వెంటాడి.. వేటాడారు.. ఈగల్ టీం, నార్కో‎టిక్ బ్యూరో భారీ ఆపరేషన్.. 500 కేజీల గంజాయి సీజ్

వెంటాడి.. వేటాడారు.. ఈగల్ టీం, నార్కో‎టిక్ బ్యూరో భారీ ఆపరేషన్.. 500 కేజీల గంజాయి సీజ్

హైదరాబాద్: తెలంగాణలో గంజాయి, మాదకద్రవ్యాలపై ఉక్కుపాదం మోపేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన ఎలైట్‌ యాంటీ-నార్కోటిక్స్‌ గ్రూప్‌ ఫర్‌ లా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ (ఈగల్‌) టీం దూకుడుగా ముందుకెళ్తోంది. లేటేస్ట్‎గా ఈగల్ టీం మరో భారీ ఆపరేషన్ చేపట్టింది. సినీ రేంజ్‎లో జరిగిన ఈ ఆపరేషన్‎లో ఖమ్మం నార్కోటిక్స్ బ్యూరో అధికారులు ఈగల్ టీమ్‎కు సహయం చేశారు. ఇరువురు కలిసి జాయింట్ ఆపరేషన్ చేపట్టి దాదాపు 500 కిలోల గంజాయి పట్టుకున్నారు. 

వివరాల ప్రకారం.. ఒడిశా నుంచి తెలంగాణ మీదుగా లారీలో 500 కేజీల గంజాయి వారణాసి తరలిస్తు్న్నట్లు ఈగల్ టీమ్‎కు సమాచారం అందింది. వెంటనే రంగంలోకి దిగిన ఈగల్ టీమ్ నిందితులను పట్టుకునేందుకు ఖమ్మం నార్కోటిక్స్ బ్యూరో అధికారులతో కలిసి జాయింట్ ఆపరేషన్ చేపట్టారు. మంగళవారం (అక్టోబర్ 21) రాత్రి మొత్తం నిందితుల వాహనాన్ని ఛేజ్ చేశారు పోలీసులు. 

పోలీసుల రాకను పసిగట్టిన నిందితులు లారీ వేగం పెంచారు. అయినప్పటికీ పోలీసులు వెంటాడటంతో పోలీసుల కళ్లు గప్పి ట్రక్‎ను దారి మళ్లించారు. వెంటనే అప్రమత్తమైన ఈగల్ టీమ్ తెలివిగా జీపీఎస్ ద్వారా లారీ అడ్రస్‎ను ట్రాక్ చేశారు. ట్రక్ జార్ఖండ్‎లో ఉన్నట్లు గుర్తించి ఈ మేరకు రాంచీ ఎన్సీబీకి సమాచారం అందించారు తెలంగాణ పోలీసులు.

వెంటనే రంగంలోకి దిగిన రాంచీ ఎన్సీబీ అధికారులు.. గంజాయ్ లోడ్‎తో వెళ్తున్న లారీని రాంచీ-జార్ఖండ్ మధ్యలో పట్టుకున్నారు. అనంతరం నిందితులను తెలంగాణ పోలీసులకు అప్పగించిన రాంచీ అధికారులు. నిందితులను అదుపులోకి తీసుకుని.. లారీతో పాటు 500 కేజీల గంజాయిను స్వాధీనం చేసుకున్నారు తెలంగాణ పోలీసులు.