న్యూఢిల్లీ: దేశంలోని10 రాష్ట్రాల్లో 37 మంది రాజ్యసభ సభ్యుల పదవీ కాలం ఏప్రిల్‌లో పూర్తికానుంది. దాంతో ఆయా స్థానాల్లో సభ్యులను ఎన్నుకోవడానికి కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) బుధవారం షెడ్యూల్ రిలీజ్ చేసింది. ఈ షెడ్యూల్ ప్రకారం.. ఈ నెల 26న రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్ జారీకానుంది. నామినేషన్లు మార్చి 5 వరకు స్వీకరిస్తారు. 6న స్క్రూటినీ జరుగుతుంది. 9వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువిచ్చారు.
మార్చి 16న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. అదేరోజు సాయంత్రం 5 గంటలకు ఓట్లను కౌటింగ్ చేసి, ఫలితాలను ప్రకటించనున్నారు. మహారాష్ట్రలో ఏడుగురు, తమిళనాడులో ఆరుగురు, పశ్చిమ బెంగాల్లో ఐదుగురు, బిహార్ లో ఐదుగురు, ఒడిషాలో నలుగురు, అస్సాంలో ముగ్గురు, ఛత్తీస్‌గఢ్ లో ఇద్దరు, తెలంగాణలో ఇద్దరు, హర్యానాలో ఇద్దరు, హిమాచల్ ప్రదేశ్ లో ఒక్కరు చొప్పున రాజ్యసభ సభ్యుల పదవీకాలం ఏప్రిల్‌లో ముగియనుంది.
పదవీకాలం ముగుస్తున్న వారిలో కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే (కర్నాటక), ఎన్‌సీపీ (ఎస్‌పీ) నాయకుడు శరద్ పవార్ (మహారాష్ట్ర), శివసేన (యూబీటీ)కి చెందిన ప్రియాంక చతుర్వేది (మహారాష్ట్ర), రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (అథవాలే) అధినేత రాందాస్ అథవాలే (మహారాష్ట్ర), తెలంగాణలో కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ మను సింఘ్వీ వంటి ప్రముఖులున్నారు.
