ప్రైవేట్​ సేవలు వాడుకుందామన్న.. సర్కార్​  పడనీయలే

ప్రైవేట్​ సేవలు వాడుకుందామన్న.. సర్కార్​  పడనీయలే
  •     మమ్మల్ని సక్కగ పని చేయనివ్వలే 
  •     ప్రజలు చనిపోతున్నా చలనం లేదు 
  •     ఇప్పటికైనా సర్కార్ కండ్లు తెరవాలె 
  •     ఫ్రీగా టీకాలు, ట్రీట్ మెంట్ ఇయ్యాలె    
  •     మాజీ మంత్రి  ఈటల రాజేందర్​

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ప్రజలు చనిపోతున్నా  ప్రభుత్వంలో కనీసం చలనం లేదని వైద్య, ఆరోగ్య శాఖ మాజీ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. కరోనా కట్టడి కోసం గతంలో తాము చాలా ప్రయత్నించామని, కానీ చేయాల్సినంత పని చేసే పరిస్థితి తమకు కల్పించలేదన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కండ్లు తెరిచి ప్రజలను కాపాడాలన్నారు. ప్రైవేట్ హాస్పిటళ్లు, డాక్టర్ల సేవలను వాడుకోవాలని తాము ప్రయత్నం చేయగా.. సర్కార్ పడనివ్వలేదన్నారు. రాష్ట్రంలో ప్రజలకు రూపాయి ఖర్చు కాకుండా వ్యాక్సిన్ అందుబాటులోకి తేవాలని ఈటల అన్నారు. 

అవసరమైనన్ని టెస్టింగ్ కిట్లు తెప్పిస్తేనే టెస్టులు పెంచొచ్చని చెప్పారు. బ్లాక్, వైట్ ఫంగస్ ట్రీట్ మెంట్లకు రూ. 25 లక్షల వరకూ ఖర్చవుతోందని, ఈ బాధ్యతను ప్రభుత్వమే తీసుకోవాలన్నారు. దీనిని ఆరోగ్యశ్రీలో చేర్చి పేదలకు ఫ్రీగా ట్రీట్ మెంట్ అందించాలని సూచించారు.  ‘రాష్ట్రంలో కొవిడ్ కల్లోలం - సర్కార్ నిర్లక్ష్యం’ అంశంపై శనివారం ప్రొఫెసర్ జయశంకర్ మానవ వనరుల అభివృద్ధి కేంద్రం చైర్మన్ పంజుగుల శ్రీశైల్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన వెబినార్ లో ఈటల, ప్రొఫెసర్ కోదండరాం, సీనియర్ జర్నలిస్టు కె. రామచంద్రమూర్తి, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.  

రాష్ట్రం దివాళా: కొండా విశ్వేశ్వర్ రెడ్డి 

రాష్ట్రంలో ఆరోగ్యం, ఆర్థిక పరిస్థితి ఇంత దారుణంగా మారి, దివాళా తీయడానికి సీఎం కేసీఆరే కారణమని కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. దేశంలోనే హెల్త్ కు అతితక్కువగా కేటాయించిన రాష్ట్రం మనదేనన్నారు. ఆరేండ్లుగా హెల్త్ కు కేటాయించిన బడ్జెట్ లో 45 శాతం నిధులే ఇచ్చారని విమర్శించారు. అంగన్ వాడీల నుంచి నిమ్స్, టిమ్స్ ల వరకూ ఇన్ఫాస్ట్రక్చర్ ను మెరుగుపర్చాల్సిన అవసరం ఉందన్నారు. వ్యాపారవేత్తలు కోట్లాది రూపాయలతో పీపీఈ కిట్లు కొని ఇస్తామంటే.. కేసీఆర్ వద్దన్నారని, డబ్బులు మాత్రమే ఇవ్వాలన్నారని తప్పుపట్టారు. 

కలిసి పనిచేయాలె: రామచంద్రమూర్తి 

కరోనా పట్ల మనం చాలా నిర్లక్ష్యంగా, పొగరుతో ఉన్నామని సీనియర్ జర్నలిస్టు కె. రామచంద్రమూర్తి అన్నారు. మన సిటీలో తయారవుతున్న వ్యాక్సిన్ కూడా మనకు దొరకట్లేదన్నారు. కేంద్రంలో, రాష్ట్రంలో సీఎం, పీఎం తప్ప వేరెవరూ మాట్లాడలేని పరిస్థితి ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యాక్సినేషన్ ను గాలికి వదిలేసిందన్నారు. పరిస్థితిని చక్కదిద్దేందుకు సీఎం కేసీఆర్ వెంటనే అన్ని పార్టీలు, సంఘాలతో వర్చువల్ మీటింగ్స్ నిర్వహించాలని సూచించారు. వెబినార్ లో డాక్టర్ శంకర్, డాక్టర్ పాపారావు, ప్రొఫెసర్ పీఎల్ విశ్వేశ్వర రావు, సయ్యద్ బద్రుద్దీన్, అంబటి శ్రీనివాస్, భైరి రమేష్, గోపగాని శంకర్ రావు, డోలి సత్యనారాయణ తదితరులు మాట్లాడారు.

కేసీఆర్‌‌‌‌‌‌‌‌కు అవగాహన లేదు: కోదండరాం 

రాష్ట్రం కరోనాతో అల్లకల్లోలం అవుతుంటే.. హైదరాబాద్ లో కూర్చున్న ముఖ్యమంత్రికి క్షేత్ర స్థాయి పరిస్థితులపై అవగాహన లేదని ప్రొఫెసర్ కోదండరాం విమర్శించారు. కరోనా కట్టడిలో సర్కార్ చేతులెత్తేసిందని 15 రోజుల పాటు చేసిన తమ సర్వేలో తేలిందన్నారు. ప్రభుత్వం ప్రజల ప్రాణాలను గాలికి వదిలేసిందన్నారు. ప్రజలు కేంద్రంగా పాలన జరగాలని, వెంటనే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజాసంఘాలు, ఎన్జీవోలు, మేధావులను నిర్ణయాల్లో భాగస్వాములను చేయాలని సూచించారు. కరోనా కట్టడికి చేపట్టాల్సిన 9 డిమాండ్లను ఈ వెబినార్ ప్రభుత్వం ముందు ఉంచుతోందని ప్రకటించారు. డిమాండ్ల సాధన కోసం ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా మౌన దీక్షలు చేపట్టాలని కోదండరాం పిలుపునిచ్చారు.