DUSU ఎన్నికల్లో ఏబీవీపీ హవా.. ప్రెసిడెంట్ పోస్ట్‎తో పాటు 3 కీలక పదవులు కైవసం

DUSU ఎన్నికల్లో ఏబీవీపీ హవా.. ప్రెసిడెంట్ పోస్ట్‎తో పాటు 3 కీలక పదవులు కైవసం

న్యూఢిల్లీ: ఢిల్లీ యూనివర్శిటీ స్టూడెంట్స్ యూనియన్ (DUSU) ఎన్నికల్లో బీజేపీ అనుబంధ సంస్థ ఏబీవీపీ ఘన విజయం సాధించింది. అధ్యక్ష, ఉపాధ్యక్ష, కార్యదర్శి, జాయింట్ సెక్రటరీ నాలుగు పదవులకు జరిగిన ఎన్నికల్లో ఏబీవీపీ మూడు స్థానాల్లో విజయఢంకా మోగించింది. అధ్యక్ష పదవితో పాటు సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ పోస్టులను ఏబీవీపీ కైవసం చేసుకుంది. ఉపాధ్యక్ష పదవిని అనూహ్యంగా స్వతంత్ర అభ్యర్థి దక్కించుకున్నాడు. కాంగ్రెస్ అనుబంధ సంస్థ ఎన్‎ఎస్‎యూఐకి ఒక్క స్థానం కూడా దక్కకపోవడం గమనార్హం. 

గెలిచింది వీరే..

ఢిల్లీ యూనివర్శిటీ స్టూడెంట్స్ యూనియన్ అధ్యక్షుడిగా ఏబీవీపీ అభ్యర్థి యశ్ దబాస్ విజయం సాధించాడు. ఎన్‌ఎస్‌యూఐకి చెందిన ప్రత్యర్థి విజయ్ మీనాపై యశ్ దబాస్ గెలుపొందాడు.  స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన దీపాంశు షోకీన్ అనూహ్యంగా ఉపాధ్యక్ష పదవిని దక్కించుకున్నాడు. ఏబీవీపీ, ఎన్ఎస్‎యూఐ అభ్యర్థులను షోకీన్ ఓడించాడు. సెక్రటరీ ఎన్నికలో ఏబీవీపీ అభ్యర్థిని రియా ఛావ్డి విజయం సాధించింది. ఏబీవీపీ అభ్యర్థి లక్ష్య రాజ్ సింగ్ జాయింట్ సెక్రటరీ పదవిని కైవసం చేసుకున్నాడు.

ఎన్ఎస్‎యూఐకి బిగ్ షాక్

కాంగ్రెస్ అనుబంధ సంఘం ఎన్ఎస్‎యూఐకి 2026 డీయూఎస్‎యూ ఎన్నికల్లో బిగ్ షాక్ తగిలింది. గత ఎన్నికల్లో ఉపాధ్యక్ష పదవిని దక్కించుకున్న ఎన్ఎస్‎యూఐ ఈసారి అది కూడా కోల్పోయింది. తాజా ఎన్నికల్లో ఎన్ఎస్‎యూఐ ఒక్క పదవిని కూడా దక్కించుకోలేకపోయింది. 

నీట్ లీకేజీని నిరసిస్తూ జెన్ జీ యువత కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనలు తెలిపిన తర్వాత జరిగిన ఎన్నికలు కావడంతో ఢిల్లీ యూనివర్శిటీ స్టూడెంట్స్ యూనియన్ ఎన్నికలపై దేశవ్యాప్తంగా సర్వత్రా ఆసక్తి నెలకొంది. 

బీజేపీ అనుబంధ సంస్థ ఏబీవీపీకి ఈ సారి ఎదురుగాలి తప్పదని ప్రచారం జరిగింది. కానీ ఏబీవీపీ ఆ అనుమానలన్నింటినీ పటాపంచలు చేస్తూ మూడు కీలక పదవులు దక్కించుకుంది. అధ్యక్ష పీఠాన్ని నిలబెట్టుకోవడంతో పాటు సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ పోస్టులను కైవసం చేసుకుంది. తద్వారా గత ఎన్నికల్లో గెలిచిన ఈ మూడు పదవులను ఏబీవీపీ మరోసారి నిలబెట్టుకుని సత్తా చాటింది.