వరుస భూకంపాలు..24 గంటల్లో ఐదుసార్లు

 వరుస భూకంపాలు..24 గంటల్లో ఐదుసార్లు

వరుస భూకంపాలతో జమ్మూ, కశ్మీర్, లడఖ్ వణికిపోతోంది. 24 గంటల్లో ఐదుసార్లు భూమి కంపించడం స్థానికంగా భయాందోళనకు గురిచేస్తోంది. తాజగా జూన్ 18వ తేదీ ఆదివారం ఉదయం 8.28 గంటలకు లడఖ్ లోని లేహ్ జిల్లాలో భూకంపం సంభవించింది.  రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 4.3గా నమోదైంది. లేహ్‌కు ఈశాన్య 279 కిలోమీటర్ల దూరంలో  భూకంపం సంభవించినట్లు  నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ప్రకటించింది. అంతకుముందు  తెల్లవారుజామున 2.16 గంటలకు లేహ్‌  జిల్లాలో భూమి కంపించింది.  రిక్టర్ స్కేల్ పై దీని తీవ్రత 4.1గా నమోదయిందని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సీస్మోలజీ వెల్లడించింది. భూ అంతర్భాగంలో 10 కిలోమీటర్ల లోతులో  భూకంప కదలికలు గుర్తించినట్లు తెలిపింది. లేహ్‌కు 295 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉందని పేర్కొంది. ఆతర్వాత జమ్మూ కాశ్మీర్‌లోని కత్రా  సమీపంలో మరో  భూకంపం సంభ‌వించింది. కత్రాకు తూర్పున 80 కిలోమీటర్ల దూరంలో తెల్లవారుజామున 3.50 గంటలకు 11 కిలోమీటర్ల లోతులో 4.1 తీవ్రతతో భూమి కంపించింది.

ఐదు సార్లు 

24 గంటల్లో జమ్మూ, కశ్మీర్, లడఖ్ లో  ఐదు తేలికపాటి-తీవ్రతతో భూకంపాలు సంభవించాయి.  జూన్ 17వ తేదీ శనివారం మధ్యాహ్నం 2.03 గంటలకు జమ్మూ కాశ్మీర్‌లో 3.0 తీవ్రతతో మొదట ప్రకంపనలు చోటు చేసుకున్నారు. జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారి వెంబడి రాంబన్ జిల్లాలో భూకంప కేంద్రం ఉందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. ఈ భూకంపం లోతు ఉపరితలం నుండి 5  కిలోమీటర్ల దిగువన ఉందని ప్రకటించింది. 

జూన్ 17వ తేదీ శనివారం రాత్రి 9.44 గంటలకు 4.5 తీవ్రతతో లేహ్ ప్రాంతంలో మరోసారి భూకంపం సంభ‌వించింది. భూకంప కేంద్రం లద్దాఖ్‌కు ఈశాన్యంగా 271 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆ తర్వాత మరో  15 నిమిషాల్లోనే జమ్మూ కాశ్మీర్‌లోని దోడా జిల్లాలో రాత్రి 9.55 గంటలకు 4.4 తీవ్రతతో భూమి కంపించింది. అయితే గడిచిన‌ ఐదు రోజుల్లో దోడా జిల్లాలో ఏడు సార్లు భూమి కంపించడం గమనార్హం.