
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు కేంద్ర ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో వేడుకలు ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈసీ అనుమతి ఇవ్వడంతో జూన్ 2వ తేదీన ఆవిర్భావ వేడుకల ఏర్పాట్లపై.. మే 24వ తేదీ శుక్రవారం ఉన్నతాధికారులతో సీఎస్ శాంతికుమారి సమీక్ష చేశారు. తొలుత అమరవీరుల స్థూపం గన్ పార్క్ దగ్గర సీఎం రేవంత్ రెడ్డి నివాళులర్పించనున్నారు. అక్కడ నుంచి సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ కి వెళ్లనున్నారు.
రాష్ట్రం వచ్చి పదేండ్లు పూర్తైన సందర్భంగా వైభవంగా వేడుకలు నిర్వహించేలా సర్కార్ ప్లాన్ చేస్తోంది. పదేండ్ల పండుగను ఊరువాడలా నిర్వహించాలని కసరత్తు చేస్తోంది. ఆవిర్భావ వేడుకలకు సోనియా గాంధీని ఆహ్వానించాలని రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. అదే రోజు రాష్ట్ర గీతం, రాష్ట్ర చిహ్నం, తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించనుంది కాంగ్రెస్ సర్కార్. వేడుకల్లో గీతంతో పాటు రాష్ట్ర రాజముద్ర ఆవిష్కరించేందుకు కసరత్తు చేస్తోంది.