బలహీన వర్గాల కోసం ఒక మెట్టు దిగడానికైనా సిద్దమే: సీఎం రేవంత్

బలహీన వర్గాల కోసం ఒక మెట్టు దిగడానికైనా సిద్దమే: సీఎం రేవంత్

దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలన్న కేంద్రం నిర్ణయంపై స్పందించిన సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. కుల గణన చేయాల్సిన అనివార్యతకి మోదీని నెట్టేశామని.. ఎన్నికల ముందు బీజేపీ కుట్రను తిప్పి కొట్టినాం కాబట్టే మోదీ నిర్ణయాలు మార్చుకున్నారని అన్నారు. బలహీన వర్గాల కోసం ఒక మెట్టు దిగడానికి కూడా తాను సిద్ధమేనని.. ప్రధాని మోదీ మమ్మల్ని పిలిచినా వెళ్ళి మా సలహాలు, సూచనలు ఇస్తామని స్పష్టం చేశారు సీఎం రేవంత్. 

మోదీకి 400 సీట్లు వస్తే రిజర్వేషన్లు తీసేవాళ్ళని..  రాజ్యాంగ స్వరూపాన్ని మార్చేసేవాళ్ళని అన్నారు. ప్రజలను అప్రమత్తం చేయడం వల్లే మోదీకి 400 సీట్లు రాకుండా అపగలిగామని అన్నారు. కులగణన ద్వారా రాజకీయంగా లబ్ధి పొందాలని బీజేపీ ప్రయత్నిస్తోందని.. మోదీ తనను అనుకరిస్తున్నారని స్థానిక బీజేపీ నాయకులు అక్కసు వెళ్లగక్కుతున్నారని మండిపడ్డారు సీఎం రేవంత్.

కులగణన కోసం తెలంగాణ మోడల్ ను ఆదర్శంగా తీసుకోవాలని.. మంత్రుల కమిటీ వెంటనే నియమించాలని, మంత్రుల కమిటీకి తోడుగా నిపుణుల కమిటీని వేయాలని అన్నారు సీఎం రేవంత్. ఈ రెండు కమిటీలతో దేశవ్యాప్తంగా అధ్యయనం చేయించాలని డిమాండ్ చేశారు సీఎం రేవంత్. తూతూ మంత్రంగా కుల గణన చేస్తే దానితో ఎలాంటి ఉపయోగం ఉండదని.. కుల గణన దేశాన్ని జిరాక్స్ తీసినట్టు అవుతుందని.. జిరాక్స్ తీస్తే రోగం ఏంటి? ఏ మందు వేయాలి అని తెలుస్తుందని అన్నారు. 

►ALSO READ | కులగణన సమస్యలపై మంత్రుల కమిటీ వేయాలి: సీఎం రేవంత్

తమ ప్రభుత్వం ప్రజల నుండి, ప్రజా సంఘాల నుండి అనేక విషయాలు, సూచనలు తీసుకొని కుల గణన చేసిందని అన్నారు. కులగణనపై మంత్రుల కమిటీ ఎప్పటికప్పుడు పర్యవేక్షించిందని.. కుల గణన చేసిన తర్వాత పబ్లిక్ డొమైన్ లో పెట్టామని అన్నారు. కుల గణనలో పాల్గొనని వాళ్ళకి మరోసారి అవకాశం ఇచ్చామని.. మూడు నెలల్లోనే ఎలాంటి ఇబ్బందులు రాకుండా కుల గణన చేశామని అన్నారు. 

కుల గణన విషయంలో కేంద్రంతో కలిసి నడవడానికి మేం సిద్ధంగా ఉన్నామని.. కుల గణన విషయంలో కేంద్రానికి వచ్చే సందేహాలకు సమాధానం ఇవ్వడానికి మేం సిద్ధంగా ఉన్నామని అన్నారు.1931 తర్వాత కుల గణన చేసింది తెలంగాణ ప్రభుత్వమే అని.. కుల గణన విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తరపున కేంద్రానికి అన్ని రకాలుగా మద్దతు ఇస్తామని స్పష్టం చేశారు సీఎం రేవంత్.