9 రాష్ట్రాలు, 3 యూటీల్లో ‘సర్’ షురూ.. రెండో విడతను ప్రారంభించిన ఈసీ

9 రాష్ట్రాలు, 3 యూటీల్లో ‘సర్’ షురూ.. రెండో విడతను ప్రారంభించిన ఈసీ

న్యూఢిల్లీ: తొమ్మిది రాష్ట్రాలు, మూడు కేంద్రపాలిత ప్రాంతాల్లో ఓటర్ల జాబితా ‘ప్రత్యేక సమగ్ర సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్–సర్)’ ప్రక్రియకు ఎన్నికల సంఘం శ్రీకారం చుట్టింది. మొదటి విడతలో భాగంగా బిహార్ లో ఓటర్ల జాబితా సవరణను పూర్తి చేసిన ఈసీ.. తాజాగా రెండో విడతలో 12 రాష్ట్రాలు, యూటీల్లో ప్రాసెస్ ను మంగళవారం ప్రారంభించింది. ఈ విడతలో చత్తీస్ గఢ్, గోవా, గుజరాత్, కేరళ, మధ్యప్రదేశ్, రాజస్తాన్, తమిళనాడు, వెస్ట్ బెంగాల్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు, లక్షద్వీప్, అండమాన్ అండ్ నికోబార్ ఐల్యాండ్స్, పుదుచ్చేరి యూటీల్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ మొదలుపెట్టింది. 

ఫేజ్ 2లో సర్ ప్రక్రియ డిసెంబర్ 4 వరకూ కొనసాగుతుందని ఈసీ ప్రకటించింది. డిసెంబర్ 9న ముసాయిదా ఓటర్ల జాబితాను వెలువరిస్తామని, అభ్యంతరాలను పరిశీలించిన తర్వాత వచ్చే ఏడాది ఫిబ్రవరి 7న తుది ఓటర్ల జాబితాను ప్రచురిస్తామని వెల్లడించింది. రెండో విడతలో ఓటర్ల జాబితా సవరణ జరుగుతున్నవాటిలో తమిళనాడు, కేరళ, వెస్ట్ బెంగాల్ తోపాటు పుదుచ్చేరిలో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. 

అస్సాంలో కూడా వచ్చే ఏడాదే అసెంబ్లీ ఎన్నికలు జరనున్నప్పటికీ, ఆ రాష్ట్రంలో సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సిటిజన్ షిప్ ధ్రువీకరణ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ ప్రక్రియ ముగిసిన తర్వాత అస్సాం ఓటర్ల జాబితా సవరణను ప్రత్యేకంగా చేపట్టనున్నట్టు ఈసీ తెలిపింది. కాగా, తొలి విడతలో బిహార్​లో 7.42 కోట్ల మంది పేర్లతో ఫైనల్ ఓటర్ లిస్ట్​ను సెప్టెంబర్ 30న ఈసీ ప్రచురించింది. కాగా, ఈసీ చేపట్టిన సర్ ప్రక్రియను తమిళనాడు, బెంగాల్​లోని అధికార పార్టీలు డీఎంకే, టీఎంసీ వ్యతిరేకిస్తున్నాయి