- కొకైన్, హెరాయిన్‌కు కేరాఫ్ అడ్రస్‌గా మారిన ఆఫ్రికన్లు
- ఫేక్ పాస్ పోర్టులు, వీసా ముగిసినా సిటీలోనే మకాం వేస్తున్న నైజీరియన్లు
- డ్రగ్స్‌ను కట్టడి చేసేందుకు సొంత దేశానికి పంపుతున్న ఈగల్ ఫోర్స్
- గత మూడేండ్లలో 65 మంది అరెస్ట్, 58 మందిని డిపోర్ట్ చేసిన ఈగల్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో డ్రగ్స్ సప్లయ్ చేస్తున్న నైజీరియన్లు సహా ఇతర విదేశీయులపై ఈగల్ (ఎలిట్‌యాక్షన్ గ్రూప్ ఫర్ డ్రగ్ లా ఎన్‌ఫోర్స్‌మెంట్) డిపోర్టేషన్ అస్త్రాన్ని ప్రయోగిస్తోంది. కొకైన్, హెరాయిన్, ఎండీఎంఏ లాంటి సింథటిక్ డ్రగ్స్ కేసుల్లో పట్టుబడిన వారితో పాటు ఫేక్ పాస్‌పోర్టులు, వీసా గడువు ముగిసినప్పటికీ అక్రమంగా నివాసం ఉంటున్న ఫారినర్స్‌ను సొంత దేశాలకు తరలిస్తోంది.
ఇందులో భాగంగా గత మూడేండ్లలో డ్రగ్స్ కేసుల్లో చిక్కిన 65 మంది ఆఫ్రికన్లలో 58 మందిని డిపోర్ట్ చేసింది. ఈ క్రమంలోనే వీసా గడువు ముగిసిన మరో ఏడుగురిని అరెస్ట్ చేసి సొంత దేశాలకు తరలించారు. ఇందుకోసం ఫారినర్స్ రీజినల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్స్ (ఎఫ్‌ఆర్‌ఆర్‌వో), ఇమ్మిగ్రేషన్‌తో కలిసి డేటా సేకరిస్తున్నారు.
సిటీలో ఇల్లీగల్ నివాసం.. ఇల్లీగల్ యాక్టివిటీస్
నైజీరియన్లు సహా ఆఫ్రికా దేశాలకు చెందిన ఫారినర్స్ చదువు, బిజినెస్, హెల్త్, టూరిస్ట్ వీసాలపై ఇండియాకు వస్తున్నారు. హైదరాబాద్ సహా దేశంలోని మెట్రో సిటీస్‌లో షెల్టర్ తీసుకుంటున్నారు. హెరాయిన్, కొకైన్ వంటి ఖరీదైన డ్రగ్స్‌కు నైజీరియన్లు కేరాఫ్ అడ్రస్‌గా మారుతున్నారు. ఆఫ్రికా దేశాల్లో డ్రగ్స్ వాడకం లీగల్ కావడంతో.. అప్పటికే డ్రగ్స్ బానిసలైన ఆఫ్రికన్లు చదువుల పేరిట హైదరాబాద్‌కు వచ్చిన తర్వాత కూడా కొకైన్, హెరాయిన్, ఎల్‌ఎస్‌డీ బ్లాట్స్ సహా మరికొన్ని రకాల డ్రగ్స్‌ను తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే యువతను మత్తుకు బానిసలు చేస్తున్నారు. గోవా, ముంబై నుంచి ప్రత్యేక సరఫరా వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటున్నారు. చదువు, బిజినెస్, హెల్త్, టూరిస్ట్ వీసాలపై వచ్చి హైదరాబాద్ సహా ఇండియా వ్యాప్తంగా డ్రగ్స్ దందా చేస్తున్నారు.
అరెస్టులు, బెయిల్‌పై వచ్చి మళ్లీ డ్రగ్స్ దందా
స్థానికులను మాదకద్రవ్యాలకు బానిసలుగా చేసి వారితోనే సప్లయింగ్ నెట్‌వర్క్ ఏర్పాటు చేసుకుంటున్నారు. వీసాల గడువు ముగిసినప్పటికీ తిరిగి వెళ్లకుండా అక్రమంగా నివాసం ఉంటున్నారు. డ్రగ్స్ కేసుల్లో అరెస్టు చేస్తున్నప్పటికీ బెయిల్‌పై రాగానే మళ్లీ డ్రగ్స్ సప్లయ్ చేస్తున్నారు. మరికొంత మంది జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత గోవా, ముంబై, బెంగళూర్ సహా ఇతర రాష్ట్రాలకు మకాం మార్చుతున్నారు. ఆ తర్వాత కోర్టు విచారణకు హాజరుకావడం లేదు. దీంతో కేసులు పెండింగ్‌లో ఉండగా ఫారినర్లు శిక్షల నుంచి తప్పించుకుంటున్నారు. దీంతో డ్రగ్స్ సప్లయ్‌కి అడ్డుకట్ట పడడంలేదు. ఈ క్రమంలోనే వారిపై డిపోర్టేషన్ అస్త్రం ప్రయోగిస్తున్నారు.

