాలి.