అస్సాం అసెంబ్లీ, పార్లమెంట్​ సీట్ల డీలిమిటేషన్ ప్రాసెస్ షురూ

అస్సాం అసెంబ్లీ, పార్లమెంట్​ సీట్ల డీలిమిటేషన్ ప్రాసెస్ షురూ

కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడి

న్యూఢిల్లీ, వెలుగు : అస్సాం అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ (డీలిమిటేషన్) చేపట్టామని కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) తెలిపింది. ఈ మేరకు మంగళవారం ఈసీఐ ఒక ప్రకటన విడుదల చేసింది. అస్సాంలో డీలిమిటేషన్ ప్రక్రియ చేపట్టాలని ఈ ఏడాది నవంబర్ 15 న కేంద్ర న్యాయ మంత్రిత్వశాఖ తమను కోరిందని ఈసీఐ తెలిపింది. కేంద్ర న్యాయ శాఖ సూచనల మేరకు ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని 1950 లో సెక్షన్ 8ఏ ప్రకారం  డీలిమిటేషన్‌‌ను ప్రక్రియ ప్రారంభించామని వెల్లడించింది.

అందులో భాగంగా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్, ఎన్నికల కమిషనర్లు అనుప్ చంద్ర పాండే, అరుణ్ గోయల్ నేతృత్వంలోని కమిషన్.. అస్సాం ప్రధాన ఎన్నికల అధికారికి ఆదేశాలు జారీ చేసింది. జనవరి 1, 2023 నుంచి డీలిమిటేషన్ ప్రక్రియ పూర్తయ్యే వరకు రాష్ట్రంలో నూతన అడ్మినిస్ట్రేటివ్ యూనిట్లను ఏర్పాటు చేయరాదని ఆదేశించింది. రాజ్యాంగంలో ఆర్టికల్ 170  ప్రకారం 2001 జనాభా  లెక్కల ఆధారంగా పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాల డీలిమిటేషన్  చేపడతామని కమిషన్ వెల్లడించింది. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత కేంద్ర, రాష్ట్ర గెజిట్ ల ద్వారా పబ్లిక్ నుంచి అభ్యంతరాలు, సూచనలు కోరతామని తెలిపింది.