పశ్చిమాసియాలో పదహారో రోజూ భీకర యుద్ధం... తొలిసారి యుద్ధంలో ‘డ్యాన్సింగ్’ మిసైళ్ల ప్రయోగం  

పశ్చిమాసియాలో పదహారో రోజూ భీకర యుద్ధం... తొలిసారి యుద్ధంలో ‘డ్యాన్సింగ్’ మిసైళ్ల ప్రయోగం  
  • ఇరాన్​లోని ఇస్ఫహాన్ ప్రావిన్స్ పై ఇజ్రాయెల్ అటాక్​ 
  • గల్ఫ్ దేశాల్లోని చమురు కేంద్రాలపై ఇరాన్ ప్రతీకారదాడులు 
  • ఖర్గ్ ఐలాండ్​పై ‘సరదాగా’ మరిన్ని దాడులు చేస్తం: ట్రంప్  
  • ఇరాన్ డీల్ కోసం వచ్చింది.. టర్మ్స్ బాలేవని ఒప్పుకోలేదని కామెంట్  
  • యుద్ధం ముగించేందుకైనా.. లాంగ్ వార్​కైనా మేం రెడీ: ఇరాన్​
  • నెతన్యాహు బతికి ఉంటే వేటాడి చంపుతామని వార్నింగ్​

టెహ్రాన్/జెరూసలెం/వాషింగ్టన్: పశ్చిమాసియాలో అటూ ఇటూ బాంబులు మోతలు, మిసైళ్ల వర్షం కొనసాగుతున్నాయి. యుద్ధం మొదలై పదహారు రోజులవుతున్నా.. ఇటు అమెరికా, ఇజ్రాయెల్ గానీ.. అటు ఇరాన్ గానీ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదన్నట్టుగా డ్రోన్లు, మిసైళ్లతో విరుచుకుపడుతున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్ దళాలు ఆదివారం ఇరాన్ మధ్య ఇస్ఫహాన్ ప్రావిన్స్ లోని పలు ప్రాంతాలపై పెద్ద ఎత్తున క్షిపణి దాడులు కొనసాగించాయి. 

ఈ దాడుల్లో డజన్ల సంఖ్యలో ప్రజలు మరణించినట్లు వార్తలు వచ్చాయి. పశ్చిమ ఇరాన్‌‌‌‌లోని సైనిక మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని తమ వాయుసేన దాడులను నిర్వహించినట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్, బాసిజ్ విభాగానికి చెందిన పలు కేంద్ర కమాండ్ సెంటర్లపై దాడులు చేసినట్లు వారు ‘ఎక్స్‌‌‌‌’లో పేర్కొన్నారు. ఇజ్రాయెల్​తోపాటు ఈ ప్రాంతంలోని ఇతర దేశాలపై దాడులను ప్లాన్ చేయడానికి, సమన్వయం చేయడానికి ఈ కేంద్రాలను వాడుతున్నారని ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. పశ్చిమ, మధ్య ఇరాన్‌‌‌‌లోని ప్రభుత్వ నియంత్రణ కేంద్రాలపై దాడులను మరింత విస్తరిస్తున్నట్లు ఇజ్రాయెల్ ఆర్మీ వెల్లడించింది. ఈ దాడులకు ప్రతిస్పందనగా, ఇరాన్ కూడా ఇజ్రాయెల్​పై వరుస క్షిపణి దాడులు చేపట్టింది. 

దుబాయ్, సౌదీ, ఇరాక్, కువైట్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలపై కూడా తాము దాడులు చేశామని ఇరాన్ ప్రకటించింది. కువైట్‌‌‌‌లో అమెరికాతో కలిసి ఉమ్మడిగా ఉపయోగిస్తున్న ఇటాలియన్ సైనిక స్థావరంపై డ్రోన్ దాడి జరిగినట్లు ఇటలీ సైన్యం ధృవీకరించింది. లెబనాన్​లోని నబాటీ సమీపంలో జరిగిన ఒక వైమానిక దాడిలో ఒక వ్యక్తి, సిడాన్ సిటీలోని అపార్ట్​మెంట్​పై జరిగిన దాడిలో నలుగురు చనిపోయారు. కాగా, ప్రధాన పోర్టులను ఖాళీ చేయాలని ఇరాన్ శనివారం హెచ్చరించిన నేపథ్యంలో ఆదివారం బహ్రెయిన్, సౌదీ అరేబియా, యూఏఈ తమ పౌరులను అప్రమత్తం చేశాయి.   

గల్ఫ్ దేశాల చమురు కేంద్రాలపై ఇరాన్ దాడులు

ఇరాన్ చమురులో 90% ప్రాసెస్ చేసే కీలకమైన ఖర్గ్ ఐలాండ్‌‌‌‌పై అమెరికా దాడి చేయడంతో గల్ఫ్​లో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఆదివారం సౌదీ అరేబియాలోని రాస్ తనూరా రిఫైనరీ, ఖతార్‌‌‌‌లోని రాస్ లఫాన్ గ్యాస్ ప్రాసెసింగ్ బేస్, యూఏఈలోని రువైస్ రిఫైనరీ కాంప్లెక్స్ వంటి వాటిపై ఇరాన్ దాడులు చేసింది. మరోవైపు  ఇజ్రాయెల్​లోని టెల్ అవీవ్​పై ఇరాన్ క్షిపణుల వర్షం కురిపించడంతో భారీ శబ్దాలు వినిపించాయి. దుబాయ్‌‌‌‌లోని మెరీనా, అల్ సుఫుహ్ ప్రాంతాలు ఆదివారం భారీ శబ్దాలతో దద్దరిల్లాయి. ఇరాన్ నుంచి వస్తున్న క్షిపణి, డ్రోన్ ముప్పులను గగనతల రక్షణ వ్యవస్థలు విజయవంతంగా అడ్డుకోవడంతో ఈ శబ్దాలు వచ్చాయని నగర మీడియా కార్యాలయం తెలిపింది. 

ఇరాన్ జరిపిన దాడుల వల్ల యూఏఈకి చెందిన ఫుజైరా చమురు టెర్మినల్ కార్యకలాపాలు నిలిచిపోయాయి. అధికారులు గంటల తరబడి మంటలను అదుపు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటనలో ఒక జోర్డాన్ పౌరుడు గాయపడినట్లు తెలిసింది. కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంపై కూడా పలు డ్రోన్లు దాడి చేశాయి. బహ్రెయిన్ రాజధాని మనామాలో కూడా పేలుళ్లు సంభవించాయి. ఇరాన్ దాడులు మొదలైనప్పటి నుంచి 125 క్షిపణులు, 203 డ్రోన్లను అడ్డుకున్నట్లు బహ్రెయిన్ తెలిపింది. ఈ పరిస్థితుల కారణంగా ఏప్రిల్‌‌‌‌లో బహ్రెయిన్, సౌదీ అరేబియాలో జరగాల్సిన ఫార్ములా వన్ రేసులను రద్దు చేశారు. అమెరికా దళాలు ఉన్న సౌదీ అరేబియాలోని అల్-ఖర్జ్ బేస్‌‌‌‌పై కూడా క్షిపణి దాడి జరిగింది. ఇరాన్ ప్రయోగించిన 85 క్షిపణులు, డ్రోన్లలో 79 వాటిని అడ్డుకున్నట్లు జోర్డాన్ సైన్యం తెలిపింది.

ఇరాన్​లో 1,444కు చేరిన మరణాలు 

ఇరాన్​పై ఇజ్రాయెల్, అమెరికా దాడుల్లో మృతిచెందిన వారి సంఖ్య 1,444కు చేరింది. మరణించిన వారిలో 223 మంది మహిళలు, 202 మంది పిల్లలు ఉన్నారని ఇరాన్ ఆరోగ్య శాఖ వెల్లడించింది. అయితే, మానవ హక్కుల సంఘం 'హెంగావ్' నివేదిక ప్రకారం ఇరాన్ లో ఇప్పటివరకు దాదాపు 4,900 మంది మరణించి ఉండొచ్చని భావిస్తున్నారు. హెచ్ఆర్ఏఎన్ఏ వంటి సంస్థలు కనీసం 3,040 మంది చనిపోయినట్లు పేర్కొంటున్నాయి. లెబనాన్​లో 850 మంది ప్రాణాలు కోల్పోయారు. 

ఇజ్రాయెల్ వైమానిక దాడుల కారణంగా దాదాపు 8,50,000 మంది ప్రజలు తమ ఇళ్లను వదిలి సురక్షిత ప్రాంతాలకు వెళ్లారు. ఇజ్రాయెల్ మిసైల్ దాడి కారణంగా ఇరాన్ స్పేస్ రీసెర్చ్ సెంటర్ తీవ్రంగా దెబ్బతింది. ఇక, ఇరాన్ దాడుల్లో గల్ఫ్ దేశాల్లో కనీసం12 మంది పౌరులు మరణించారు. వీరిలో ఎక్కువ మంది వలస కార్మికులు ఉన్నారు. ఇరాన్ క్షిపణి దాడుల వల్ల ఇజ్రాయెల్ లో 12 మంది ప్రాణాలు 
కోల్పోయారు. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి కనీసం 13 మంది అమెరికా సైనికులు మరణించారు.

తొలిసారి ‘డ్యాన్సింగ్’ మిసైల్స్ 

ఇరాన్ తన అత్యంత శక్తివంతమైన 'సెజ్జిల్' క్షిపణులను ఆదివారం ప్రయోగించిందని ఇరాన్ వార్తా సంస్థ ప్రెస్ టీవీ వెల్లడించింది. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఈ క్షిపణిని ఇరాన్ వాడటం ఇదే మొదటిసారి అని తెలిపింది. సెజ్జిల్ మిసైల్ ఇరాన్ స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన రెండు దశల సాలిడ్ ప్రొపెల్లెంట్ బాలిస్టిక్ క్షిపణి. గగనతలంలో ప్రయాణించే తీరును బట్టి దీనికి "డ్యాన్సింగ్ మిసైల్" అనే పేరు కూడా ఉంది. 

ఇది 2 వేల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదు. సుమారు 700 కిలోల పేలుడు పదార్థాలను మోసుకెళ్లగలదు. లిక్విడ్ ఇంధన క్షిపణుల కంటే ఘన ఇంధన క్షిపణులను చాలా త్వరగా సిద్ధం చేసి ప్రయోగించవచ్చు. ఇది రాడార్లకు చిక్కకుండా వేగంగా దాడులు చేయడానికి ఉపయోగపడుతుంది. గగనతలంలో దిశను మార్చుకుంటూ ప్రయాణించగలదు. దీనివల్ల ఇజ్రాయెల్ కు చెందిన 'ఐరన్ డోమ్' వంటి గగనతల రక్షణ వ్యవస్థలు దీనిని అడ్డుకోవడం చాలా కష్టమని రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు. 

ఇరాన్​లో పెరుగుతున్న వలసలు 

ఇరాన్ నగరాల్లో పరిస్థితులు దిగజారుతున్నాయని, రక్షణ కోసం చాలా మంది ఇరానియన్లు ఉత్తర ప్రావిన్సులకు వెళ్తున్నారని ఐక్యరాజ్యసమితి అనుబంధ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ సంస్థ ఆదివారం తెలిపింది. విమానాశ్రయాలు, ముఖ్యంగా ఇరాక్‌‌‌‌తో ఉన్న సరిహద్దులు మూసివేసినప్పటికీ.. ఇరానియన్లు పొరుగు దేశాలకు పారిపోతున్నారని ఆ సంస్థ పేర్కొంది. దాదాపు 32,000 మంది అఫ్గానిస్తాన్‌‌‌‌కు, 4,000 మంది పాకిస్తాన్‌‌‌‌కు వెళ్లారు. 

గతంలో సిరియా, అఫ్గానిస్తాన్ యుద్ధాల వల్ల తలెత్తిన శరణార్థుల సంక్షోభం యూరప్, తుర్కియే, ఉత్తర ఆఫ్రికా దేశాల్లో వనరులపై ఒత్తిడి పెంచి రాజకీయ విభేదాలకు దారితీసింది. ఇప్పుడు ఇరాన్ యుద్ధం కారణంగా మళ్లీ పెద్ద సంఖ్యలో ప్రజలు తమ ఇళ్లను వదిలి వెళ్లాల్సి వస్తుందని పొరుగు దేశాలు ఆందోళన చెందుతున్నాయి.


యూఏఈపైనే 1800కుపైగా డ్రోన్లు, మిసైల్స్

ఈ యుద్ధంలో ఇరాన్ ఇతర దేశాల కంటే ఎక్కువగా యూఏఈపైనే 1,800కుపైగా క్షిపణులు, డ్రోన్లను ప్రయోగించింది. ఇందులో 1,600 డ్రోన్లు, 294 బాలిస్టిక్ క్షిపణులు, 15 క్రూయిజ్ క్షిపణులు ఉన్నాయి. ఈ దాడుల్లో ఆరుగురు మరణించగా, 141 మంది గాయపడ్డారు. ఒక్క శనివారమే యూఏఈపైకి 9 బాలిస్టిక్ క్షిపణులు, 33 డ్రోన్లను ఇరాన్ ప్రయోగించింది. అయితే, సురక్షిత ప్రాంతం అనే తన ప్రతిష్టను కాపాడుకోవడానికి యూఏఈ ప్రయత్నిస్తోంది. 

"పుకార్లను ప్రచారం చేయవద్దని", "భద్రతా లేదా కీలక ప్రాంతాలను ఫోటోలు తీయవద్దని" పోలీసులు హెచ్చరించారు. క్షిపణి, డ్రోన్ దాడుల దృశ్యాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసినందుకు 19 మంది ఇండియన్లు సహా 35 మంది విదేశీయులను యూఏఈ పోలీసులు అరెస్ట్ చేశారు. దాడుల అనంతర దృశ్యాలను వీడియో తీసి పోస్ట్ చేసినందుకు బహ్రెయిన్​లోనూ ఆరుగురు అరెస్ట్ అయ్యారు.