
మరో భారీ మల్టీలెవల్ మార్కెటింగ్ మోసం బయటపడింది. ఈబిజ్ డాట్ కం ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఆన్ లైన్ లో 58 రకాల కంప్యూటర్ కోర్సులు, బిజినెస్ ఆపర్చునిటీస్ అంటూ ఎరవేసింది. మరింత మందిని చేర్పిస్తే కమీషన్ ఇస్తామంటూ ఆశ పెట్టింది. ఏవో నాసిరకం లెర్నింగ్ మెటీరియల్, చీప్ క్లాస్ డ్రెస్ క్లాత్ ను అంటగట్టింది. సుమారు వెయ్యి కోట్ల రూపాయలను కొల్లగొట్టింది. జగిత్యాలకు చెందిన ఓ విద్యార్థి ఫిర్యాదుతో సైబరాబాద్ పోలీసులు కూపీ లాగడంతో మొత్తం బాగోతం బయటపడింది.
విద్యార్థులు, నిరుద్యోగులను టార్గెట్ చేసి.. వెయ్యి కోట్లు వసూలు చేసిన మరో మల్టీలెవల్ మార్కెటింగ్ కంపెనీ మోసం బయటపడింది. ఢిల్లీ శివార్లలోని నోయిడా కేంద్రంగా ‘ఈ-లెర్నింగ్’దందా చేసిన ఈబిజ్ డాట్ కంప్రైవేట్ లిమిటెడ్ వ్యవహారాన్ని సైబరాబాద్ పోలీసులు ఛేదించారు. ఈ వివరాలను సైబరాబాద్ సీపీ సజ్జనార్ మంగళవారం మీడియాకు వెల్లడించారు.
కోర్సుల్లేవ్ .. ఏమీ లేవు..
పవన్ మల్హాన్ అనే వ్యక్తి 2001లో నోయిడా కేంద్రంగా ఈబిజ్డాట్ కం ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని ఏర్పాటు చేశాడు. అతను ఎండీగా ఉండగా, భార్య అనితా మల్హాన్ డైరెక్టర్ గా ఉన్నారు. వారి కుమారుడు హితిక్ మల్హా న్ (31) కంపెనీ వ్యవహారాలను చూస్తుంటాడు. ఈ- లెర్నింగ్ ద్వారా58 రకాల కంప్యూటర్ కోర్సులు నేర్పిస్తామని, ఆకర్షణీయమైన బిజినెస్ అవకాశాలు ఉన్నాయని వారు ఊదరగొట్టారు. నెట్ వర్క్ ఏర్పాటు చేసుకుని.. పెద్ద పెద్ద హోటళ్లు, రెస్టారెంట్లలో సెమినార్లు నిర్వహించి గాలం వేశారు. ఒక్కొ క్కరి నుంచి మెంబర్షిప్ కోసం రూ.16,821 చొప్పున వసూలు చేశారు. వారు మరికొందరిని చేర్పిస్తే.. నెల నెలా భారీగా కమీషన్ వస్తుందని ఆశ చూపారు. నెల నెలా రూ.2,700 నుంచి రూ.25 వేల వరకు వస్తుందంటూ టార్గెట్లు పెట్టారు. ఎక్కువ మందిని చేర్పిస్తే ఖరీదైన బహుమతులిస్తామని, ఫారిన్ టూర్లకు తీసుకెళతామని చెప్పారు. ఇలా మల్టీలెవల్ మార్కెటింగ్ తో 7 లక్షల మంది వరకు చేరారు. అయితే సభ్యులు పెట్టిన టార్గెట్ మేరకు కొత్తవారిని చేర్పించకపోతే డబ్బులేమీ ఇవ్వలేదు. బిజినెస్ పేరిట ఈ సంస్థ ఇచ్చే వస్తువులు కూడా నాసిరకంగా ఉండటం, ఎక్కువ ధర చెప్పడంతో చాలా మంది ఇబ్బంది పడ్డారు. ఈ-లెర్నింగ్ పేరిట లక్ష లాది మందిని చేర్చుకున్నా ఎలాంటి కోచింగ్ ఇవ్వలేదు. ఆన్ లైన్ లో లభించే సాధారణ కోచింగ్ వీడియోలు, మెటీరియల్ నే అంటగట్టారు.
జగిత్యాల స్టూ డెంట్ ఫిర్యాదుతో..
ఈబిజ్ మాయలో పడి జగిత్యా ల జిల్లా మహాలక్ష్మీ నగర్ కు చెందిన వివేక్ అనే డిగ్రీ విద్యార్థి సభ్యుడిగా చేరాడు. కమీషన్ వస్తుందని ఆశపెట్టడంతో మరో ఎనిమిది మందిని చేర్పించాడు. అయితే ఈ–లెర్నింగ్ ప్రాజెక్టు అంతా నాసి రకంగా ఉంది. కమీషన్ కూడా ఇవ్వలేదు. దీంతో తన డబ్బులు తనకు తిరిగిచ్చేయాలని వివేక్ ఈబిజ్ నిర్వా హకులను కోరాడు. వారు ఇవ్వకపోవడంతో సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై కేసు పెట్టిన పోలీసులు.. లోతుగా ఆరా
తీయడంతో దందా మొత్తం బయటపడింది. ఈబిజ్ కంపెనీ, నిర్వాహకులపై చిట్ ఫండ్, మనీ సర్క్యులేషన్, చీటింగ్ కేసులు నమోదు చేశారు. సంస్థ బ్యాంకు ఖాతాల్లోని రూ.70.5 కోట్ల సొమ్మును ఫ్రీజ్ చేయించి, హితిక్ మల్హా న్ ను అరెస్టు చేశారు. ప్రధాన నిందితులు పవన్ మల్హా న్, అతని భార్య అనితా మల్హా న్ ను కూడా అరెస్టు చేస్తామని సీపీ సజ్జనార్ తెలిపారు. జమ్మూకాశ్మీర్ , ఢిల్లీ, యూపీ, మహారాష్ట్ర, గోవా, తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల్లో బాధితులు ఎక్కువగా ఉన్నారని, సుమారు 7 లక్షల మందిని ఈబిజ్ సంస్థ మోసం చేసిందని చెప్పారు. మొత్తంగా సుమారు రూ.1,000 కోట్లు వసూలు చేసినట్టు అంచనా వేస్తున్నామని తెలిపారు.